Politics

జీ20 దేశాధినేతలకు ప్రత్యేక విందు ఏర్పాటు చేసిన ముర్ము

జీ20 దేశాధినేతలకు ప్రత్యేక విందు ఏర్పాటు చేసిన ముర్ము

జీ20 శిఖరాగ్ర సదస్సు (G20 Summit)లో పాల్గొనేందుకు దిల్లీకి చేరుకున్న దేశాధినేతలు, ఇతర అతిథులకు భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (Droupadi Murmu) ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. సదస్సు ప్రధాన వేదిక ‘భారత్‌ మండపం’లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi)తో కలిసి రాష్ట్రపతి అతిథులకు స్వయంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వేదిక బ్యాగ్రౌండ్‌లో ‘నలంద విశ్వవిద్యాలయం’ చిత్రాన్ని ఉంచారు. విందులో భాగంగా ప్రపంచ అగ్రనేతలకు భారతీయ వంటకాలను రుచి చూపించనున్నారు.

వెండి పాత్రలు.. నోరూరించే రుచులు..!
విందులో భాగంగా అతిథులకు బంగారం, వెండి పాత్రల్లో విందు వడ్డించనున్నారు. చిరుధాన్యాలు, పనసపండుతో చేసిన గాలెట్టె (బ్రెడ్‌ వంటి ఫ్రెంచి వంటకం), గ్లేజ్‌డ్‌ ఫారెస్ట్‌ మష్రూమ్‌, చిరుధాన్యాల వంటకాలు, కేరళ రెడ్‌రైస్‌, వివిధ రకాల బ్రెడ్‌లతోపాటు ముంబయి పావ్‌ కూడా అందిస్తారు. డెజర్ట్‌లో యాలకులు, ఊదలతో చేసిన మధురిమ అనే పుడ్డింగ్‌, ఫిగ్‌ పీచ్‌ కంపోట్‌, ఆంబేమొహార్‌ క్రిస్పీస్‌, పాలు-గోధుమలతో చేసిన నట్స్‌ ఉంటాయి. పానీయాల్లో కశ్మీరీ ఖావా, ఫిల్టర్‌ కాఫీ, డార్జిలింగ్‌ టీ, పాన్‌ ఫ్లేవర్డ్‌ చాక్లెట్‌ ఏర్పాటు చేశారు.

ఇదిలా ఉండగా.. కేంద్ర మంత్రులు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, భారత ప్రభుత్వ కార్యదర్శులు, ప్రముఖ పారిశ్రామిక వేత్తలనూ ఈ విందుకు ఆహ్వానించిన విషయం తెలిసిందే. అంతకుముందు జీ20 సదస్సు తొలి రోజులో భాగంగా సభ్యదేశాలు పలు కీలక అంశాలపై చర్చించాయి. ‘దిల్లీ డిక్లరేషన్‌’పై ఏకాభిప్రాయం రావడంతోపాటు ఆఫ్రికన్‌ యూనియన్‌ సభ్యత్వానికి ఆమోదం వంటి అనేక విషయాలపై స్పష్టత వచ్చింది. ఇదే సమయంలో పలు సభ్యదేశాలతో భారత్ ద్వైపాక్షిక చర్చలు జరిపింది.