అమెరికా(USA)లో బర్నింగ్ మ్యాన్ ఫెస్టివల్ (Burning Man festival) జరుగుతున్న నెవాడలోని బ్లాక్‌రాక్ ఎడారి వర్షం దెబ్బకు బురద మయంగా మారిపోయింది. దీంతో ఈ ఫెస్టివల్‌కు హాజరైన 70,000 మంది ఆ బురదలో చిక్కుకుపోయారు. చుట్టూ పదుల మైళ్ల దూరం వరకు ఎటు చూసినా బురదే కనిపిస్తోంది. వాహనాలు ముందుకు కదల్లేక పోతున్నాయి. కాళ్లు కూరుకుపోతుండటంతో పది అడుగులు కూడా వేయలేని పరిస్థితి.ఇక్కడ భూఉపరితలం ఎండే వరకు వాహనలను ముందుకు అనుమతించమని ఇప్పటికే నిర్వాహకులు తెలిపారు. దీంతో సందర్శకులు ఆహారం, నీరు వాడుకొని ఎక్కడైన పొడిగా వెచ్చటి ప్రదేశంలో తలదాచుకోవాలని సూచించారు. ఈ ప్రాంతం ది బ్యూరో ఆఫ్ ల్యాండ్ మేనేజ్‌మెంట్ ఆధీనంలో ఉంది.
ఆగస్టు 27న బర్నింగ్‌మ్యాన్ ఫెస్టివల్ మొదలైంది. ఆ తర్వాత ఈ ప్రదేశాన్ని హిల్లరి హరికేన్ తాకింది. ఒక రాత్రి మొత్తం భారీ వర్షం కురవడంతో ఆ ప్రాంతం మొత్తం బురదగా మారిపోయింది. మూడు నెలల్లో పడాల్సిన వర్షం ఒక్కరాత్రిలో కురిసింది. దీంతో చాలా ఈవెంట్లు రద్దయ్యాయి. ఎవరూ ఇక్కడికి రావడానికి లేదా.. బయటకు వెళ్లడానికి అవకాశం లేకుండా పోయింది. దీంతో బ్లాక్‌రాక్ సిటీని మూసివేసినట్లు నిర్వాహకులు ప్రకటించారు. కొంత మంది మాత్రం కాలి నడకనే ఈ బురద ఎడారి నుంచి బయటపడేందుకు యత్నిస్తున్నారు.