Sports

మూడోస్థానంలో ప్రజ్ఞానంద

మూడోస్థానంలో ప్రజ్ఞానంద

టాటా స్టీల్‌ చెస్‌ ఇండియా 2023 ఛాంపియన్‌షిప్‌ ర్యాపిడ్‌ విభాగంలో ఉమ్మడిగా మూడో స్థానంలో నిలిచిన ప్రజ్ఞానంద.. బ్లిట్జ్‌లోనూ తృతీయ స్థానాన్ని దక్కించుకున్నాడు. 18 రౌండ్లు ముగిసే సరికి ఈ భారత యువ గ్రాండ్‌మాస్టర్‌ 11 పాయింట్లు ఖాతాలో వేసుకున్నాడు. నాదిర్బెక్‌ (ఉజ్బెకిస్థాన్‌) కూడా 11 పాయింట్లే సాధించినప్పటికీ మెరుగైన టైబ్రేక్‌ ప్రదర్శన కారణంగా అతను రెండో స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. రష్యా గ్రాండ్‌మాస్టర్‌ అలెగ్జాండర్‌ గ్రిషూక్‌ (12 పాయింట్లు) బ్లిట్జ్‌ టైటిల్‌ కైవసం చేసుకున్నాడు. తెలంగాణ గ్రాండ్‌మాస్టర్‌ అర్జున్‌ ఇరిగేశి (10.5) నాలుగో స్థానంలో నిలిచాడు. హరికృష్ణ (8.5), విదిత్‌ సంతోష్‌ (8), గుకేశ్‌ (7.5) వరుసగా ఆరు, ఏడు, ఎనిమిది స్థానాలతో సంతృప్తి చెందారు. శుక్రవారం తొమ్మిది రౌండ్లు ముగిసే సరికి 6.5 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగిన ప్రజ్ఞానంద.. శనివారం కూడా పోరును వరుస విజయాలతో మొదలెట్టాడు. కానీ నాదిర్బెక్‌ (13వ రౌండ్‌), గ్రిషూక్‌ (15వ), విదిత్‌ (16వ) చేతిలో ఓడటం ప్రజ్ఞానందను దెబ్బతీసింది. అతను మొత్తం 9 విజయాలు, 4 డ్రాలు, 5 ఓటములు నమోదు చేశాడు.