Sports

కోహ్లి ఆటతీరుపై గంభీర్ ఫైర్

కోహ్లి ఆటతీరుపై గంభీర్ ఫైర్

టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లిపై మాజీ క్రికెటర్‌ గౌతం గంభీర్‌ విమర్శలు ఎక్కుపెట్టాడు. చెత్త షాట్‌ సెలక్షన్‌తో కోహ్లి భారీ మూల్యం చెల్లించుకున్నాడంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. షాహిన్‌ ఆఫ్రిది వంటి మేటి పేసర్‌ బౌలింగ్‌లో జాగ్రత్తగా ఆడాలి కదా అంటూ చురకలు అంటించాడు.

ఆసియా కప్‌-2023లో భాగంగా టీమిండియా తమ తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో తలపడుతున్న విషయం తెలిసిందే. శ్రీలంకలోని పల్లెకెలెలో శనివారం నాటి మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌.. 48.5 ఓవర్లలో 266 పరుగులు చేసింది.

టాపార్డర్‌ కకావికలం
పాక్‌ పేసర్ల ధాటికి టాపార్డర్‌ కుదేలవడం తీవ్ర ప్రభావం చూపింది. ఓపెనర్‌ రోహిత్‌ శర్మ(11)ను అద్భుత బంతితో పెవిలియన్‌కు పంపిన పాక్‌ స్పీడ్‌స్టర్‌ షాహిన్‌ ఆఫ్రిది.. కోహ్లిని(4)ని సైతం బౌల్డ్‌ చేశాడు. స్వల్ప వ్యవధిలో రెండు కీలక వికెట్లు కూల్చి పాకిస్తాన్‌కు శుభారంభం అందించాడు.

ఈ నేపథ్యంలో కామెంటేటర్లు గంభీర్‌, వకార్‌ యూనిస్‌, మాథ్యూ హెడెన్‌ మధ్య రోహిత్‌- కోహ్లి అవుటైన తీరుపై ఆసక్తికర చర్చ నడిచింది. ఆఫ్రిది సంధించిన అద్భుత బంతికి రోహిత్‌ శర్మ పెవిలియన్‌ చేరాడని.. అయితే, కోహ్లి మాత్రం రాంగ్‌ సెలక్షన్‌తో దెబ్బతిన్నాడని గౌతీ అభిప్రాయపడ్డాడు.

కోహ్లిపై గంభీర్‌ ఘాటు విమర్శలు
‘‘అసలు అది ఏం షాట్‌? ఫార్వర్డ్‌ కాదు.. బ్యాక్‌ కాదు. సాధారణ షాట్‌. షాహిన్‌ ఆఫ్రిది బౌలింగ్‌లో ఇలాగేనా ఆడేది? ఫార్వర్డ్‌ షాట్‌ ఆడాలా లేదంటే బ్యాక్‌కు వెళ్లాలా అనే విషయంలో ఆ మాత్రం క్లారిటీ లేదా?’’ అని కోహ్లిని విమర్శించాడు. అయితే, వకార్‌ యూనిస్‌ మాత్రం.. దురదృష్టవశాత్తూ కోహ్లి బౌల్డ్‌ అయ్యాడని.. ఏదేమైనా ఆఫ్రిది అద్భుతంగా బౌలింగ్‌ చేశాడని పేర్కొన్నాడు.

వర్షం అంతరాయం
ఈ విషయంలో హెడెన్‌ వకార్‌ యూనిస్‌తో ఏకీభవించాడు. కాగా ఆఫ్రిది వేసిన బంతిని థర్డ్‌మ్యాన్‌ దిశగా తరలించే క్రమంలో కోహ్లి ఫ్లిక్‌ చేయగా ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌ తీసుకున్న బంతి స్టంప్స్‌ను తాకింది. దీంతో కింగ్‌ 4 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు.

ఇదిలా ఉంటే.. దాయాదులు పోరు కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన అభిమానులకు.. మ్యాచ్‌కు పదే పదే వర్షం అంతరాయం కలిగించడం చికాకు తెప్పిస్తోంది. టీమిండియా ఇన్నింగ్స్‌ ముగిసిన తర్వాత మళ్లీ వర్షం మొదలుకావడంతో చాలా సేపటి వరకు ఆట నిలిచిపోయింది.

కాగా ఐపీఎల్‌-2023 సందర్భంగా ఆర్సీబీ- లక్నో మ్యాచ్‌ నేపథ్యంలో కోహ్లి- నవీన్‌ ఉల్‌ హక్‌ గొడవలో గంభీర్‌ జోక్యంతో వివాదం రాజుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గౌతీ తాజా వ్యాఖ్యలు కింగ్‌ ఫ్యాన్స్‌కు ఆగ్రహం తెప్పిస్తున్నాయి.