Politics

చంద్రబాబుతో భేటీకి పవన్‌కు అనుమతి-తాజావార్తలు

చంద్రబాబుతో భేటీకి పవన్‌కు అనుమతి-తాజావార్తలు

* తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ములాఖత్ కానున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబుతో పవన్ కల్యాణ్ పరామర్శించనున్నారు. ఇప్పటికే ములాఖత్‌ అయ్యేందుకు జైలు అధికారుల నుంచి అనుమతిలభించింది. అయితే, చంద్రబాబు, పవన్ మధ్య సుమారు 40 నిమిషాల పాటు భేటీ జరగుతుందని సమాచారం. ములాఖత్ తర్వాత ఇద్దరి మధ్య జరిగిన చర్చల వివరాలను మీడియాకు వెళ్లడించే అవకాశం ఉంది. పవన్ కల్యాణ్ ఏం మాట్లాడనున్నారు అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఏపీ రాజకీయాల్లో ఇదొక కీలక పరిణామమేనని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

* రాజకీయాలు ఎప్పుడూ ఉంటాయని.. వాటిని ఎన్నికలప్పుడు చేసుకోవచ్చని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. సంగారెడ్డి జిల్లాలో మోనిన్ పరిశ్రమకు కేటీఆర్‌ భూమిపూజ చేశారు. దేశంలోనే మొదటి యూనిట్‌ను సంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేస్తున్న మోనిన్ సంస్థ.. రూ.300 కోట్లకుపైగా పెట్టుబడితో 40ఎకరాల విస్తీర్ణంలో పరిశ్రమ ఏర్పాటు చేస్తున్నది. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ పరిశ్రమలు వచ్చినప్పుడు అందరూ సహకరించి నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు కృషి చేయాలన్నారు.

* వినాయ‌క న‌వ‌రాత్రుల‌కు హైద‌రాబాద్ న‌గ‌రం సిద్ధ‌మ‌వుతోంది. ఇక ఖైర‌తాబాద్ వినాయ‌కుడిని ద‌ర్శించుకునేందుక భ‌క్తులు న‌గ‌రం న‌లుమూల‌ల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల‌పై క‌ర్ణాట‌క‌, మ‌హారాష్ట్రాల నుంచి కూడా త‌ర‌లివ‌స్తుంటారు. ఈ క్ర‌మంలో భ‌క్తుల‌ను దృష్టిలో ఉంచుకుని హైద‌రాబాద్ మెట్రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. వినాయ‌క న‌వ‌రాత్రుల సంంద‌ర్భంగా అర్ధ‌రాత్రి ఒంటి గంట వ‌ర‌కు మెట్రో రైళ్ల‌ను న‌డిపేందుకు యోచిస్తున్న‌ట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. గ‌తంలో మాదిరిగానే ఈ సౌక‌ర్యాన్ని అందుబాటులోకి తీసుకువ‌స్తామ‌న్నారు. ఖైర‌తాబాద్ గ‌ణేశ్‌ను ద‌ర్శించుకునే భ‌క్తుల‌ను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు పేర్కొన్నారు. ఈ నేప‌థ్యంలో ఖైర‌తాబాద్ స్టేష‌న్‌లో అద‌న‌పు టికెట్ కౌంట‌ర్ల‌ను ఓపెన్ చేస్తామ‌న్నారు. భ‌క్తులు వీలైనంత త్వ‌ర‌గా టికెట్ పొందేలా చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. ఖైర‌తాబాద్ మెట్రో స్టేష‌న్ వ‌ద్ద అద‌న‌పు భ‌ద్ర‌త‌ను ఏర్పాటు చేస్తామ‌న్నారు.

* తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టుకు నిరసనగా హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగులు కదం తొక్కారు. విప్రో సర్కిల్‌ నుంచి ఔటర్‌ రింగ్‌రోడ్డు వరకు భారీ ర్యాలీ నిర్వహించిన ఐటీ ఉద్యోగులు చంద్రబాబు అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండించారు. ఆయామ్‌ విత్‌ సీబీఎన్‌ కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించడంతో ఉద్రిక్తత నెలకొంది. ఆందోళనకు దిగిన ఐటీ ఉద్యోగులను చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించినప్పటికీ వారు వెనక్కి తగ్గలేదు. దీంతో విప్రోకూడలిలో ఉద్రిక్తత నెలకొంది.

* తెదేపా అధినేత చంద్రబాబును రాజమహేంద్రవరం జైలులో సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కలిశారు. ఏసీబీ కోర్టు, ఏపీ హైకోర్టులో చంద్రబాబు తరఫున లూథ్రా న్యాయపోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. దాదాపు 40 నిమిషాల పాటు చంద్రబాబుతో ములాఖత్‌ అయిన లూథ్రా.. కోర్టులో ఇవాళ జరిగిన పరిణామాలు, తదుపరి కార్యాచరణను వివరించినట్టు తెలిసింది. ములాఖత్‌ తర్వాత లూథ్రా.. చంద్రబాబు కుటుంబ సభ్యులు, తెదేపా ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. చంద్రబాబుతో సమావేశమైన వివరాలతో పాటు న్యాయ పరంగా తీసుకోవాల్సిన అంశాలపై చర్చించినట్టు సమాచారం.

* తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు విశాఖ జిల్లా జనసేన నేతలు సంఘీభావం తెలిపారు. జనసేన రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివదత్‌, చోడవరం ఇన్‌ఛార్జి పీఎస్‌ఎస్‌ రాజు, జీవీఎంసీ కార్పొరేటర్‌ పీతల మూర్తి యాదవ్‌ బుధవారం రాజమహేంద్రవరంలో లోకేశ్‌ను కలిసి పరామర్శించారు. చంద్రబాబును తప్పుడు కేసులతోనే జైలుపాలు చేశారని మండిపడ్డారు. అక్రమ కేసులతో ప్రభుత్వం ప్రతిపక్షాలను ఇబ్బందులు పెడుతోందన్నారు. జగన్‌ ప్రభుత్వాన్ని ప్రజలు అసహ్యించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు అండగా నిలుస్తున్న జనసేన నేతలకు లోకేశ్‌ కృతజ్ఞతలు తెలిపారు. వైకాపాను రాష్ట్రం నుంచి తరిమికొట్టేందుకు అంతా కలిసి పోరాడుతామన్నారు.

* భారత సంతతి వ్యక్తి, బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ తల్లిదండ్రులు యశ్వీర్‌, ఉషా సునాక్‌ బుధవారం మంత్రాలయంలోని రాఘవేంద్ర స్వామి మఠాన్ని సందర్శించారు. సునాక్‌ అత్త, అక్షతా మూర్తి తల్లి సుధామూర్తి సైతం వారితో పాటు మఠాన్ని సందర్శించారు. శ్రీమఠం చేరుకున్న వీరికి మఠం అధికారులు సంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు. ముందుగా గ్రామ దేవత మంచాలమ్మను దర్శించుకుని అనంతరం రాఘవేంద్ర స్వామి మూల బృందావనాన్ని వీరు దర్శించుకున్నారు.

* తెలంగాణ ఉద్యమ సమయంలో యువతకు ఆశలు కల్పించి.. సెంటిమెంట్‌ రగిలించి సీఎం కేసీఆర్ నిరుద్యోగ యువత ప్రాణాలు బలిగొన్నారని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మండిపడ్డారు. ఇందిరా పార్క్ వద్ద భాజపా చేపట్టిన 24 గంటల నిరాహార దీక్షలో ఆమె పాల్గొన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్‌లు ఇచ్చి ప్రశ్నపత్రాలు లీక్ చేశారని.. బాధ్యులపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. కాంట్రాక్ట్ వ్యవస్థ ఇంకా ఎందుకు నడుస్తుందో కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టుల పేరుతో దోపిడీ చేసిన కేసీఆర్‌కు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని డీకే అరుణ హెచ్చరించారు. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు ఒక బోగస్ అన్నారు. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు అంచనాలు పెంచి.. అడ్డగోలుగా ప్రజా ధనాన్ని దోచుకున్నారని ఆరోపించారు. పూర్తి కానీ ప్రాజెక్టును ప్రారంభించేందుకు సిద్ధం అయ్యారని విమర్శించారు.

* ప్రశ్నించిన వారందరినీ అరెస్టు చేసుకుంటూ వెళ్తారా? అని ఏపీ ప్రభుత్వాన్ని తెదేపా సీనియర్‌ నేత, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ప్రశ్నించారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ వ్యవహారంలో చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో తెదేపా కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రశ్నించిన వారిని ఇలానే అరెస్టు చేసుకుంటూ పోతే రెండు సీట్లకే పరిమితమవుతారని హెచ్చరించారు.

* మాజీ ముఖ్యమంత్రి, తెదేపా జాతీయాధ్యక్షుడు చంద్రబాబు అరెస్టుపై ప్రముఖ సినీనటుడు రజనీకాంత్‌ స్పందించారు. ఈ మేరకు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు ఫోన్‌ చేసి మాట్లాడారు. తన ఆత్మీయ మిత్రుడు చంద్రబాబు గొప్ప పోరాట యోధుడని లోకేశ్‌కు ధైర్యం చెప్పారు.

* చిత్తూరు జిల్లా శాంతిపురం మండల వైకాపాలో వర్గవిభేదాలు భగ్గుమన్నాయి. కుప్పం పర్యటనకు వెళ్లిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాన్వాయ్‌ను మోరసనపల్లి వద్ద వైకాపా అసమ్మతి నాయకులు అడ్డుకున్నారు. కుప్పం-పలమనేరు జాతీయ రహదారిపై బైఠాయించి.. ప్రభుత్వ స్థలంలో ఆక్రమణలను అరికట్టాలంటూ ఆందోళనకు దిగారు

* తొమ్మిదేళ్లుగా భారాస సర్కారు నిరుద్యోగుల పట్ల నిర్లక్ష్యం, వివక్ష చూపుతోందని కేంద్రమంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి విమర్శించారు. నిరుద్యోగ యువత తెలంగాణ కోసం పోరాటం చేశారని.. 1200 మంది ఆత్మ బలిదానం చేసుకున్నారని చెప్పారు. తొమ్మిదేళ్లలో కేసీఆర్‌ సర్కార్‌ నిరుద్యోగులను మోసం చేసిందంటూ భాజపా ఆధ్వర్యంలో ఇందిరాపార్కు ధర్నా చౌక్‌ వద్ద ‘24 గంటల నిరాహార దీక్ష’ చేపట్టారు