Politics

సోనియాగాంధీ సభతోనే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మొదలు

సోనియాగాంధీ సభతోనే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మొదలు

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందడంతో తెలంగాణలోనూ మైలేజ్ వచ్చిందనే ధీమాతో ఉన్న ఆ పార్టీ స్టేట్ లీడర్లు, కేడర్.. ఇప్పుడు సోనియాగాంధీ హాజరయ్యే బహిరంగ సభ టర్నింగ్ పాయింట్‌ అవుతుందని భావిస్తున్నారు. రాష్ట్ర ఏర్పాటు విషయంలో గతాన్ని గుర్తు చేస్తూ ఆమె చేసే వ్యాఖ్యలు, ఇచ్చే ప్రసంగం మరోసారి తెలంగాణ సెంటిమెంట్‌ను రాజేస్తుందని, అది పార్టీకి అనుకూలంగా మారుతుందనే ధీమాతో ఉన్నారు. సోనియాగాంధీ సభతోనే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మొదలవుతుందని, ఇది శుభారంభం మాత్రమే కాక విజయ రహస్యంగా కూడా మారుతుందన్నది కాంగ్రెస్ నేతల అభిప్రాయం.

ఆమె చేసే ప్రసంగం ప్రజలను ఎలా టచ్ చేస్తుంది.. ఎలాంటి అంశాలను ప్రస్తావిస్తారన్నది ప్రజల్లో, పార్టీ శ్రేణుల్లో ఆసక్తికరంగా మారింది. తెలంగాణలోని తాజా పరిస్థితులు, పార్టీ పట్ల ప్రజల్లో ఉన్న నమ్మకం తదితరాలను ప్రస్తావిస్తూ ప్రసంగ పాఠాన్ని తయారు చేయడంలో పీసీసీ నేతలు పలువురు కసరత్తు మొదలుపెట్టారు. ఉద్యమం ఉవ్వెత్తున్న జరుగుతున్న సమయంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి ఆనాడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, ఏఐసీసీ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయం, వెల్లడైన భిన్నాభిప్రాయాలను గుర్తుచేసి ఏ నేపథ్యంలో రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలనే నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో స్వయంగా ఆమె వెల్లడించడం ద్వారా ప్రజల్లోకి స్పష్టమైన మెసేజ్ వెళ్తుందన్నది రాష్ట్ర కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.

పార్టీ బలోపేతంపై విశ్వాసం..సోనియాగాంధీ బహిరంగసభకు హాజరుకావడం, ప్రసంగించడం పార్టీ శ్రేణుల్లో జోష్ నింపడమే కాకుండా ప్రజలకు నిర్దిష్టమైన సందేశం వెళ్తుందన్నది పార్టీ నాయకుల అంచనా. కర్ణాటక ఫలితాల తర్వాత ప్రజల్లో నెలకొన్న అభిప్రాయానికి ఈ సభ, ఆమె స్పీచ్ మరింత ఉత్సాహం నింపుతుందని నేతలు భావిస్తున్నారు. తెలంగాణలో అధికార పార్టీ పట్ల ఉన్న వ్యతిరేకత, నెగెటివ్ ట్రెండ్ సోనియాగాంధీ మాటలతో మరింత తీవ్రమై పార్టీకి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయన్నది వారి ధీమా. తెలంగాణ విమోచన దినోత్సవం సెప్టెంబరు 17న జరుపుకునే రోజునే తెలంగాణకు ఆమె రావడం, బహిరంగసభలో పాల్గొనడం ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంటుందని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ ప్రజలకు రజాకర్ పాలన నుంచి సెప్టెంబరు 17న విముక్తి (విమోచనం) కలగడమే కాకుండా స్వేచ్ఛ లభించిందనే భావనతో సోనియాగాంధీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతారని ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడైన మల్లికార్జున ఖర్గే పూర్వీకులు రజాకర్ల అకృత్యాలకు బలయ్యారని, ఒక కుటుంబమే చనిపోయిందని ఆ నేత గుర్తుచేశారు. సోనియాగాంధీ సభకు మల్లికార్జున ఖర్గే కూడా జరుకానున్నారు.

కర్ణాటక తరహాలో..కర్ణాటకలో గ్రూపు తగాదాలకు తావు లేకుండా అన్ని స్థాయిల్లోని లీడర్లు ఐక్యంగా, సమష్టిగా పార్టీ యాక్టివిటీస్‌లో పాల్గొని విజయానికి దోహదం చేసిన తీరులో తెలంగాణలోనూ అలాంటి టీమ్ వర్క్ స్పిరిట్ నెలకొంటుందనే పాజిటివ్ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సోనియా టూర్‌తో పార్టీకి మైలేజ్ రావడంతో పాటు ప్రజల్లో కాంగ్రెస్‌ను ఆదరించాలనే మైండ్ సెట్ నెలకొంటుందని స్టేట్ లీడర్లు భావిస్తున్నారు. కర్ణాటక విజయం ఎలా మోరల్ సపోర్టుగా నిలుస్తున్నదో రాబోయే లోక్‌సభ ఎన్నికలకు తెలంగాణ గెలుపు మార్గదర్శకంగా ఉంటుందన్న మాటలు రాష్ట్ర నేతల నుంచి వినిపిస్తున్నాయి.

‘సీడబ్ల్యూసీ’ వ్యూహం..కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలను హైదరాబాద్‌లో నిర్వహించాలంటూ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి చేసిన విజ్ఞప్తికి ఏఐసీసీ సానుకూలంగా స్పందించింది. మూడు రోజుల పాటు పార్టీ అగ్రనేతలంతా హైదరాబాద్, తెలంగాణలోనే గడపనున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో సోనియాగాంధీ రావడానికి ఒప్పుకున్నారని రాష్ట్ర నేతలు సంతోషంగా ఉన్నారు. వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్‌లో జరిగే సీడబ్ల్యూసీ సమావేశాల్లో తీసుకునే నిర్ణయాలు మొత్తం జాతీయ రాజకీయాలను మలుపు తిప్పనున్నాయని, ‘ఇండియా’ కూటమి పేరుతో బీజేపీ వ్యతిరేక శక్తుల ప్రయత్నాలకు ‘గేట్ వే’గా మారనున్నదని పీసీసీ నేతలు భావిస్తున్నారు. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2005లో ప్లీనరీ జరిగిన తర్వాత అంతటి భారీస్థాయిలో ఇప్పుడు విధానపరమైన నిర్ణయాలు తీసుకునే సీడబ్ల్యూసీ సమావేశాలు జరగడం రాష్ట్రంపై ఆ పార్టీ పెడుతున్న ఫోకస్‌కు నిదర్శనం అనే ధీమా రాష్ట్ర లీడర్లలో వ్యక్తమవుతున్నది. ఆమె రాకతో, ఇచ్చే మెసేజ్‌తో, పార్టీ నేతలతో జరిపే విస్తృతస్థాయి సమావేశంలో చేసే సూచనలతో పార్టీలోని గ్రూపు తగాదాలు, వర్గాల ఘర్షణ ముగింపునకు వస్తుందనే అంచనాలూ ఉన్నాయి.