సినీనటి తమన్నా నూతన పార్లమెంట్ భవనాన్ని గురువారం సందర్శించారు. తనకు అందిన ఆహ్వానం మేరకు పార్లమెంట్ కొత్త భవనానికి విచ్చేసిన ఈ ‘జైలర్’ నటి.. ఎర్ర రంగు చీరలో మెరిశారు. ఆమె పార్లమెంట్ భవనం వద్దకు చేరుకోగానే అక్కడ ఉన్న మీడియా ప్రతినిధులు ఆమెను పలకరించారు. ఈ సందర్భంగా తమన్నా మాట్లాడుతూ.. మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందడం శుభపరిణామమన్నారు. ఈ చారిత్రక బిల్లును తీసుకొచ్చిన మోదీ సర్కార్‌పై ప్రశంసలు కురిపించారు. తాజా రిజర్వేషన్ల బిల్లుతో మహిళలకు మరింత సాధికారత లభిస్తుందని.. ఈ బిల్లు సామాన్యులు సైతం రాజకీయాల్లో చేరేలా స్ఫూర్తినిస్తుందని వ్యాఖ్యానించారు. తమన్నాతో పాటు మరో నటి దివ్యా దత్తా కూడా ఉన్నారు.
మరోవైపు, నూతన పార్లమెంట్ భవనంలో సభా కార్యకలాపాలు మొదలైన తర్వాత మంగళవారం బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ప్రత్యేక సెషన్‌కు హాజరైన విషయం తెలిసిందే. అలాగే, సినీతారలు షెహ్‌నాజ్ గిల్, భూమి పెడ్నేకర్ నిన్న పార్లమెంట్ భవనం వద్దకు విచ్చేసి కేంద్రం తీసుకొచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లుపై ప్రశంసలు కురిపించారు. ఈ బిల్లు ఓ కీలక ముందడుగు అని.. మహిళలకు హక్కులు, సమానత్వం కల్పిస్తే తల్లిదండ్రులు కూడా ఆడపిల్లలకు అండగా ఉంటారన్నారు. తద్వారా దేశంలో చాలా మార్పులు వస్తాయని షెహ్‌నాజ్ గిల్ అన్నారు.
చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన మహిళా రిజర్వేషన్ల బిల్లు గురువారం రాజ్యసభ ముందుకొచ్చింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ బిల్లును ఎగువ సభలో ప్రవేశపెట్టారు. అనంతరం సభ్యులు దీనిపై చర్చ చేపట్టారు. ఇప్పటికే ఈ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందిన విషయం తెలిసిందే. రాజ్యసభలోనూ చర్చ పూర్తయిన అనంతరం ఓటింగ్ ప్రక్రియ చేపట్టి బిల్లును ఆమోదించనున్నాయి. అయితే, ఉభయ సభల్లో ఈ బిల్లు ఆమోదం పొందినప్పటికీ.. దీని అమలు మాత్రం 2029 తర్వాతేనని ఇప్పటికే కేంద్రం స్పష్టం చేసింది. 2024 ఎన్నికలు కాగానే జన గణన, డీలిమిటేషన్ పక్రియలు చేపట్టి.. సాధ్యమైనంత త్వరగా చేపడతామని కేంద్రం చెబుతోంది. అయితే, ఈ బిల్లును అమలులో ఆలస్యం చేయడం ద్వారా మహిళల్ని మోదీ సర్కార్ తప్పుదోవ పట్టిస్తోందంటూ పలు విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.