DailyDose

చంద్రబాబుపై అంబటి కామెంట్స్- TNI నేటి తాజా వార్తలు

చంద్రబాబుపై అంబటి కామెంట్స్- TNI నేటి తాజా వార్తలు

* చంద్రబాబుపై అంబటి కామెంట్స్

చట్టం దృష్టిలో చంద్రబాబు అయినా ఒకటే మరో బాబు అయిన ఒకటే అని …చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు తప్పు చేశారు కాబట్టి ఆయనకు భయమేస్తుందని తనకు అనిపిస్తుందన్నారు. చంద్రబాబును అరెస్ట్ చేస్తారని ఆయనకు కలవచ్చినట్టుంది అంటూ సెటైర్ విసిరారు. చంద్రబాబును అరెస్టు చేయాల్సిన అవసరం ఉంటే అరెస్టు చేస్తారని.. అరెస్టు చేయాల్సిన అవసరం లేకపోతే అరెస్టు చేయరని చెప్పుకొచ్చారు. చట్టానికి అడ్డం వస్తే ఆయన్ని కూడా అరెస్టు చేస్తారన్నారు. ప్రాథమిక ఆధారాలు లేనిదే ఎవరి మీద ఏ విధమైన కేసులు పెట్టరన్నారు. చంద్రబాబు తనను అరెస్ట్ చేస్తారని సానుభూతి పొందే మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు దొంగైనా పవన్ కళ్యాణ్ నోరు విప్పడని.. ఆయన హీరోనే అంటారన్నారు. వాళ్ళిద్దరికీ ఉన్న బంధం సంబంధం అలాంటిదని తెలిపారు. చంద్రబాబు రూ.118 కోట్లు ముడుపులు తీసుకున్నారన్న ఆధారాలున్న పవన్ కళ్యాణ్ నోరు విప్పరని అంబటి రాంబాబు వ్యాఖ్యలు చేశారు.

* ల‌గ‌డ‌పాటి  జనసేన పార్టీ లోకి వెళ్లతారా?

ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం అందుతోంది. ఇందులో భాగంగానే ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ రీ ఎంట్రీ కోసం అనుచ‌రుల స‌న్నాహక సమావేశం ఇవాళ విజయవాడలో జరిగిందని సమాచారం అందుతోంది. లగడపాటి రాజగోపాల్ రాజకీయాల్లోకి రావాలని పట్టుబడుతోంది ఆయన వర్గం.ఈ నెలాఖరులో అనుచరుల ఆత్మీయ సమావేశంలో పాల్గొననున్న రాజగోపాల్..విజయవాడ సిటీలో ఓ హోట‌ల్ లో నిన్న రహాస్య భేటీ జరిపారట. వచ్చే ఎన్నికల్లో బెజవాడ ఎంపీగా బరిలోకి దిగాలని కోరుతున్నారు ఆయన అనుచరులు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర విభ‌జ‌నకు వ్య‌తిరేకంగా పొలిటిక‌ల్ కెరీర్ కు స్వ‌స్తి ప‌లికిన రాజ‌గోపాల్…ఇప్పుడు రీ – ఎంట్రీ ఇవ్వబోతున్నారని స్పష్టం అవుతోంది. ఆయన జనసేన పార్టీ లోకి వెళతారని సమాచారం.

సోనియా లేఖపై మంత్రి ప్రహ్లాద్‌ జోషి సమాధానం

ఈనెల 18 నుంచి పార్లమెంట్‌ సమావేశాలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ ప్రధాని మోడీకి లేఖ రాశారు. పొలిటికల్‌ పార్టీలను సంప్రదించకుండా ఈ పార్లమెంట్‌ సెషన్స్‌ ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. ఇక సోనియా గాంధీ లేఖపై కేంద్ర పార్లమెంటరీ మంత్రి ప్రహ్లాద్ జోషి స్పందించారు. సెప్టెంబరు 18 నుంచి పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేసిన విధానాలు, సంప్రదాయాలను పాటించిన తర్వాతే సమావేశాలు ఏర్పాటు చేశామని, సెషన్‌కు పిలిచే ముందు రాజకీయ పార్టీలు ఎప్పుడూ సంప్రదించలేదని, సోనియా గాంధీ లేవనెత్తిన అంశాలపై ఇప్పటికే చర్చించామన్నామని సమాధానం ఇచ్చారు. అలాగే వర్షాకాల సమావేశాల్లో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ఆ అంశాలన్నింటిపై ప్రభుత్వం స్పందించిందని అన్నారు. ప్రజాస్వామ్య దేవాలయమైన పార్లమెంటు పనితీరును కూడా రాజకీయం చేయాలని, వివాదాలు లేని చోట అనవసర వివాదాలు సృష్టించాలని ప్రయత్నించడం అత్యంత దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు. ఆర్టికల్ 85 ప్రకారం.. రాజ్యాంగ ఆదేశాన్ని అనుసరించి పార్లమెంటు సమావేశాలు క్రమం తప్పకుండా జరుగుతాయని మీకు తెలుసని, పార్లమెంటరీ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఆమోదం పొందిన వెంటనే, సెప్టెంబర్ 18న పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కావాలని రాష్ట్రపతి పిలుపునిచ్చారని అన్నారు. పార్లమెంటు సమావేశాలను నిర్వహించే ముందు రాజకీయ పార్టీలు ఎప్పుడూ చర్చించడం ఉండదని, అలాగే సమస్యల గురించి ఎప్పుడూ చర్చించలేదని అన్నారు. రాష్ట్రపతి సమావేశాన్ని పిలిచిన తర్వాత, అలాగే సెషన్ ప్రారంభానికి ముందు, అన్ని పార్టీల నాయకుల సమావేశం జరుగుతుందని మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. అయితే పార్లమెంటులో తలెత్తే సమస్యల గురించి సభలో చర్చించడం జరుగుతుందన్నారు.కాగా, వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన కొద్దిసేపటికే అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా మీరు ప్రస్తావించిన అంశాలన్నీ లేవనెత్తగా, వాటిపై ప్రభుత్వం కూడా సమాధానమిచ్చిందని అన్నారు. సమస్యలపై సభలో చర్చించేందుకు ఎప్పుడు కూడా సిద్ధమేనని మంత్రి వివరించారు.పార్లమెంట్‌ వేదికను రాజకీయ వివాదాలకు ఉపయోగించకూడదన్నారు. ఇది కాకుండా, రాబోయే సెషన్‌ను సజావుగా నడపడానికి మీ పూర్తి సహకారాన్ని అందిస్తారని ఆశిస్తున్నామన్నారు. సభ సజావుగా సాగితే సమస్యలపై చర్చించి వాటిని పరిష్కరించుకునేందుకు ఆస్కారం ఉంటుందని వ్యాఖ్యానించారు. సోనియా గాంధీ బుధవారం ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. ప్రత్యేక పార్లమెంట్ సమావేశానికి ఎటువంటి అజెండా జాబితా చేయబడలేదని, మణిపూర్‌లో హింస, ధరల పెరుగుదలతో సహా తొమ్మిది అంశాలను చర్చకు లేవనెత్తాలని సూచించారు. సోనియా గాంధీ జాబితా చేసిన అంశాలలో కేంద్ర-రాష్ట్ర సంబంధాలు, మతపరమైన ఉద్రిక్తతల కేసులు పెరగడం, చైనా సరిహద్దు ఉల్లంఘనలు, అదానీ వ్యాపారానికి సంబంధించిన లావాదేవీలను దర్యాప్తు చేయడానికి జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) డిమాండ్ ఉన్నాయి.

*  శ్రీవారి ఆలయంపై నుంచి విమానం వెళ్లడంపై టీటీడీ ఆగ్రహం

తిరుమల శ్రీవారి ఆలయంపై నుంచి విమానం వెళ్లడంపై టీటీడీ ఆగ్రహం వ్యక్తం చేసింది. తిరుమల శ్రీవారి ఆలయాన్ని నో ఫ్లయింగ్‌ జోన్‌గా ప్రకటించాలని కేంద్రానికి అనేక మార్లు టీటీడీ లేఖలు రాసిన ప్రయోజనం లేకపోయింది. విమానాల రాకపోకలపై అధికారులు కనీసం సమాచారం కూడా ఇవ్వలేదని టీటీడీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.విమాన సంచారం ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా భావిస్తారు. తిరుమలను నో ఫ్లయింగ్‌ జోన్‌గా ప్రకటించాలని కేంద్రాన్ని టీటీడీ మరోసారి కోరనుంది. ఆగమ శాస్త్ర నియమం ప్రకారం తిరుమల ఆలయంపై ఎటువంటి విమానాలు వెళ్లరాదు. అయితే తరచూ ఆలయ పైభాగంలో విమానాలు వెళుతున్నాయి. తాజాగా ఘటన నేపథ్యంలో టీటీడీ అప్రమత్తమైంది.

ఎన్నికల వేళ కేంద్రం బిగ్ స్కెచ్

ఈనెల 18 నుంచి 22వ తేదీ వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు కేంద్ర ప్రభుత్వం పిలుపునివ్వడంతో ఈ సమావేశాల ఎజెండా ఏమిటి అనేది ఆసక్తిగా మారింది. సమావేశం తేదీలు ప్రకటించినప్పటికీ ఎజెండా ఏమిటో కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు స్పష్టం చేయలేదు. దీంతో సమావేశాల వెనుక ప్రభుత్వం ఉద్దేశంపై రకరకాల ఊహాగానాలు వ్యక్తం అవుతున్నయి. ఈ సమావేశాల ఎజెండా తెలియనప్పటికీ పలు కీలక బిల్లులు తీసుకొచ్చేందుకే ప్రభుత్వం స్పెషల్ సెషన్ నిర్వహిస్తోందనే ప్రచారం జరుగుతున్నది. ఈ క్రమంలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ప్రభుత్వం తీసుకుబోతున్న బిల్లులు ఇవే అనే టాక్ జోరుగా వినిపిస్తున్నది.రోహిణీ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఓబీసీ రిజర్వేషన్ల వర్గీకరణ బిల్లు, ఇండియా పేరును భారత్‌గా మార్పు, వన్ నేషన్ వన్ ఎలక్షన్, యూనిఫామ్ సివిల్ కోడ్, మహిళా రిజర్వేషన్ అంశాలకు సంబంధించిన బిల్లులను ప్రభుత్వం ఆమోదించే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది. పైన పేర్కొన్న అంశాలపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గత కొంత కాలంగా సీరియస్‌గా దృష్టి సారించింది. పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికల దృష్ట్యా ఈ ముఖ్యమైన బిల్లుల విషయంలో మోడీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకోబుతున్నదనే చర్చ జాతీయ రాజకీయ వర్గాల్లో జోరుగా జరుగుతున్నది.

పీడీఎస్​యూ ఆధ్వర్యంలో విద్యార్థుల ర్యాలీ

పెండింగ్ స్కాలర్​షిప్స్, ఫీజు రీయింబర్స్​మెంట్​ నిధులు విడుదల చేయాలని పట్టణంలో బుధవారం విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఆర్డీఓ ఆఫీస్​ను ముట్టడించారు.  ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలని, ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనార్టీ గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలని డిమాండ్​ చేశారు. మూడేళ్లుగా పెండింగ్​లో ఉన్న ఫీజు బకాయిలు రూ.4వేల కోట్లు తక్షణమే రిలీజ్​ చేయాలన్నారు. ప్రభుత్వ డిగ్రీ కాలేజీ నుంచి అంబేద్కర్​ సెంటర్​ మీదుగా ఆర్డీవో కార్యాలయం వరకు భారీ ర్యాలీ చేసి ఆర్డీవో ఆఫీసు ముందు బైఠాయించి నినాదాలు చేశారు. ఆర్డీవో మంగీలాల్​కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో   పీడీఎస్​యూ జిల్లా కార్యదర్శి కాంపాటి పృథ్వీ,జిల్లా అధ్యక్షురాలు కె.సంధ్య,డివిజన్​ కార్యదర్శి మునిగల శివప్రశాంత్​, పాయం నవీన్​ తదితరులుపాల్గొన్నారు. 

మాజీమంత్రి శ్రీరాములు ఆసక్తికర కామెంట్స్

 కాంగ్రెస్‌ పార్టీ కారణంగా కర్ణాటక రాష్ట్రం అంధకారంలో మునిగిపోయిందని మాజీ మంత్రి శ్రీరాములు అన్నారు. నగరంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రానికి రోజూ 18వేల మెగావాట్ల విద్యుత్‌ అవసరమని, కానీ ఉత్పత్తి పడిపోయిందన్నారు. బీజాపూర్‌, రాయచూర్‌ విద్యుత్‌ ఉత్పత్తి యూనిట్లు మూతపడాయన్నారు. పట్టణ ప్రాంతాల్లో లోడ్‌ షెడ్డింగ్‌, గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత విద్యుత్తుతో చీకట్లు కమ్ముకున్నాయని రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి శ్రీరాములు మండిపడ్డారు. ఉచిత హామీల పథకం ద్వారా అధికారం పొందిన వారికి వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెబుతారన్నారు. రాష్ట్రంలో కరువు తాండవిస్తోందని, ప్రజలకు, పశువులకు తాగునీరు కూడా దొరకడం లేదన్నారు. పంటలు ఎండిపోతున్నాయని, 42మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కిసాన్‌ సమ్మాన్‌ పథకానికి డబ్బులు ఇవ్వడం మానేసిందని, ఇందుకోసం రైతు సంఘాలు పోరాడాలన్నారు. కేంద్రప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం పొందుతున్న బొగ్గు బకాయిలు చెల్లించకపోవడంతో బొగ్గు సరఫరాలో వైవిధ్యం నెలకొందన్నారు. విలేకరుల సమావేశంలో విధానసభ సభ్యుడు వై,ఎం.సతీశ్‌, నగర మాజీ ఎమ్మెల్యే సోమశేఖర్‌రెడ్డి, రాష్ట్ర రైతు మోర్చా ప్రధాన కార్యదర్శి ఎస్‌. గురలింగనగౌడ, పార్టీ సీనియర్‌ నాయకుడు డాక్టర్‌ మహిపాల్‌, జిల్లాధ్యక్షుడు గోనాల్‌ మురహర్‌గౌడ, నాయకులు మదిరె కుమారస్వామి తదితరులున్నారు.

ఇండియా పేరు మార్పుపై స్పందించిన ఐక్యరాజ్య సమితి

పేర్ల మార్పులపై దేశాల నుంచి అభ్యర్థనలు గనుక వచ్చినట్లైతే.. ఐరాస వాటిని స్వీకరిస్తుందని, అలాగే పరిగణలోకి కూడా తీసుకుంటుందని పేర్కొంది. ఇండియా పేరు ఇంగ్లీష్‌లో కూడా భారత్ అని మారనుందా అని విలేకరులు ప్రశ్నలు సంధించగా.. ఐక్యరాజ్య సమితి జనరల్ సెక్రటరీ ఆంటోనియో గుటెరస్.. అలాగే డిప్యూటీ అధికార ప్రతినిధి ఫర్హాన్ హక్ స్పందించారు. గత ఏడాది టర్నీ పేరును తుర్కియేగా మార్చుకున్న విషయాన్ని ప్రస్తావించారు.ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ పేరు మీద రాష్ట్రపతి నుంచి ఆహ్వానాలు రావడం దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేగింది. ఇప్పుడు మొత్తం ఇదే చర్చ నడుస్తోంది. అయితే ఇందుకు సంబంధించి దీనిపై తాజాగా ఐక్యరాజ్యసమితి కూడా తమ స్పందనను తెలియజేసింది. పేర్ల మార్పులపై దేశాల నుంచి అభ్యర్థనలు గనుక వచ్చినట్లైతే.. ఐరాస వాటిని స్వీకరిస్తుందని, అలాగే పరిగణలోకి కూడా తీసుకుంటుందని పేర్కొంది. ఇండియా పేరు ఇంగ్లీష్‌లో కూడా భారత్ అని మారనుందా అని విలేకరులు ప్రశ్నలు సంధించగా.. ఐక్యరాజ్య సమితి జనరల్ సెక్రటరీ ఆంటోనియో గుటెరస్.. అలాగే డిప్యూటీ అధికార ప్రతినిధి ఫర్హాన్ హక్ స్పందించారు. గత ఏడాది టర్నీ పేరును తుర్కియేగా మార్చుకున్న విషయాన్ని ప్రస్తావించారు. తుర్కియే విషయంలో ఆ దేశ ప్రభుత్వం పంపిన అధికారిక అభ్యర్థనను తాము స్వీకరించామని.. అలాగే పేరు మార్పుపై సానుకూలంగా స్పందించామని పేర్కొన్నారు.ఇలా ఏ దేశమైనా కూడా ఇలాంటి అభ్యర్థనను పంపిస్తే వాటిని మేం పరిగణలోకి తీసుకుంటామని ఫర్హాన్ హక్ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా జీ20 సదస్సు కోసం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పంపిన ఆహ్వాన పత్రికల్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి బదులుగా… అందులో ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ముద్రించారు. అయితే ఈ ఆహ్వన పత్రిక బయటకి రావడంతో మీడియాలో కథనాలు వచ్చాయి. దీంతో ఇది రాజకీయంగా వివాదం రాజుకుంది. అలాగే జీ20 కి రానున్న విదేశీ అతిథులకు పంపిణీ చేయనున్న పుస్తకాల్లో కూడా ఇండియాకు బదులుగా భారత్ అని ముద్రించారు. అందులో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాకు బదులుగా.. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్‌గా రాసుకొచ్చారు. దీంతో ఈ వివాదం మరింత ముదిరిపోయింది. ఇక నుంచి దేశం పేరును.. ఇండియా స్థానంలో భారత్ అని చేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టనున్నట్లు ఊహాగాణాలు మొదలయ్యాయి.ఈ వ్యవహారమంతా వివాదం రాజుకోవడంతో విపక్ష పార్టీలు కూడా తీవ్రంగా మోదీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించాయి. మరోవైపు బీజేపీ నేతలు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యకు మద్ధతు తెలిపారు. వాస్తవానికి రాజ్యాంగం ప్రకారం దేశం పేరు భారత్ అని ఉందని.. అందువల్ల అలా రాయడంలో తప్పేముందని ప్రశ్నించారు. అలాగే ఈ వ్యవహారంపై ప్రధాని మోదీ కూడా స్పందించారు. ఈ విషయంలో కేంద్ర మంత్రులకు పలు సూచనలు చేసినట్లు సమాచారం. భారత్ అంశంపై ఆచితూచి వ్యవహరించాలని.. అనవసరం వ్యాఖ్యలు అస్సలు చేయకూడదని సూచనలు చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీ జీ20 సదస్సుకు సిద్ధమైపోయింది. సెప్టెంబర్ 9,10 వ తేదీల్లో జరగనున్న ఈ సదస్సుకు జీ20లో భాగస్వాములుగా ఉన్న దేశాధినేతలు హాజరుకానున్నారు. ఇప్పటికే వారి కోసం అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు.

బీజేపీ నేతపై కేసు నమోదు

 సనాతన ధర్మపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. రోజురోజుకూ గొడవ తీవ్రతరమవుతోంది. బీజేపీ నేతలు, హిందుత్వ వాదులు విమర్శలు చేస్తుండగా.. వాటికి స్టాలిన్ సైతం ధీటుగా సమాధానాలు చెబుతున్నారు. తాజాగా.. సనాతర ధర్మంపై ఉదయనిధి చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ ట్వీట్ చేసిన బీజేపీ ఐటీ ఇన్‌చార్జి అమిత్ మాల్వియాపై కేసు నమోదైంది. అతడి ట్వీట్‌పై డీఎంకే కార్యకర్త దినకరన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. తమిళనాడులో తిరుచ్చిలో మాల్వియాపై ఎఫ్‌ఐఆర్ దాఖలైంది. సనాతన ధర్మంపై ఉదయనిధి చేసిన వ్యాఖ్యలను అమిత్ మాల్వియా ఉద్దేశ పూర్వకంగా వక్రీకరించారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

వైకాపా నేత ఇంటి ఆవరణలో  క్షుద్ర పూజల కలకలం

 ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం చిన్నవారిగూడెంలో క్షుద్ర పూజల కలకలం రేగింది. గ్రామానికి చెందిన వైకాపా నేత బండారు వెంకట సుబ్బారావు ఇంటి ఆవరణలో గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేసినట్లు తెలుస్తోంది.  పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, బొగ్గులు, కొబ్బరికాయ, పువ్వులు వంటివి అక్కడ పడేసి వెళ్లారు. ఉదయాన్నే వీటిని చూసిన సుబ్బారావు కుటుంబసభ్యులు భయపడి తలుపులు వేసుకున్నారు. ఈ ఘటనపై గ్రామంలోని కొంత మందిపై అనుమానం ఉందని వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు సుబ్బారావు తెలిపారు. కాగా, చిన్నవారిగూడెం గ్రామంలో గత కొన్ని రోజులుగా గుర్తు తెలియని వ్యక్తులు చేతబడులు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. దీంతో గ్రామస్థులు రాత్రి వేళల్లో బయటకు రావాలంటే భయాందోళనకు గురవుతున్నారు.