Politics

హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్

హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్

రెండో విడతలో హైదరాబాద్‌ నగరంలో డబుల్‌బెడ్‌ రూమ్‌ ఇళ్ల పంపిణీకి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఈనెల 21న రెండో దశలో దాదాపు మరో 13,300 ఇళ్లను పేదలకు అందించనున్నట్టు పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. అర్హులైన లబ్ధిదారుల ఎంపికలో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల ప్రమేయం ఏమాత్రం లేదని మంత్రి పేర్కొన్నారు. హైదరాబాద్‌ నగరంలో డబుల్‌బెడ్‌ రూమ్‌ ఇళ్ల పంపిణీ కార్యక్రమంపై సచివాలయంలో మంత్రులు తలసాని, సబితా, మహమూద్‌ అలీ, మల్లారెడ్డి, నగర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లా కలెక్టర్లతో మంత్రి కేటీఆర్‌ సమీక్ష నిర్వహించారు.

అవకతవకలు జరిగితే అధికారులదే బాధ్యత….లబ్ధిదారులను ఎంపిక చేసే పూర్తి బాధ్యతను ప్రభుత్వం అధికారులకే అప్పగించిందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులందరి వివరాలతో కంప్యూటర్ ఆధారిత డ్రా తీసి లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నట్టు చెప్పారు. లబ్ధిదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అత్యంత పారదర్శకంగా అర్హులైన పేదలకు మాత్రమే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను అందిస్తున్నట్లు ప్రకటించారు. ఇటీవల మొదటి దశలో నగరంలో 11,700 ఇళ్లను ఎలాంటి ఇబ్బందులు లేకుండా పేదలకు అందించినట్లు చెప్పారు. ఎంపిక ప్రక్రియను అత్యంత పారదర్శకంగా మీడియా ముందు నిర్వహిస్తున్నామని, అవకతవకలు జరిగితే పూర్తిస్థాయి బాధ్యత అధికారులదేనన్నారు. తప్పు చేసిన అధికారులను ప్రభుత్వ ఉద్యోగం నుంచి తీసి వేసే స్థాయిలో కఠిన చర్యలు ఉంటాయని మంత్రి హెచ్చరించారు.

హైదరాబాద్‌లో త్వరలో గృహలక్ష్మి పథకం ప్రారంభం..
హైదరాబాద్‌లో గృహలక్ష్మి పథకం కూడా త్వరలో ప్రారంభమవుతుందని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. ఈ పథకానికి సంబంధించి హైదరాబాద్‌ నగర పరిధి వరకు కొన్ని మార్పులు చేర్పులు చేయాలని మంత్రులు సీఎంను కోరారని, వారు సూచించిన మార్పులకు సీఎం సూచన ప్రాయంగా అంగీకరించారన్నారు. హైదరాబాద్ నగరంలో నోటరీ ప్రాపర్టీల అంశంలోనూ త్వరలో పూర్తి స్థాయి మార్గదర్శకాలు వస్తాయని, 58, 59 జీవోల ద్వారా కూడా పెద్ద ఎత్తున ప్రజలకు ఉపశమనం లభించిందన్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వివిధ రకాల కార్యక్రమాల ద్వారా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, పట్టాల రెగ్యులరైజేషన్, నోటరీ ఆస్తుల అంశం వంటి కార్యక్రమాల ద్వారా ప్రతి నియోజకవర్గంలో కనీసం 15 నుంచి 20వేల మందికి లబ్ధి కలిగిందన్నారు. హైదరాబాద్‌లో నిర్మాణం చేస్తున్న లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు ప్రభుత్వానికి రూ.9100 కోట్ల ఖర్చయిందని.. కానీ వాటి మార్కెట్ విలువ దాదాపు రూ.50 వేల కోట్ల పైనే ఉంటుందన్నారు.