హైదరాబాద్ నగరంలో రెజ్లింగ్ ఎంటర్‌టైన్‌మెంట్ డబ్ల్యూడబ్ల్యూఈ సందడి కన్పిస్తోంది. మరికాసేపట్లో 7:30 గంటలకు గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరగనున్న ఈ ఈవెంట్ కోసం అభిమానులు పెద్ద సంఖ్యలో ఎదురుచూస్తున్నారు. చివరిగా 2017లో భారత్‌లో జరిగిన డబ్ల్యూడబ్ల్యూఈ ఈవెంట్.. ఆరేళ్ల తర్వాత మన దేశంలో జరుగుతుంది. ఈ పోరును చూసేందుకు హైదరాబాద్‌తో పాటు దేశంలోని ఇతర నగరాల నుంచి కూడా రెజ్లింగ్ అభిమానులు తరలి వచ్చారు.
మరోవైపు లెజెండ్ జాన్ సీనాతో పాటు 28 మంది వరల్డ్ స్టార్ రెజర్లు గచ్చిబౌలిలోని ఓ హోటల్‌లో బస చేశారు. ఈవెంట్‌లో ప్రపంచ హెవీవెయిట్ చాంపియన్ రోలిన్స్‌తో కలిసి జాన్ సినా.. గియోవానీ విన్సీ, లుడ్విగ్ కై సర్ద్ జోడీతో తలపడతారు. డబ్ల్యూడబ్ల్యూఈ ట్యాగ్ టీమ్ టైటిల్ కోసం ఇండస్ షేర్( సంగా, వీర్), కెవిన్ ఒవెన్స్, సమి జైన్ మధ్య ఫైట్ జరుగుతుంది. వీరితో పాటు డ్రూ మెక్‌లెట్రీ, షాంకీ, రింగ్ జనరల్ గుంతర్, కూడా బరిలో దిగనున్నారు.
రియా రిప్లీ వర్సెస్ నటాల్యా అమీతుమీ..మహిళల విభాగంలో డిఫెండింగ్ వరల్డ్ చాంపియన్ రియా రిప్లీ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. వరల్డ్ నెంబర్ వన్ అయిన రియా రిప్లీతో ఇటీవల వరల్డ్ నంబర్ వన్ స్థానం పోగోట్టుకున్న నటాల్యా కాసేపట్లో ఫైట్ చేయనున్నారు. రియా రిప్లీను ఓడించి వరల్డ్ నంబర్ వన్ స్థానం కోసం నటాల్యా ఎదురుచూస్తోంది. దాదాపు ఈ మ్యాచ్ కోసం నాలుగు వేల సీటింగ్ సామర్థ్యం ఉన్న గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం మొత్తం నిండిపోయినట్లు తెలుస్తోంది. ఈ పోటీలను సోనీ స్పోర్ట్స్ ఛానల్‌లో ప్రత్యక్ష ప్రసారం ఇవ్వనున్నారు. మరోవైపు చీరకట్టులో నటాల్యా అభిమానులను ఆకర్షిస్తోన్నది.