ScienceAndTech

గ్రూప్‌-2 సర్వీసుల పరీక్షకు మార్పులు

గ్రూప్‌-2 సర్వీసుల పరీక్షకు మార్పులు

ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్‌-2 సర్వీసుల పరీక్షకు సంబంధించి మార్పులతో సర్వీస్‌ కమిషన్‌ ఇప్పటికే సిలబస్‌ విడుదల చేసింది.
ఏపీ ఆర్థిక శాఖ గ్రూప్‌-1 సర్వీసుల్లో 89 పోస్టులూ, గ్రూప్‌-2 సర్వీసుల్లో 508 పోస్టుల నియామక ప్రక్రియకు అనుమతి ఇచ్చింది. ఆ సందర్భంలో ఏపీ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నుంచి సిలబస్‌ మార్పుల ప్రతిపాదన కూడా బయటకు వచ్చింది. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌, మెయిన్స్‌లో కొన్ని నిర్మాణాత్మక మార్పులను ప్రతిపాదించినట్లుగా తెలుస్తోంది. ప్రిలిమ్స్‌లో రెండు పేపర్లకు బదులుగా ఒక పేపర్‌ మాత్రమే ఉండవచ్చుననీ, మెయిన్స్‌లో భాషాపరమైన పేపర్లు కాకుండా మరో అయిదు పేపర్లు కంటెంట్‌ మార్పులతో ఉండవచ్చనీ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కానీ సర్వీస్‌ కమిషన్‌ నుంచి ఎటువంటి అధికారిక సూచనలూ వెలువడలేదు.
గ్రూప్‌ 1, 2 సిలబస్‌లో ప్రతిపాదిత మార్పుల వల్ల చాలామంది అభ్యర్థులు రెండు పరీక్షలూ ఇంటిగ్రేటెడ్‌గా చదవాలని భావిస్తున్నారు. రెండు పరీక్షల మధ్య బాగా సమయం దొరికితే ఇలా ఇంటిగ్రేటెడ్‌గా చదవచ్చు. కానీ గత గ్రూప్‌-1 అనుభవాల దృష్ట్యా రాబోయే రాజకీయ పరిస్థితుల దృష్ట్యా వేగంగా నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. అందుకని ఏ పరీక్షకు ఆ పరీక్ష తయారవటమే సరైన ఆలోచన అవుతుంది.
పోస్టుల సమాచారం జోన్లవారీగా రోస్టర్‌ వారీగా విడుదలైన తరువాత కానీ ఎన్ని ఉద్యోగాల అవకాశాలు ఒక అభ్యర్థికి ఉంటాయనేది స్పష్టం కాదు. ఇలాంటి సందర్భంలో పోస్టుల సంఖ్య తక్కువగావుంటే మరింత ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది. అందుకని ఇప్పటి నుంచే ఏదో ఒక పరీక్షను ఎంపిక చేసుకుని మరింత ఏకాగ్రతతో, శ్రద్ధతో చదవడం మేలైన నిర్ణయం అవుతుంది.
ఇటీవలి కాలంలో యూపీఎస్‌సీ మార్గదర్శకత్వంలో ఆబ్జెక్టివ్‌ ప్రశ్నల ధోరణిలో బాగా మార్పు వచ్చింది. అందులో భాగంగానే జతపరిచే ప్రశ్నలు, ఎసర్షన్‌- రీజనింగ్‌ ప్రశ్నలు, చదవడానికి ఎక్కువ సమయం బట్టే ప్రశ్నలు మొదలైనవాటిని పరీక్షా పత్రం తయారీదారులు అనుసరిస్తున్నారు. ఈ నేపథ్యంలో అటువంటి ప్రశ్నల్ని అంతర్భాగం చేసుకుంటూ గ్రూప్‌- 1 ప్రిలిమ్స్‌, గ్రూప్‌- 2 పరీక్షలకు అధ్యయనం సాగిస్తే విజయం సాధించే అవకాశాలు మెరుగవుతాయి.
గత పరీక్షల్లో పరీక్ష తేదీకి ఆర్నెల్ల వెనుక వరకు కరెంట్‌ అఫైర్స్‌ ప్రశ్నలు అడిగేవారు. ఇటీవల కాలంలో 12 నెలల వరకు కూడా అడుగుతున్నారు. జనరల్‌ నాలెడ్జ్‌ సంబంధిత కరెంట్‌ అఫైర్స్‌కు పరిమితం కాకుండా రాజకీయ, ఆర్థిక, శాస్త్ర సాంకేతిక, భౌగోళిక మొదలైన కోణాల్లో అంతర్జాతీయ జాతీయ ప్రాంతీయ నేపథ్యాలతో అధ్యయనం అవసరం. ఇది ఇప్పటినుంచీ ప్రారంభిస్తే పరీక్ష నాటికి గట్టి పట్టు దొరుకుతుంది.

బేసిక్స్‌, జనరల్‌ నాలెడ్జ్‌, కరెంట్‌ అఫైర్స్‌పై పట్టు సాధించాక సిలబస్‌లోని ప్రతి సబ్జెక్టుకు తెలుగు అకాడమీ లేదా విశ్వవిద్యాలయ పుస్తకాలు ప్రామాణికాలు అని గుర్తించాలి. అయితే వాటిలో తాజా అంశాలను చేర్చారా లేదా అని పూర్తిస్థాయిలో పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి.
కొన్ని సబ్జెక్టులకు దేశవ్యాప్తంగా ప్రామాణికమైన పుస్తకాలు ప్రైవేటు పబ్లిషర్ల ద్వారా అభిస్తున్నాయి. వాటిని కూడా అనుసరించవచ్చు. ఈ సమయంలోనే ప్రతి సబ్జెక్టు అంశానికీ ఒకటి లేదా రెండు పుస్తకాలు చదివి సొంత నోట్సు తయారు చేసుకున్నట్లయితే జ్ఞాపకశక్తి పెరగడమే కాదు- తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాలు రాబట్టవచ్చు. కాబట్టి సొంత నోట్సు తయారీపై కూడా ప్రత్యేక శ్రద్ధను పెట్టాలి.