ఆసియా కప్ 2023 టోర్నీలో భాగంగా నేడు టీమిండియా, పాకిస్తాన్‌తో తలబడుతోంది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పల్లెకెలెలో ఈ రోజు వర్షం కురిసే అవకాశాలు 91 శాతం ఉన్నాయని వాతావరణ శాఖ తెలియచేసింది. టాస్ వేయడానికి ముందే పల్లెకెలెలో చిరుజల్లులు మొదలయ్యాయి.
గత రెండేళ్లలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య 4 మ్యాచులు జరగాయి. టీ20 వరల్డ్ కప్ టోర్నీల్లో రెండుసార్లు, ఆసియా కప్‌లో రెండు సార్లు ఇండియా- పాకిస్తాన్ తలబడ్డాయి. అయితే 2019 వన్డే వరల్డ్ కప్ తర్వాత ఇరు జట్ల మధ్య వన్డే మ్యాచ్ జరగడం ఇదే తొలిసారి.
ఇండియా, పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఫాస్ట్ బౌలింగ్‌కి, టీమిండియా బ్యాటింగ్‌కీ మధ్య హోరాహోరీ ఫైట్ నడుస్తుందని అంచనా వేస్తున్నారు అభిమానులు. ముఖ్యంగా పాకిస్తాన్‌పై గత రెండేళ్లలో చెప్పుకోదగ్గ ప్రదర్శన ఇవ్వలేకపోయిన కెప్టెన్ రోహిత్ శర్మపై భారీ అంచనాలు పెట్టుకుంది టీమిండియా. వన్డే వరల్డ్ కప్ టోర్నీకి ముందు రోహిత్ బ్యాటు నుంచి భారీ ఇన్నింగ్స్ వస్తే, అది మిగిలిన టీమ్ ప్లేయర్లలో జోష నింపవచ్చు..
పాకిస్తాన్‌తో గత 5 వన్డేల్లో రోహిత్ శర్మ 2 హాఫ్ సెంచరీలు, 2 సెంచరీలు చేశాడు. పాక్‌పై డకౌట్ అయిన 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా చిత్తుగా ఓడింది.
టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీతో బ్యాటింగ్‌లో ఒంటరి పోరాటం చేశాడు. 2022 టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో వీరోచిత పోరాటంతో టీమిండియాని గెలిపించాడు. ఆసియా కప్ 2022 టోర్నీలో పాక్‌తో జరిగిన రెండు మ్యాచుల్లోనూ విరాట్ కోహ్లీయే టీమిండియా తరుపున టాప్ స్కోరర్..
కాబట్టి విరాట్ కోహ్లీని త్వరగా అవుట్ చేసేందుకు పాకిస్తాన్ ఎన్నో ప్రణాళికలు రచించుకుని వస్తోంది. మరి ఈసారి విరాట్ కోహ్లీ బ్యాటు నుంచి ఎలాంటి ఇన్నింగ్స్ వస్తుందనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఏడాదికగా క్రికెట్‌కి దూరంగా ఉంటున్న జస్ప్రిత్ బుమ్రా, ఐర్లాండ్‌తో సిరీస్‌లో రెండు మ్యాచుల్లో బౌలింగ్ చేసినా, అతని బౌలింగ్‌కి, ఫిట్‌నెస్‌కి అసలైన పరీక్ష నేటి మ్యాచ్‌లో ఎదురుకానుంది..
వెస్టిండీస్ టూర్‌లో ఆడని మహ్మద్ షమీకి నేటి మ్యాచ్‌లోనూ తుది జట్టులో చోటు దక్కలేదు. శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, జస్ప్రిత్ బుమ్రాలకు తుది జట్టులో చోటు ఇచ్చిన టీమిండియా, మహ్మద్ షమీని రిజర్వు బెంచ్‌కే పరిమితం చేసింది.
గాయం నుంచి కోలుకున్న శ్రేయాస్ అయ్యర్, ఐదు నెలల తర్వాత నేటి మ్యాచ్‌లో బరిలో దిగుతున్నాడు. మరో 3 రోజుల్లో వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి జట్టును ప్రకటించనుంది బీసీసీఐ. కాబట్టి శుబ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్.. ఇలా ప్రతీ ప్లేయర్‌కి ఈ మ్యాచ్ కీలకం కానుంది..
పాకిస్తాన్ గత మ్యాచ్‌లో నేపాల్‌పై 238 పరుగుల భారీ తేడాతో విజయం అందుకుంది. నేటి మ్యాచ్‌లో ఓడినా, పాకిస్తాన్‌కి సూపర్ 4 చేరే ఛాన్సులు ఉంటాయి. గత మ్యాచ్‌లో నేపాల్‌పై గెలిచిన జట్టునే, టీమిండియాపై కొనసాగించింది పాకిస్తాన్..
పాకిస్తాన్ జట్టు: ఫకార్ జమాన్, ఇమామ్ ఉల్ హక్, బాబర్ ఆజమ్ (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్, అఘా సల్మాన్, ఇఫ్తికర్ అహ్మద్, షాదబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, షాహీన్ ఆఫ్రిదీ, నసీం షా, హారీస్ రౌఫ్
భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్