DailyDose

బెజవాడ కనకదుర్గమ్మను దరిచుకున్న తమిళసై-TNI నేటి తాజా వార్తలు

బెజవాడ కనకదుర్గమ్మను దరిచుకున్న తమిళసై-TNI నేటి తాజా వార్తలు

బెజవాడ కనకదుర్గమ్మను దరిచుకున్న తమిళసై

బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలంగాణ గవర్నర్‌ తమిళసై అన్నారు. విజయవాడ కనక దుర్గమ్మను ఆమె ఇవాళ దర్శించుకున్నారు. ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు ఆమె హైదరాబాద్‌ నుంచి.. తొలుత ఇండిగో విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయంలో కలెక్టర్ రాజాబాబు, ఇతర ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. అనంతరం ఇంద్రకీలాద్రికి చేరుకున్న గవర్నర్‌ తమిళసైకు దుర్గామల్లేశ్వరస్వామి దేవాలయం పాలకమండలి ఛైర్మన్‌ కర్నాటి రాంబాబు, ఈవో భ్రమరాంబ, వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం తమిళసైకి పండితులు వేదాశీర్వచనం అందించారు. దేవస్థానం తరఫున అమ్మవారి ప్రసాదం, చిత్రపటాన్ని ఇచ్చారు. చంద్రయాన్- 3 విజయవంతమైనందుకు సంతోషంగా ఉందని, ఆదిత్య-ఎల్‌ 1 విజయవంతం కావాలని దుర్గమ్మను వేడుకున్నట్లు ఈ సందర్భంగా గవర్నర్‌ తమిళసై తెలిపారు.

రాష్ట్ర సర్కార్ నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీ ప్రారంభం

రాష్ట్రంలో నిరుపేదలు ఆత్మగౌరవంతో జీవించాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం రెండు పడక గదుల ఇళ్ల పథకం తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ పథకం ద్వారా రాష్ట్రంలో ఎంతో మంది పేదలు లబ్ధి పొందారు. ఇక జీహెచ్​ఎంసీ పరిధిలోని లబ్ధిదారుల కోసం రాష్ట్ర సర్కార్ నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీ ఇవాళ ప్రారంభమైంది. జీహెచ్ఎంసీ పరిధిలోని 24 నియోజకవర్గాల్లో ఏకకాలంలో రాష్ట్ర మంత్రులు తలసాని, హరీశ్ రావు, మల్లారెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మారావు, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి డబుల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీకి శ్రీకారం చుడుతున్నారు.మొదటగా కుత్బుల్లాపూర్, బాచుపల్లిలో డబుల్ ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో తలసాని పాల్గొని పంపిణీని ప్రారంభించారు. దేశ చరిత్రలో పేదలు ఆత్మగౌరవంతో బతికేలా డబుల్ బెడ్ రూంలు ఇవ్వడం అద్భుతమని తలసాని కొనియాడారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా అర్హత ఉన్న కుటుంబాలను అధికారులు వడపోసి ఎంపిక చేశారని తెలిపారు. తొలి విడతలో రానివారు బాధపడొద్దన్న మంత్రి తలసాని మిగతా దశల్లో వస్తుందని భరోసా ఇచ్చారు.

ఢిల్లీలో నేడు ఫుల్‌ డ్రస్‌ రిహార్సల్‌

దేశ రాజధాని న్యూఢిల్లీలో ఈ నెల 8 నుంచి 10 వరకు జీ-20 దేశాల సమ్మిట్‌ జరుగుతున్న విషయం తెలిసిందే. వాస్తవంగా జీ-20 సమ్మిట్‌ 8 నుంచి 10 వరకు జరుగుతున్నప్పటికీ ఈ నెల 7 లోపుగా దాదాపు అన్ని దేశాలకు చెందిన అధ్యక్షులు, ప్రధానమంత్రులు ఢిల్లీకి చేరుకోనున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సైతం ఈ నెల 7న ఢిల్లీ చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు ఈ నెల 7 నుంచి 10 వరకు 4 రోజులపాటు సెలవులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఇప్పటికే పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. జీ-20 సమ్మిట్‌ సందర్బంగా నేడు ఢిల్లీలో ఫుల్‌ డ్రస్‌ రిహార్సల్స్‌ ను పోలీసులు నిర్వహించనున్నారు. పోలీసులు నిర్వహించే పుల్‌ డ్రస్ రిహార్సల్స్ లో భాగంగా పలుచోట్ల ట్రాఫిక్‌పై ఆంక్షలు విధించారు. ఫుల్‌ డ్రస్ రిహార్సల్స్ నిర్వహిస్తున్న ప్రదేశాలకు వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఢిల్లీ పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఈ నెల 8 నుంచి 10 వరకు జరగనున్న జీ-20 సమ్మిట్‌కు దేశ రాజధాని సన్నద్ధమవుతోంది. ట్రాఫిక్ ఆంక్షల నేపథ్యంలో దుకాణాలు, పాఠశాలలు మూసివేయబడ్డాయి, వాణిజ్య మరియు వ్యాపార సంస్థలు మూసివేయబడ్డాయి. ఢిల్లీలో జరిగే 18వ G20 దేశాధినేతలు మరియు మంత్రులు, సీనియర్ అధికారులు G20 సమావేశాల్లో పాల్గొనబోతున్నారు. దేశ రాజధానిలోని వివిధ ప్రాంతాల నుంచి న్యూఢిల్లీ జిల్లా వైపు మోటర్‌కేడ్‌లను తీసుకువెళుతున్న జి20 సమ్మిట్ కోసం ఢిల్లీ పోలీసులు ఈరోజు పూర్తి డ్రెస్ రిహార్సల్ నిర్వహిస్తున్నారని అధికారులు తెలిపారు. పూర్తి డ్రెస్‌ రిహార్సల్ సమయాలు ఉదయం 8:30 నుండి మధ్యాహ్నం 12 వరకు.. సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు మరియు సాయంత్రం 7 నుండి 11 గంటల వరకు నిర్వహిస్తారు. ఈ సమయంలో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడే అవకాశం ఉన్నందున ప్రయాణికులు మెట్రో సేవలను వినియోగించుకోవాలని సూచించారు. మోటర్‌కేడ్ రిహార్సల్స్ సమయంలో, సర్దార్ పటేల్ మార్గ్-పంచశీల్ మార్గ్, సర్దార్ పటేల్ మార్గ్-కౌటిల్య మార్గ్, గోల్ మేథీ రౌండ్‌అబౌట్, మాన్సింగ్ రోడ్ రౌండ్‌అబౌట్, సి-హెక్సాగన్, మధుర రోడ్, జాకీర్ హుస్సేన్ మార్గ్-సుబ్రమణ్యం భారతీ మార్గ్-, రింగ్ రోడ్డు, సత్య మార్గ్/శాంతిపథం చుట్టూ, జనపథ్-కర్తవ్యాపథ్, బరాఖంబ రోడ్ ట్రాఫిక్ సిగ్నల్, టాల్‌స్టాయ్ మార్గ్ మరియు వివేకానంద్ మార్గ్ మొదలైనవి. ప్రయాణికులు ఈ రోడ్లు మరియు జంక్షన్‌లలో సాధారణం కంటే ఎక్కువ ట్రాఫిక్‌ను అనుభవించవచ్చు అందువల్ల, వారి ప్రయాణాన్ని ముందుగానే ప్లాన్ చేసుకోవాలని ఈ రోడ్‌లను నివారించాలని అభ్యర్థించినట్లు పోలీసులు తెలిపారు.

చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం

పలమనేరు మండలం జగమర్ల వద్ద జాతీయ రహదారిపై  రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీని వెనుక నుంచి కారు ఢీకొనడంతో గిరి గౌడ్ (80) మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుడిని కర్ణాటకలోని ఉనసూర్ ఎక్సైజ్ డీఎస్పీ తండ్రిగా గుర్తించారు.డీఎస్పీ తల్లి తీవ్రంగా గాయపడగా, డీఎస్పీ విజయకుమార్‌కు రెండు కాళ్లు విరిగాయి. చికిత్స నిమిత్తం వారిని జాలప్ప ఆస్పత్రికి తరలించారు. స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి ఎక్సైజ్ సీఐ లోకేష్ బయటపడ్డారు.

గుడివాడ, కైకలూరు అసెంబ్లీ నియోజకవర్గాలపై చంద్రబాబు సమీక్ష

గుడివాడ, కైకలూరు అసెంబ్లీ నియోజకవర్గాలపై తెదేపా అధినేత చంద్రబాబు శుక్రవారం సమీక్షించారు. అభిప్రాయభేదాలను పక్కనపెట్టి పార్టీకోసం పనిచేయాలని మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో నేతలకు సూచించారు. త్వరలో గుడివాడకు అభ్యర్థిని ఖరారు చేస్తామని, ఎట్టి పరిస్థితుల్లో ఆ స్థానాన్ని గెలిచి తీరాలని చెప్పినట్టు సమాచారం. కైకలూరు ఇన్‌ఛార్జిని త్వరలో ప్రకటించనున్నట్లు తెలిపారు. ఈ స్థానానికి కొడాలి వినోద్‌, విజయలక్ష్మి, వెంకటరాజుల మధ్య పోటీ ఉంది. నాలుగు రోజులుగా వివిధ అసెంబ్లీ నియోజకవర్గాలపై చంద్రబాబు సమీక్షిస్తున్నారు.  కాకినాడలో శనివారం జరగనున్న తెదేపా జోన్‌-2 సమావేశంలో చంద్రబాబు పాల్గొననున్నారు. మధ్యాహ్నం 12:30కు రాజమహేంద్రవరం విమానాశ్రయానికి, అక్కడినుంచి రోడ్డుమార్గంలో కాకినాడకు చేరుకుంటారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 6:45 వరకు సమావేశంలో పాల్గొంటారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే సుబ్బరాజు కుమార్తె వివాహవేడుకల్లో పాల్గొంటారు.దేశంలోనే దార్శనికత ఉన్న నేతల్లో చంద్రబాబు ఒకరని ఆ పార్టీ నేతలు కొనియాడారు. 1995 సెప్టెంబర్‌ 1న ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా ప్రమాణస్వీకారం చేసి 28 ఏళ్లయిన సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ కార్యాలయంలో తెదేపా నేత గోనుగుంట్ల కోటేశ్వరావు..చంద్రబాబుకు జ్ఞాపిక, పుష్పగుచ్ఛాన్ని అందజేశారు.

*  ఉద్యోగిని కొట్టిన రజని ఓఎస్డీ

ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని(vidadala Rajini) ఓఎస్డీ(OSD) ఓ ఉద్యోగి విషయంలో దురుసుగా ప్రవర్తించారు. మంగళగిరిలో 108 కాల్ సెంటర్ ఉద్యోగిని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఓఎస్డీ, సీఈఓ మధుసూదన్ రెడ్డి కొట్టారు. అయితే శుక్రవారం అందరు చూస్తున్న క్రమంలో ఆయన చేయిచేసుకున్నారు. దీంతో ఆవేదన చెందిన సిబ్బంది దాదాపు 20 నిమిషాలపాటు ఫోన్ కాల్సి తీసుకోకుండా నిరసన తెలిపారు. ఆ క్రమంలో వచ్చిన అత్యవసర ఫోన్ కాల్స్ కు అంతరాయం ఏర్పడింది. అన్నమయ్య జిల్లాలో 108 అంబులెన్స్ రాకలో జాప్యం ఏర్పడి రైలు ప్రమాద బాధితుడు మరణించినట్లు వచ్చిన అంశంపై గురువారం సీఎం కార్యాలయం వివరణ కోరింది.ఆ క్రమంలో మధుసూదన్ రెడ్డి ఆకస్మాత్తుగా 108 కాల్ సెంటర్ సిబ్బంది వద్దకు వచ్చి ప్రశ్నించారు. విధి నిర్వహణలో భాగంగా ఉద్యోగులు నిర్లక్ష్యంగా ఉంటున్నారని వ్యాఖ్యలు చేశారు. వైద్యారోగ్య శాఖ సిబ్బంది, అధికారులు చూస్తున్న క్రమంలోనే సిబ్బందిపై చేయిచేసుకున్నారు. ఆ క్రమంలో అప్రమత్తమైన మిగతా అధికారులు సర్ది చెప్పడంతో పరిస్థితి కంట్రోల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో మధుసూదన్ రెడ్డిని వివరణ కోరగా..అత్యవసరంగా కాల్ చేసిన వారికి సమాధానం ఇవ్వడంలో బాధ్యతారహితంగా వ్యవహరించిన ఉద్యోగిని నిలదీసే క్రమంలో అలా జరిగిందని పేర్కొన్నారు. మరోవైపు ఈ విషయం తెలిసిన ప్రతిపక్ష నేతలు సిబ్బందిపై అలా ఎలా చేయి చేసుకుంటారని నిలదీస్తున్నారు. పని చేసే ఉద్యోగులకు పద్దతి ప్రకారం చెప్పాల్సిందిపోయి దురుసుగా ప్రవర్తిస్తారా అంటూ ఎద్దేవా చేస్తున్నారు. వైపీసీ ప్రభుత్వ తీరుతో అనేక మంది ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

వైఎస్‌కు గవర్నర్‌ నివాళి

దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి వర్థంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్‌.. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డికి నా నివాళులు.. దార్శనికత ఉన్న నాయకుడు వైఎస్ఆర్ అంటూ కొనియాడారు గవర్నర్‌.. రైతులు, పేద ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పని చేసిన వ్యక్తి వైఎస్సార్ అని పేర్కొన్న ఆయన.. వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం వైఎస్ఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారని గుర్తుచేశారు. ఇక, ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి నిలిచిపోయారని సోషల్‌ మీడియా వేదికగా వరుస ట్వీట్లు చేశారు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌.మహానేత డాక్టర్ వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి నేడు. సంక్షేమానికి కొత్త భాష్యం చెబుతూ.. అభివృద్ధిని పరుగులు పెట్టించిన నేత ఆయన.. ఇచ్చిన ప్రతి హామీని తూచా తప్పకుండా అమలు చేయడమే కాకుండా.. ఇవ్వని హామీలను కూడా ప్రజలకు అందించిన గొప్ప నేత. జయమ్మ, రాజారెడ్డి దంపతులకు 1949 జూలై 8న కడప జిల్లా, జమ్మలమడుగులోని సీఎస్‌ఐ కాంప్‌బెల్ మిషన్ ఆసుపత్రిలో జన్మించిన వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి.. విద్యార్థి దశ నుంచే రాజకీయాలవైపు అడుగులు వేశారు.. ఆ తర్వాత కాంగ్రెస్‌ పార్టీలో కింది స్థాయి నుంచి సీఎం వరకు అనేక పదవులు ఆయన నిర్వహించారు.. ఎంపీలు, ఎమ్మెల్యేగా.. ముఖ్యమంత్రిగా ఆయన సేవలు మరువలేనివి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ వరుస ఓటముల సమయంలో మండుటెండను సైతం లెక్కచేయకుండా చేవేళ్ల నుంచి ఇచ్చాపురం వరకు ప్రజా ప్రస్థానం పేరుతో 1475 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టి.. కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత ఆయనకే దక్కింది.. అయితే, 2009 సెప్టెంబర్ 2న రచ్చబండ కార్యక్రమానికి వెళుతూ హెలికాఫ్టర్ ప్రమాదంలో ఆయన నేలకొరిగారు.. ఆ మహానేత తమకు లేడని తెలిసి ఎన్నో గుండెలు ఆగాయి.. అంతలా ఆయన ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇప్పటికీ ఆ మహా నేతను తలచుకుంటూనే ఉన్నారు.

*  వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా జగన్ షర్మిల భావోద్వేగం

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి నేడు. ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్, వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల తమ తండ్రిని తలుచుకుని భావోద్వేగానికి గురయ్యారు. ‘నాన్నా… మీరు లేని లోటు ఎన్నటికీ తీర్చలేనిది. భౌతికంగా మా మధ్య లేకపోయినా ప్రజల గుండెల్లో చిరకాలం జీవించే లీడర్‌ మీరు. మీ పట్ల ప్రజలకున్న ప్రేమాభిమానాలు నాకు కొండంత అండగా నిలిచాయి. సంక్షేమం, సమగ్రాభివృద్ధి లక్ష్యాల సాధనలో మీ ఆశయాలే నన్ను చేయిపట్టి నడిపిస్తున్నాయి. వర్ధంతి సందర్భంగా మీకు ఘనంగా నా నివాళులు నాన్నా’ అని జగన్ ట్వీట్ చేశారు.మరోవైపు ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద షర్మిల, ఆమె తల్లి విజయమ్మ నివాళి అర్పించారు. అనంతరం మీడియాతో షర్మిల మాట్లాడుతూ… మహానేత మన నుంచి వెళ్లిపోయి 14 ఏళ్లు పూర్తయినా ప్రజల గుండెల్లో ఆయన ఇంకా నిలిచే ఉన్నారని చెప్పారు. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ద్వారా కోట్లాది మంది హృదయాల్లో నిలిచిపోయారని తెలిపారు. రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చిన ఘనత వైఎస్సార్ దే నని చెప్పారు.రైతులకు రుణమాఫీ చేయడం, మహిళలకు పావలా వడ్డీకి రుణం, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్, 108, ఆరోగ్యశ్రీ, 46 లక్షల ఇళ్లను నిర్మించడం వంటి ఎన్నో కార్యక్రమాలను ఆయన చేపట్టారని అన్నారు. మన మధ్య ఆయన లేకపోవడం తీరని లోటు అని చెప్పారు. ఆయన చనిపోయినప్పుడు బాధను తట్టుకోలేక దాదాపు 700 మంది ప్రాణాలు కోల్పోయారని… వారి కుటుంబ సభ్యులకు రాజన్న బిడ్డ శిరస్సు వంచి నమస్కరిస్తోందని అన్నారు. మీడియా ప్రజల పక్షాన నిలబడాలని, ప్రజల గొంతును వినిపించాలని కోరారు.

ఖమ్మంలో హీటెక్కుతున్న పాలిటిక్స్‌

ఖమ్మం జిల్లా రాజకీయాలు రోజుకింత ఆసక్తికరంగా మారుతున్నాయి. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బీఆర్ఎస్ పార్టీని వీడటం దాదాపు ఖరారైనట్టుగానే కనిపిస్తోంది. ఇక హస్తం పార్టీలో చేరేందుకు ముహూర్తం నిర్ణయించుకోవడమే తరువాయి అన్నట్టుగా పరిస్థితి కనిపిస్తోంది. ఖమ్మం జిల్లాకు చెందిన కాంగ్రెస్‌ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి తాజాగా తుమ్మల నాగేశ్వరరావును కలిశారు. ఖమ్మంలోనికి తుమ్మల నివాసానికి వచ్చిన పొంగులేటి – కాంగ్రెస్‌ పార్టీలోకి రావాలని ఆయనను ఆహ్వానించారు. ఆయన రాక కోసం తాము ఎదురుచూస్తున్నామని తెలిపారు. రెండు రోజుల క్రితం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి కూడా హైదరాబాద్‌లో తుమ్మలతో భేటీ అయ్యారు. పార్టీలోకి రావాలని తుమ్మలను రేవంత్‌ ఆహ్వానించారు.బీఆర్ఎస్ పార్టీ తనను అవమానించిన రీతిలోనే మాజీ మంత్రి తుమ్మలను ఇప్పుడు అవమానిస్తోందని పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. పార్టీ నుంచి మిమ్మల్ని మేము తొలగించాం, కాని మీరే వెళ్లేలా చేస్తామనే పరిస్థితిని BRS నాయకత్వం చేస్తోందని అన్నారు. అపాయింట్‌మెంట్‌ కూడా దొరకలేదని, ఈ విషయాలు చెప్పుకుంటే పరువు పోతుందని తెలిపారు. కాంగ్రెస్‌లో చేరాలని తుమ్మలను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నానని పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. తుమ్మలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. తుమ్మల రాక కోసం కాంగ్రెస్‌ శ్రేణులు ఎదురుచూస్తున్నాయని అన్నారు. అయితే పార్టీలో చేరడమన్నది తుమ్మల ఒంటరిగా తీసుకునే నిర్ణయం కాదని, ప్రజల కోరిక మేరకు ఆయన నిర్ణయం తీసుకోవాల్సిన ఉంటుందని పొంగులేటని అన్నారు.కాంగ్రెస్‌లో చేరాలని తనను ఆహ్వానించిన పొంగులేటి శ్రీనివాసరెడ్డికి మాజీ మంత్రి తుమ్మల ధన్యవాదాలు తెలిపారు. తన స్వార్థం, తన కుటుంబం కోసం తాను ఏనాడు పనిచేయలేదని స్పష్టం చేశారు. మంత్రిగా తాను ఖమ్మం జిల్లాను మిగిలిన అన్ని జిల్లాల కంటే మిన్నగా అభివృద్ధి చేశానని అన్నారు. కాంగ్రెస్‌లో చేరిక గురించి ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదు. క్లుప్తంగా మాట్లాడిన తుమ్మల నాగేశ్వరరావు పార్టీ మార్పు గురించి కాని, తన మనస్సులో ఏముందోననే విషయం మాట మాత్రంగా కూడా ప్రస్తావించలేదు. అయితే తన రాజకీయ లక్ష్యం సీతారామ ప్రాజెక్టని తెలిపారు.

వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి విగ్రహానికి కాంగ్రెస్‌ నేతల నివాళి

 దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయనకు కాంగ్రెస్ నాయకులు నివాళి అర్పించారు. హైదరాబాద్‌ పంజాగుట్ట కూడలిలోని వైఎస్‌ఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సభ్యుడు రఘువీరారెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు, ప్రచార కమిటీ ఛైర్మన్‌ మధు యాష్కీ, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అంజన్‌కుమార్‌ యాదవ్‌, రంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడు నర్సింహారెడ్డి, ఖైరతాబాద్‌ కార్పొరేటర్‌ విజయారెడ్డి తదితరులు నివాళి అర్పించారు. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి చేసిన సేవలను వారు కొనియాడారు. ఆయన తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ లాంటి పథకాలు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి దోహదం చేశాయని పేర్కొన్నారు.