DailyDose

6న కాంగ్రెస్‌లోకి తుమ్మల-TNI నేటి తాజా వార్తలు

6న కాంగ్రెస్‌లోకి తుమ్మల-TNI నేటి తాజా వార్తలు

6న కాంగ్రెస్‌లోకి తుమ్మల

 ఖమ్మం రాజకీయాలు ఆసక్తికర మలుపు తిరుగుతున్నాయి. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావు కాంగ్రెస్‌లో చేరికకు ముహూర్తం ఖరారైంది. పాలేరు టికెట్ విషయంలో తుమ్మలకు భరోసా లభించినట్లు సమాచారం. ఈ నెల 6న ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ సమక్షంలో తుమ్మల హస్తం గూటికి చేరనున్నట్లు తెలిసింది. ‘తుమ్మలన్న రా.. కదిలిరా.. జనమంతా ప్రభంజనంలా నీ వెంటే’ అంటూ ఖమ్మం నగరంలో ఫ్లెక్సీ వెలిసింది.ఇప్పటికే కాంగ్రెస్‌లోకి రావాలని తుమ్మల నాగేశ్వరావును పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆహ్వానించిన సంగతి తెలిసిందే. తుమ్మల ఇంటికి వెళ్లిన పొంగులేటి తాజా పరిణామాలపై చర్చించారు. తుమ్మల ఇంటికి పొంగులేటి వెళ్లడం ఆసక్తికర పరిణామమే.ఎందుకంటే ఈ ఇద్దరూ బీఆర్‌ఎస్‌లోనే ఉన్నా.. ఇంతకాలం మాట్లాడుకోలేదు. అలాంటిది నాలుగేళ్ల తర్వాత ఈ ఇద్దరూ కలుసుకుని మాట్లాడుకున్నారు. అదీ.. బీఆర్‌ఎస్‌ అసంతృప్తి నేపథ్యంతోనే కావడం గమనార్హం. ఎట్టిపరిస్థితుల్లో ఖమ్మం కంచుకోటను వదులుకోకూడదని కాంగ్రెస్‌ భావిస్తోంది. అందుకే బలమైన నేతలను ఒకే గూటికి తెచ్చి.. కలిసి పని చేయడం ద్వారా విజయం అందుకోవాలని భావిస్తోంది. మరో వైపు ఇవాళ తుమ్మలతో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క భేటీ అయ్యారు.

 వాగులో చిక్కుకున్న బస్సు

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వైఎస్ఆర్ కడప జిల్లా ఇసుక వంక వాగు పొంగిపొర్లుతుంది. జమ్మలమడుగు అర్బన్ పరిధిలోని ఎస్.ఉప్పలపాడు గ్రామం వద్ద ఇసుక వంక వాగు పొంగి పొర్లుతుంది. దీంతో రాకపోకలు స్తంభించాయి. అయితే ఆదివారం తెల్లవారు జామున 4 గంటల ప్రాంతంలో వాగు ఉధృతిలో ఓ ఆర్‌టిసి బస్సు చిక్కుకుంది. ఆ సమయంలో బస్సులో 13మంది ప్రయాణీకులు ఉన్నారు. సమాచారం అందుకున్న జమ్మలమడుగు అర్బన్ సీఐ సదా శివయ్యతోపాటు ఇతర సిబ్బంది వాగు వద్దకు చేరుకుని రెస్క్యూ ఆపరేషన్‌ నిర్వహించారు. ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో శ్రమించి 13మంది ప్రాణాలను కాపాడారు. తెల్లవారు జామున జరిగిన వాగులో చిక్కిన ప్రయాణికులను కాపాడిన పోలీసులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ అన్బురాజన్ అభినందించారు.

ఆల్‌రౌండర్‌గా జింబాబ్వేను అద్భుతంగా నడిపించిన ఆ మాజీ కెప్టెన్‌

జింబాబ్వే క్రికెట్ దిగ్గజం హీత్‌ స్ట్రీక్‌ (Heath Streak) (49) కన్నుమూశాడు. క్యాన్సర్‌తో పోరాడుతూ ఆదివారం వేకువజామున తుది శ్వాస విడిచినట్లు అతడి కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఫ్లవర్‌ సోదరులతోపాటు జింబాబ్వే క్రికెట్‌ను ఉన్నతస్థాయికి చేర్చడంలో హీత్ స్ట్రీక్‌ కీలక పాత్ర పోషించాడు. ఆల్‌రౌండర్‌గా జింబాబ్వే జట్టుకు వన్నె తెచ్చాడు. జింబాబ్వే తరఫున 1993 నుంచి 2005 వరకు 65 టెస్టులు, 189 వన్డేలు ఆడాడు. కెప్టెన్‌గానూ వ్యవహరించిన స్ట్రీక్‌ రెండు ఫార్మాట్లలో కలిపి 4,933 పరుగులు, 455 వికెట్లు పడగొట్టాడు. ఇప్పటికీ జింబాబ్వే తరఫున టెస్టుల్లో 1000 పరుగులు, 100 వికెట్లు.. టెస్టుల్లో 2వేల పరుగులు+, 200+ వికెట్లు తీసిన ఆటగాడిగా రికార్డు అతడి సొంతం. ఆటగాడిగానే కాకుండా 2016 నుంచి 2018 వరకు జింబాబ్వేతోపాటు దేశవాళీ లీగ్‌లలోని జట్లకు కోచ్‌గా వ్యవహరించాడు. బంగ్లాదేశ్‌ క్రికెట్‌ జట్టుకు బౌలింగ్‌ కోచ్‌గానూ బాధ్యతలు నిర్వర్తించాడు.

 మూడోసారి కూడా ఎంపీ గా విజయవాడ నుంచి గెలుస్తా: కేశినేని

విజయవాడలోని పంజా సెంటర్ లో కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. మూడోసారి కూడా ఎంపీ గా విజయవాడ నుంచి గెలుస్తున్నానని ప్రకటించారు కేశినేని నాని. దీంతో టీడీపీలో మళ్ళీ కాకరేపాయి కేశినేని నాని మాటలు. రెండు నెలలుగా సైలెంట్ గా ఉన్న కేశినేని… టీడీపీ నేత బేగ్ పుట్టిన రోజు పార్టీలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంపీగా మూడోసారి పోటీ చేసి పార్లమెంటుకు వెళ్తా అని ప్రకటించిన కేశినేని…. టీడీపీలో కొందరు నేతల టార్గెట్ గా విమర్శనాస్త్రాలు వదిలారు.బెజవాడ పార్లమెంట్ పరిధిలో కేశినేని నాని సోదరుడు చిన్ని పార్టీ కార్యకలాపాలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఎంపీ సీటు చిన్నికి అధిష్టానం ఇస్తుందన్న ప్రచారం నేపధ్యంలో నాని కామెంట్స్ ఆసక్తి రేపుతున్నాయి. కేశినేని చిన్ని, బుద్ధా వెంకన్న, బోండా ఉమా, దేవినేని ఉమా, నాగుల్ మీరాతో కేశినేనికి విబేధాలు పెట్టుకున్న సంగతి తెలిసిందే. బెజవాడ పశ్చిమలో కొంత మంది నుంచి ప్రజలకు, పార్టీ కార్యకర్తలు, నేతలకు విముక్తి కలగాలన్న నాని… ప్రజా సేవకు పనికిరాని వ్యక్తులు ప్రజా సేవలో ఉండకూడదు అనేది నా అభిమతం అంటూ కౌంటర్లు విసిరారు. దేవినేని ఉమాకు ప్రత్యర్థులుగా మైలవరంలో వ్యవహారాలు నడపుతున్న గన్నే ప్రసాద్, బొమ్మసాని వల్లే యువగళం సక్సెస్ అంటూ కితాబు ఇచ్చారు.

*  నరసరావుపేట ఎంపీ అభ్యర్థిపై వైసీపీలో గుబులు

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయనో ఫైర్ బ్రాండ్. మనసుకు ఏది అనిపిస్తే అది కుండ బద్దలు కొట్టాల్సిందే. ఈ ముక్కుసూటి తనమే ఆయన రాజకీయ జీవితానికి ఇబ్బందికరంగా మారింది. ఒకానొక సందర్భంలో మైక్ పట్టుకున్నారంటే సొంత పార్టీ అని కూడా ఆలోచించరు. ఇక ఎడాపెడా మాట్లాడాల్సిందే. మరోవైపు రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి విడుదల రజినీతో ఎంపీకి అసలు పొసగదు. అంతేకాదు విడుదల రజినీకి వ్యతిరేకంగా మర్రి రాజశేఖర్‌తో కలిసి ఓ వర్గాన్ని సైతం ఏర్పాటు చేశారనే ప్రచారం కూడా ఉంది. ఇంతకీ ఆ ఎంపీ ఎవరో తెలిసే ఉంటుంది కదూ. ఇంకెవరు నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు. అయితే శ్రీకృష్ణ దేవరాయులు వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తారనే ప్రచారం కూడా జరుగుతుంది. అందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు ఎంపీగా పోటీ చేసేందుకు విముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఎంపీగా ఉండటం వల్ల ప్రజల్లోకి చొచ్చుకుని వెళ్లలేకపోతున్నట్లు ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయులు అభిప్రాయపడుతున్నారు.కేవలం ఎంపీగా బహిరంగ సమావేశాలకు వెళ్లి ఏదో మెుక్కుబడిగా పాల్గొని… ప్రసంగాలకే పరిమితం కావాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు అసమ్మతి సెగ వచ్చే ఎన్నికల్లో ఇబ్బందికరంగా మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలును పొన్నూరు ఎమ్మెల్యేగా బరిలోకి దిగాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనను ఇప్పటికే ఎంపీ శ్రీకృష్ణ దేవరాయులు వైసీపీ అధిష్టానం వద్ద ఉంచినట్లు తెలుస్తోంది.ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు అత్యంత సన్నిహితుడు అయిన ప్రస్తుత రాజ్యసభ సభ్యులు ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దించాలనే యోచన వైసీపీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌కు వైసీపీ అధిష్టానం వద్ద మంచి పట్టుంది. అంతేకాదు ఉమ్మడి గుంటూరు జిల్లాలో కూడా నాయకులతో సత్సంబంధాలు ఉన్నాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైసీపీకి పెద్దదిక్కుగా వ్యవహరిస్తున్నారు. అంతేకాదు మత్స్యకార సామాజిక వర్గానికి కొండంత అండగా నిలుస్తున్నారు. ఈ పరిణామాలు మోదుగుల వేణుగోపాల్ గెలుపునకు దోహదపడతాయనే ప్రచారం ఉంది.

* ఆదిత్య-ఎల్‌1 ఉపగ్రహం తొలి భూకక్ష్య పెంపు విన్యాసం విజయవంతం

దేశ తొలి సౌర పరిశీలన ఉపగ్రహం ‘ఆదిత్య-ఎల్‌ 1 (Aditya-L1)’ను నిర్దేశిత భూ కక్ష్యలోకి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) విజయవంతంగా ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆదివారం తొలి భూ కక్ష్య పెంపు విన్యాసాన్ని విజయవంతంగా చేపట్టినట్లు ‘ఇస్రో’ వెల్లడించింది. బెంగళూరులోని ‘ఇస్రో టెలీమెట్రీ, ట్రాకింగ్‌ అండ్‌ కమాండ్‌ నెట్‌వర్క్‌ (ISTRAC)’ నుంచి ఈ ప్రక్రియను చేపట్టినట్లు తెలిపింది. దీంతో ‘ఆదిత్య-ఎల్‌1’ ఇప్పుడు 245× 22,459 కిలోమీటర్ల దూరంలోని కక్ష్యలోకి ప్రవేశించింది. మిషన్‌ అంతా సజావుగా సాగుతోందని, రెండో భూకక్ష్య పెంపు విన్యాసాన్ని సెప్టెంబరు 5న తెల్లవారుజామున 3 గంటలకు నిర్వహించనున్నట్లు చెప్పింది.‘ఆదిత్య-ఎల్‌1’ ఉపగ్రహంతో పీఎస్‌ఎల్‌వీ-సి57 వాహకనౌక శనివారం శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి నింగిలోకి దూసుకెళ్లింది. 63 నిమిషాల సుదీర్ఘ ప్రయాణం అనంతరం 1480.7 కిలోల ఉపగ్రహాన్ని భూ కక్ష్యలో ప్రవేశపెట్టింది. 16 రోజుల పాటు భూ కక్ష్యల్లోనే చక్కర్లు కొట్టనున్న ‘ఆదిత్య-ఎల్‌1’.. అనంతరం భూమికి 15 లక్షల కి.మీ. దూరంలో ఉన్న నిర్దేశిత ఎల్‌1 బిందువు దిశగా సుదీర్ఘ ప్రయాణాన్ని ప్రారంభిస్తుందని ఇస్రో తెలిపింది. ఇందులో 7 పరిశోధన పరికరాలున్నాయి. ఇవి సూర్యుడి పొరలైన ఫొటో స్పియర్‌, క్రోమో స్పియర్‌ సహా వెలుపల ఉండే కరోనానూ అధ్యయనం చేస్తాయి. సౌర జ్వాలలు, సౌర రేణువులు, అక్కడి వాతావరణం గురించి ఎన్నో అంశాలను శోధిస్తాయి.

కొత్త ఓట్ల నమోదుపై  కిషన్ రెడ్డి  ప్రకటన

కొత్త ఓట్ల నమోదుపై బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. “మేరా బూత్, సబ్‌సే మజ్‌బూత్” కార్యక్రమంలో భాగంగా కాచిగూడ భూమన్న గల్లీ లోని పలు అపార్ట్మెంట్ లో పోలింగ్ బూత్ లో ఓటర్ వెరిఫికేషన్ & ఎన్‌రోల్‌మెంట్‌ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్థానిక ఓటర్లకు ఎన్‌రోల్‌మెంట్‌ పై, అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మట్లాడారు. దేశవ్యాప్తంగా ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ప్రతి బూతువారీగా బూతు లెవెల్స్ ఆఫీసర్స్‌ను పంపించే కార్యక్రమం జరుగుతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.ఉదయం నుంచి సాయంత్రం వరకు వారు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు.ఓటరు లిస్టులో నమోదు సంబంధిత దరఖాస్తు ఫారాలు, అడ్రస్ మార్పు, యువ ఓటర్ల నమోదు తదితర సేవలను వినియోగించుకోవచ్చని కిషన్ రెడ్డి చెప్పారు.ఓటరు లిస్టులో తప్పులు సరిదిద్దుకోవడంతో పాటు 18 ఏళ్లు పైబడిన వారు కొత్తగా ఓటు నమోదు చేసుకోవాల్సిందిగా ఆయన కోరారు. తనకు ఓటు హక్కు కలిగిన బర్కత్‌పురా పోలింగ్ బూత్‌లోని కొన్ని బస్తీలు, కాలనీ ప్రజల్లో తాను కూడా ఈ రోజు అవేర్‌నెస్ తీసుకొచ్చే కార్యక్రమం చేస్తున్నట్లు కిషన్ రెడ్డి వెల్లడించారు.దాంట్లో భాగంగానే తాను ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవాల్సిందిగా సూచించారు.

అందుకే బీజేపీలో చేరేందుకు బాబు ప్రయత్నాలు: వైవీ సుబ్బారెడ్డి

చంద్రబాబు అవినీతికి పాల్పడ్డాడనే ఐటీ నోటీసులిచ్చారని మాజీ ఎంపీ, వైఎస్సార్‌సీపీ నేత వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు తన హయాంలో రాష్ట్రాన్ని అడ్డంగా దోచుకున్నారని మండిపడ్డారు. గత టీడీపీ ప్రభుత్వంలో ఏవిధంగా దొంగ ఓట్లు చేర్పించారో ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశామన్నారు.‘‘జమిలి ఎన్నికలు వచ్చినా.. సాధారణ ఎన్నికలు వచ్చినా ప్రజలు మాత్రం మళ్లీ సీఎం జగన్‌నే ఎన్నుకుంటారు. చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే సత్తాలేదు.. అందుకే బీజేపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎన్ని వేషాలు వేసినా.. ఎంత మందితో కలిసి వచ్చినా. మళ్లీ వచ్చేది సీఎం జగన్‌ ప్రభుత్వమే’’ అని ఆయన స్పష్టం చేశారు. లోకేష్‌ తన పాదయాత్రలో సీఎంను దుర్భాషలాడుతూ, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఉద్దేశ్యపూర్వకంగానే వ్యవహరిస్తున్నారని వైవీ సుబ్బారెడ్డి దుయ్యబట్టారు.

 అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయండి

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డికి గతంలో కోర్టు మంజూరు చేసిన ముందస్తు బెయిల్ రద్దు చేయాలని సీబీఐ సుప్రీంకోర్టును కోరింది. ఈ మేరకు అఫిడవిట్ దాఖలు చేసింది. దీనికి సంబంధించి సెప్టెంబరు 11న సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. వైఎస్ అవినాష్ రెడ్డికి హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడాన్ని సుప్రీం కోర్టులో వివేకా కుమార్తె సునీతా రెడ్డి సవాలు చేశారని కూడా సీబీఐ అఫిడవిట్ లో ప్రస్తావించింది. వివేకానంద రెడ్డి హత్యకు భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డిలే కుట్ర చేశారంటూ అఫిడవిట్‌లో సీబీఐ పేర్కొంది. రాజకీయాల్లో విభేదాల కారణంగానే వివేకానంద రెడ్డి హత్య జరిగిందని సీబీఐ అఫిడవిట్ లో స్పష్టం చేసింది.ఈ కేసులో నిందితులుగా ఉన్న అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డికి వివేకాతో రాజకీయ విభేదాలు ఉన్నాయని మరోసారి సీబీఐ పేర్కొంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయనను ఓడించారని గుర్తు చేసింది. 2019 ఎన్నికల్లో కడప ఎంపీ టికెట్ అవినాష్ రెడ్డికి కాకుండా తనకు గాని షర్మిల లేదా విజయమ్మల్లో ఎవరో ఒకరికి ఇవ్వాలని వివేకా పట్టుబట్టారని సీబీఐ వివరించింది.ఎంపీ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ ను సవాలు చేస్తూ గతంలో సునీత సుప్రీంకోర్టుకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలోనే సీబీఐ అఫిడవిట్ దాఖలు చేసింది. ఇందులో వివేకా హత్యకు దాడి చేసిన పరిణామాలు దాని అనంతరం, సాక్షాధారాల చెరిపివేతలో నిందితులు వ్యవహరించిన తీరును గురించి సీబీఐ వివరించింది.వివేకా హత్య అనంతరం ఆయన గుండెపోటు వల్ల చనిపోయారంటూ కట్టుకథ అల్లారని సీబీఐ అఫిడవిట్ లో వెల్లడించింది. అవినాష్ రెడ్డి పాత్రపైన తాము ఇంకా దర్యాప్తు చేయాలని తెలిపింది. వివేకానంద రెడ్డి వెంట కారులో ప్రయాణిస్తూనే నిందితుడు సునీల్‌కి గంగిరెడ్డి ఫోన్ చేశారని, ఆ సమయంలో అవినాష్ రెడ్డి ఇంట్లో సునీల్ యాదవ్ ఉన్నాడని వివరించింది. వివేకా హత్యకు అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డిలే సూత్రదారులు అనడానికి తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని అఫిడవిట్‌లో సీబీఐ వివరించింది.

*   విశాఖ సిగలో మరో పర్యాటక మణిహారం

విశ్వ నగరంగా అభివృద్ధి చెందుతుంది విశాఖ పట్నం. అంతర్జాతీయ స్థాయి నిర్మాణాలతో విశాఖ పోర్టు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ పోర్టు డెవలప్ మెంట్ పై రాష్ట్రం ప్రభుత్వంతో పాటు కేంద్రప్రభుత్వం కూడా ప్రత్యేక దృష్టి సారించింది. ఇక కేంద్ర కేంద్ర ఓడరేవులు, జలరవాణా శాఖ మంత్రి శర్భానంద్ సోనోవాల్, సహాయ మంత్రి శ్రీపాద నాయక్ ఇవాళ, రేపు విశాఖలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా విశాఖపట్టణం పోర్టు ట్రస్ట్ అభివృద్ధి ప్రణాళికలపై ఉన్నతాధికారులతో, పలువురు మంత్రులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా 333.56 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది పనులకు శంకుస్థాపన చేయనున్నారు కేంద్ర మంత్రులు. ఇక విశాఖ పోర్టుకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచేందుకు క్రూయిజ్‌ టెర్మినల్‌ రెడీ అయిపోయింది.