స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో అరెస్టయిన ప్రధాన నిందితుడు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని కాసేపట్లో ఏపీ సీఐడీ విజయవాడ కోర్టులో ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో.. శాంతి భద్రతల పరిరక్షణ కోసం విజయవాడ సివిల్ కోర్టు వద్ద భారీగా పోలీసుల మోహరించారు.
టీడీపీ కార్యకర్తలు వచ్చే అవకాశం ఉండడంతో సివిల్ కోర్టు వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. దాదాపు 200 మంది పోలీస్ సిబ్బందిని కోర్టు వద్ద మోహరించారు. కోర్టు బయట ఆందోళన చేస్తున్న పలువురు టీడీపీ కార్యకర్తల్ని అదుపులోకి తీసుకున్నారు. చంద్రబాబుని 3వ అదనపు జిల్లా, ఏసీబీ ప్రత్యేక కోర్టు జడ్జి వద్ద హాజరు పర్చనున్నట్లు తెలుస్తోంది.
ఇక స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం ప్రధాన సూత్రధారి అయిన చంద్రబాబును తమ రిమాండ్‌కు ఇవ్వాలని ఏపీ సీఐడీ కోరనుంది. ఈ క్రమంలో.. ఆయన్ని నేరుగా సిట్ ఆఫీస్‌కు తరలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే తాడేపల్లి సిట్ కార్యాలయం పోలీసుల అదుపులో ఉంది. సిట్ ఆఫీస్ వెళ్లే దారుల్ని పోలీసులు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అలాగే.. అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకరరెడ్డి ఇప్పటికే సిట్ కార్యాలయానికి చేరుకున్నట్లు సమాచారం.