DailyDose

16 బ్యాంకులను ముంచేసిన మరో భారీ స్కామ్-నేరవార్తలు

16 బ్యాంకులను ముంచేసిన మరో భారీ స్కామ్-నేరవార్తలు

* దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియంను వేల కోట్లకు ముంచేసిన స్కాం ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి ముంబైకి చెందిన డెవలపర్‌ యూనిటీ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్ లిమిటెడ్‌పై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) కేసు నమోదు చేసింది. కంపెనీ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) కిషోర్ కృష్ణ అవర్‌సేకర్, ప్రమోటర్లు అభిజీత్ కిషోర్ అవర్‌సేకర్, ఆశిష్ అవర్‌సేకర్ (ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్) అభియోగాలు మోపింది. ముగ్గురు డైరెక్టర్లు, కొంతమంది గుర్తుతెలియని ప్రభుత్వోద్యోగులతోపాటు పలువురు అధికారులపై సీబీఐ అభియోగాలు నమోదు చేసింది. ఎస్‌బీఐతోపాటు ఇతర, 15 బ్యాంకుల కన్సార్టియంనురూ. 3,847.58 కోట్ల మేరకు మోసం చేశారన్న ఆరోపణలపై సీబీఐఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ముంబైలోని స్ట్రెస్‌డ్ అసెట్స్ మేనేజ్‌మెంట్ బ్రాంచ్, ఎస్‌బిఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా గురువారం ఎఫ్‌ఐఆర్ (ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్) నమోదైంది. ముంబైలోని తమవాణిజ్య శాఖలో మోసం జరిగిందని, నిందితులు కల్పిత లావాదేవీలు చేయడం, బ్యాంకును మోసం చేయడం, చట్టవిరుద్ధంగా, మోస పూరితంగా ఖాతాల పుస్తకాలను తారుమారు చేసి బ్యాంకు నిధులను స్వాహా చేశారని ఈ కేసులో, ఆగస్ట్ 17, 2023న, ఎస్‌బీఐ డీజీఎం (ముంబయి) రజనీకాంత్ ఠాకూర్, యూనిటీ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్, దాని డైరెక్టర్లు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. మొత్తం 23 బ్యాంకులున్నప్పటికీ, కేవలం 16 బ్యాంకులు మాత్రమే తమ అంచనా నష్టాలను నివేదించాయి. ఇందులో బ్యాంక్ ఆఫ్ బరోడా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ , యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధానంగా ఉన్నాయి.

* వినాయక చవితి పర్వదినాన ఓ ఆర్టీసీ బస్సు కండక్టర్‌ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఒంటిపై పెట్రోల్‌ పోసుకొని నిప్పంటించుకున్నాడు. మెదక్‌ జిల్లా నర్సాపూర్‌లో ఈ ఘటన జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం….నర్సాపూర్‌కు చెందిన సాయితేజ (24)కు తన తండ్రి ఇటీవల అనారోగ్యంతో మరణిచడంతో ఆయన స్థానంలో కండక్టర్‌ ఉద్యోగం వచ్చింది. అయితే, మద్యానికి బానిసైన యువకుడు విధులకు సక్రమంగా హాజరు కాకపోవడంతో తల్లి మందలించింది. దీంతో మనస్తాపానికి గురై నర్సాపూర్‌ ఆర్టీసీ డీపో సమీపంలో పెట్రోల్‌ పోసుకొని నిప్పంటించుకున్నాడు. గమనించిన డిపో సెక్యూరిటీ సిబ్బంది మంటలు ఆర్పారు. అనంతరం సాయితేజను సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలపాలైన సాయితేజ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

* వాస్తు దోషాలు (Vastu Mistakes) తొలగింపు సాకుతో ఐదుగురు వ్యక్తులు ఒక మహిళపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఐదేళ్లుగా జరుగుతున్న ఈ దారుణంపై పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో బాధిత మహిళ భర్త స్నేహితులైన ఐదుగురు నిందితులను అరెస్ట్‌ చేశారు. మహారాష్ట్రలోని పాల్ఘడ్‌ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 35 ఏండ్ల మహిళ భర్తకు దుష్టశక్తులు ఆవహించాయని, వారున్న ఇంట్లో వాస్తు దోషాలు ఉన్నాయని అతడి ఐదుగురు స్నేహితులు ఆమెను నమ్మించారు. ఆమె భర్తకు ఎలాంటి హాని జరుగకుండా ఉండేందుకు, ప్రభుత్వ ఉద్యోగ భద్రతతోపాటు ఆ ఇంట్లో శాంతి కోసం పలు పూజలు చేయాలని ఆమెను నమ్మించారు. 2018 ఏప్రిల్‌ నుంచి ఆ మహిళ ఒంటరిగా ఉన్నప్పుడు ఆమె ఇంటికి వెళ్లేవారు. పూజలు నిర్వహించి ‘పంచామృతం’ పేరుతో మత్తు మందు కలిపిన పానీయం తాగించేవారు. ఆ మహిళ మత్తులో ఉండగా అత్యాచారానికి పాల్పడేవారు. 2019లో థానేలోని యూర్ ఫారెస్ట్‌లో, కందివాలిలోని ప్రధాన నిందితుడి మఠంలో, లోనావాలాలోని రిసార్ట్‌లో కూడా ఆ మహిళపై ఆమె భర్త స్నేహితులు అత్యాచారం చేశారు. అలాగే పూజల కోసమంటూ రూ.2.1 లక్షల డబ్బుతోపాటు బంగారాన్ని ఆమె నుంచి తీసుకున్నారు. సెప్టెంబర్‌ 11న బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆమె భర్త స్నేహితులైన రవీంద్ర భాటే, దిలీప్ గైక్వాడ్, గౌరవ్ సాల్వి, మహేంద్ర కుమావత్, గణేష్ కదమ్‌లను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఐదుగురు కలిసి ఇదే తరహాలో ఇతర మహిళలపై లైంగిక దాడులకు పాల్పడి ఉంటారా? అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.

* తరగతి గదిలో అనుమానాస్పదంగా ఉరివేసుకుని విద్యార్థి మృతి చెందాడు. శనివారం ఉదయం పొగాకు ఉత్పత్తులను రహస్యంగా వినియోగించేందుకు విద్యార్ధి బాత్‌రూమ్‌కు వెళ్లగా సెక్యూరిటీ గార్డు పట్టుకున్నాడు. ఆ తర్వాత సెక్యూరిటీ గార్డు ఈ విషయాన్ని హాస్టల్‌ సూపర్‌వైజర్‌కు తెలిపాడు. ఇది జరిగిన మరుసటి రోజు అంటే ఆదివారం (సెప్టెంబర్‌ 17) సదరు విద్యార్ధి తరగతి గదిలో దిమ్మెలకు ఉరి వేసుకుని కనిపించాడు. ఈ షాకింగ్‌ ఘటన పశ్చిమ బెంగాల్‌లోని కక్‌ద్వీప్‌లో చోటు చేసుకుంది. మృతి చెందిన విద్యార్థి పేరు అనుశంకర్ మోండల్ (14). అనుశంకర్ బమంగర్ సబ్లా హైస్కూల్‌లో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. పాఠశాలలోని హాస్టల్‌లో నివాసం ఉంటూ రహస్యంగా పొగాకు ఉత్పత్తులు వినియోగించేవాడు. దీనిపై హాస్టల్‌ సూపర్‌వైజర్‌ తారాపద్‌ జానా మాట్లాడుతూ.. వంటగది సరిగ్గా ఉందో లేదో చూసేందుకు ఉదయం వంటగదికి వెళ్లాను. తర్వాత పాఠశాల తరగతి గదుల సందర్శనకు వెళ్లాను. ఆ సమయంలో ఒక సెక్యూరిటీ గార్డు తొమ్మిదో, పదో విద్యార్థుల హాస్టల్‌ను చూసుకునే ఇన్‌చార్జి గోవింద సర్దార్ అరుణ్‌బాబు ఫోన్ చేస్తున్నాడని చెప్పాడు. ఈ క్రమంలోనే విద్యార్ధి అనుశంకర్ మోండల్ బాత్‌రూమ్‌లో పొగాకు ఉత్పత్తులను వినియోగిస్తున్నట్లు తెలిపాడు. అనుశంకర్‌తోపాటు సుజిత్ మైతీ అనే మరో విద్యార్థి కూడా ఉన్నాడు. పొగాకు వినియోగం ఆరోగ్యానికి ప్రమాదకరమని, మళ్లీ ఇలా చేయవద్దని హెచ్చరించిన తర్వాత అందరూ భోజనానికి వెళ్లారు. ఆ తర్వాత నేను కూడా వెళ్లిపోయాను. ఆ తర్వాత అనుశంకర్‌ కనబడకుండా పోయాడు. కొందరు విద్యార్థులు స్నానానికి వెళ్లి ఉంటాడని చెప్పారు. ఆ తర్వాత కూడా హాస్టల్‌, తరగతి గదుల్లో వెతికారు. ఈ క్రమంలోనే అనుశంకర్‌ తరగతి గదిలో ఉరివేసుకున్నట్లు చెప్పారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాం. పోలీసులతోపాటు గ్రామస్థులు కూడా వచ్చారు. వెంటనే బాలుడిని కిందికి దించి ఆసుపత్రికి తీసుకెళ్లాం. కానీ మా ప్రయత్నాలేవీ ఫలించలేదని హాస్టల్‌ సూపర్‌వైజర్‌ తారాపద్‌ జానా తెలిపారు. దీంతో కాక్‌ద్వీప్ పోలీసులు ఆదివారం మధ్యాహ్నం విద్యార్ధి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనపై పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

* వినాయక చవితి పర్వదినాన గ్రామంలో పెట్టే వినాయక విగ్రహాన్ని కొనుగోలు చేసేందుకు అడ్వాన్స్‌ ఇచ్చి బైక్‌పై తిరిగి వెళ్తుండగా ఆగి ఉన్న లారీని ఢీకొన్న ఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మద్దిరాలపాడు సమీపంలోని 216 జాతీయ రహదారిపై ఆదివారం వేకువజామున ఈ ఘటన జరిగింది. పోలీసులు, మృతుల బంధువులు తెలిపిన వివరాల మేరకు.. బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం పమిడిపాడు గ్రామానికి చెందిన మర్రిబోయిన గోపి (27) హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. అమ్మవారి కొలుపులు, వినాయక చవితి పండుగ నేపథ్యంలో గ్రామానికి వచ్చాడు. అదే గ్రామానికి చెందిన ఒకే సామాజికవర్గానికి చెందిన బత్తిన అరవింద్‌ (19), మర్రిబోయిన మణికంఠ (21) లతో కలిసి శనివారం రాత్రంతా గ్రామంలో జరిగిన అమ్మవారి కొలుపుల్లో సంతోషంగా గడిపారు. ఆదివారం వేకువ జామున 4 గంటల సమయంలో ఒంగోలు వెళ్లి వినాయక విగ్రహానికి అడ్వాన్సు ఇచ్చారు. తిరిగి ఇంటికి వెళ్లే క్రమంలో మద్దిరాలపాడు గ్రామం వద్ద 216 జాతీయ రహదారిపై పంక్చరు పడిన లారీ ఆగి ఉంది. దీనిని గమనించని యువకులు తమ మోటారు సైకిల్‌తో వెళ్లి బలంగా ఢీకొట్టడంతో ముగ్గురూ అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న తాలూకా సీఐ భక్తవత్సల రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఒంగోలు జీజీహెచ్‌కు తరలించారు.