చంద్రబాబును సీఐడీ పోలీసులు.. ఆదివారం తెల్లవారుజాము వరకు సిట్ కార్యాలయంలోనే ఉంచారు. 4 గంటల సమయంలో భారీ భద్రత మధ్య విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చి, ఆయనకు వైద్యపరీక్షలు నిర్వహించారు. శనివారం సాయంత్రం 5 గంటలకు సిట్ కార్యాలయానికి వచ్చిన చంద్రబాబు.. ఆదివారం తెల్లవారుజామున 3.00 గంటల వరకూ సుమారు 10 గంటలపాటు సిట్ కార్యాలయంలోనే ఉన్నారు. బయటకు వచ్చే సమయంలో ఆయన నీరసంగా కనిపించారు. సిట్ కార్యాలయం నుంచి ఆసుపత్రికి చంద్రబాబును తీసుకెళుతున్న వాహనాన్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేయగా పోలీసులు వారిని పక్కకు నెట్టివేశారు. చంద్రబాబు ప్రయాణిస్తున్న వాహనశ్రేణి, వెంట వస్తున్న పోలీసులు, తెదేపా కార్యకర్తలతో కనకదుర్గ వారధిపై ట్రాఫిక్ స్తంభించింది. ఆసుపత్రి వద్ద భారీగా మోహరించిన పోలీసులు.. సమీపంలోకి తెదేపా కార్యకర్తలు రాకుండా చర్యలు చేపట్టారు. సుమారు 4 గంటల సమయంలో ఆయనకు బీపీ, మధుమేహం, ఎక్స్‌రే, ఛాతీ సంబంధిత పరీక్షలు నిర్వహించారు. అనంతరం కోర్టుకు తీసుకెళ్లకుండా మళ్లీ సిట్ కార్యాలయానికే వాహనశ్రేణిని తీసుకువెళ్లారు.
చంద్రబాబుకు వైద్యపరీక్షలు పూర్తి

Related tags :