Politics

గద్వాల ఎమ్మెల్యేగా డీకే అరుణను ప్రకటించిన ఈసీ

గద్వాల ఎమ్మెల్యేగా డీకే అరుణను ప్రకటించిన ఏసీ

గద్వాల అసెంబ్లీ నియోజవర్గ ఎమ్మెల్యేగా డీకే అరుణ (DK Aruna) ఎన్నికైనట్లుగా ప్రచురించాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఈసీ లేఖ రాసింది. హైకోర్టు ఉత్తర్వులను తదుపరి గెజిట్‌లో ప్రచురించాలని ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు తీర్పు కాపీని జత చేస్తూ..సీఈవోకు ఈసీ అండర్‌ సెక్రెటరీ సంజయ్‌ కుమార్‌ లేఖ రాశారు.

ఈసీ లేఖపై భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ స్పందించారు. ఈసీ ఆదేశాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. త్వరలోనే తాను అసెంబ్లీ సెక్రెటరీ కలవబోతున్నట్లు వెల్లడించారు.

అసలేం జరిగిందంటే..?
జోగులాంబ జిల్లా గద్వాల ఎమ్మెల్యేగా బి.కృష్ణమోహన్‌రెడ్డి ఎన్నిక చెల్లదని హైకోర్టు ఇటీవల తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. నామినేషన్‌ సందర్భంగా తప్పుడు వివరాలతో అఫిడవిట్‌ దాఖలు చేసినందుకు శిక్షగా రూ.2.50 లక్షలు జరిమానా విధించింది. ఖర్చుల కింద పిటిషనర్‌ డీకే అరుణకు రూ.50 వేలు చెల్లించాలని ఆదేశించింది. కృష్ణమోహన్‌రెడ్డి తరువాత అత్యధిక ఓట్లు సాధించిన అరుణను 2018 డిసెంబరు 12 నుంచి ఎమ్మెల్యేగా  ప్రకటిస్తూ తీర్పు వెలువరించింది. నాటి ఎన్నికల్లో గద్వాల నుంచి భారాస (తెరాస) అభ్యర్థిగా కృష్ణమోహన్‌రెడ్డి, కాంగ్రెస్‌ తరఫున అరుణ పోటీ చేశారు. కృష్ణమోహన్‌రెడ్డికి 1,00,057; అరుణకు 71,612 ఓట్లు వచ్చాయి.