WorldWonders

పంజాగుట్ట హోటల్‌లో రైతా అడిగినందుకు కస్టమర్ హత్య

పంజాగుట్ట హోటల్‌లో రైతా అడిగినందుకు కస్టమర్ హత్య

బిర్యానీ తింటూ అదనంగా రైతా(పెరుగు) అడిగిన పాపానికి రెస్టారెంట్‌ సిబ్బంది ఓ యువకుడిపై విచక్షణా రహితంగా దాడి చేశారు. పోలీసులు వచ్చినా వారి ముందు కూడా కొట్టడం.. పోలీస్‌స్టేషన్‌లో ఊపిరి ఆడటం లేదని చెప్పినా పోలీసులు సైతం పట్టించుకోకుండా చివరి నిమిషంలో ఆస్పత్రికి తరలించడంతో అప్పటికే పరిస్థితి విషమించి చనిపోయాడు. పంజగుట్ట పోలీసుస్టేషన్‌ పరిధిలోని మెరీడియన్‌ రెస్టారెంట్‌లో ఆదివారం రాత్రి చోటు చేసుకున్న ఈ ఘటనపై పోలీసులు, ప్రత్యక్షసాక్షుల కథనం ప్రకారం.. మినరల్‌ వాటర్‌ వ్యాపారం చేసే పాతబస్తీ చాంద్రాయణగుట్టకు చెందిన మహ్మద్‌ లియాకత్‌ (32) ఆదివారం రాత్రి 10:30 ప్రాంతంలో తన స్నేహితులైన తొమ్మిది మందితో కలిసి పంజగుట్ట కూడలిలో ఉన్న మెరీడియన్‌ రెస్టారెంట్‌కు వచ్చారు.

బిర్యానీ తింటున్న సమయంలో లియాకత్‌ రైతా అదనంగా కావాలని వెయిటర్‌ను కోరారు. రెండు సార్లు అడిగినా వెయిటర్‌ నుంచి నిర్లక్ష్యపు సమాధానం, పరుషపదజాలం రావడంతో లియాకత్‌కు, అతడికి వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసుల సమక్షంలోనే దాడి: దీంతో మరో ఇద్దరు వెయిటర్లు, రెస్టారెంట్‌ మేనేజర్, సూపర్‌వైజర్‌ వచ్చి విచక్షణారహితంగా లియాకత్‌తో పాటు అతడి స్నేహితులపై దాడికి దిగారు. ఇంతలో ఓ రెస్టారెంట్‌ ఉద్యోగి సమాచారంకో అక్కడకు చేరుకున్న పంజగుట్ట పోలీసుస్టేషన్‌ గస్తీ సిబ్బంది ఎదుటే రెస్టారెంట్‌ సిబ్బంది, నిర్వాహకులు లియాకత్‌ తదితరులపై దాడి కొనసాగించారు.

ఈ దృశ్యాలు అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. పోలీసుల సమక్షంలోనే దాడి చేస్తూ రెస్టారెంట్‌పై అంతస్తు నుంచి కింది వరకు తీసుకువచ్చారని ప్రత్యక్షసాక్షులు చెప్తున్నారు. వీరి దెబ్బలు తాళలేకపోయిన లియాకత్‌ ఆయాసంతో అక్కడే కూలబడిపోయాడు. దీంతో పోలీసులు అతడితో పాటు స్నేహితులు మహ్మద్‌ జమీర్, మహ్మద్‌ నాసర్, మహ్మద్‌ ముస్తఫాను ఠాణాకు తీసుకువచ్చారు. అప్పటికే లియాకత్‌ తనకు తీవ్రంగా ఆయాసం వస్తోందని, ఊపిరి అందట్లేదని చెప్తున్నా డ్యూటీలో ఉన్న ఎస్సై, కానిస్టేబుల్‌ పట్టించుకోలేదని అంటున్నారు. ‘నాటకాలు ఆడుతున్నావా..?’ అంటూ అతడినే గద్దించారు. కొద్దిసేపటికి లియాకత్‌ అక్కడే కుప్పకూలిపోవడంతో కారు తాళాలు ఇచ్చి స్నేహితులతోనే సోమాజీగూడలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి పంపారు.

అప్పటికే లియాకత్‌ చనిపోయినట్టు ప్రైవేట్‌ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న ఎంఐఎం పార్టీ ఎమ్మెల్సీ మీర్జా రహమత్‌ బేగ్‌ ఆస్పత్రి వద్దకు వచ్చి మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బైఠాయించారు. ఆ మేరకు పోలీసులు హామీ ఇవ్వడంతో పరిస్థితి అప్పటికి సద్దుమణిగింది. వెస్ట్‌జోన్‌ డీసీపీ జోయల్‌ డెవిస్‌ పంజగుట్ట పోలీసులపై తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిసింది. రెస్టారెంట్‌ను తాత్కాలికంగా మూసివేయించారని సమాచారం. మృతునికి భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. లియాకత్‌ స్నేహితుడు, బండ్లగూడకు చెందిన హస్ర చాంద్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వెయిటర్లు బీహార్‌ వాస్తవ్యుడు, అమీర్‌పేట హాస్టల్‌లో ఉండే కృష్ణ సూర్య ప్రకాష్‌ (33), అమీర్‌పేట బాపూ నగర్‌కు చెందిన మెగావత్‌ పాండు (36), సరూర్‌నగర్‌కు చెందిన మేనేజర్‌ సయ్యద్‌ హఫ్తాబ్‌ హైదర్‌ (55), జగద్గిరిగుట్టకు చెందిన సూపర్‌వైజర్‌ అబ్దుల్‌ మోయిన్‌(40), సనత్‌నగర్‌కు చెందిన సూపర్‌వైజర్‌ మహ్మద్‌ అజీజుద్దీన్‌ (23)పై హత్య కేసు నమోదు చేశారు. మృతదేహానికి గాంధీ ఆస్పత్రి మార్చురీలో పోస్టుమార్టం పరీక్షలు పూర్తి చేసి కుటుంబీకులకు అప్పగించారు.