కథానాయకుడు మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రానున్న చిత్రం ‘కన్నప్ప’. ఈ సినిమాకు సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. స్టార్ ప్లస్‌లో ‘మహాభారత’ సిరీస్‌ని తెరకెక్కించిన ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో ఇది రానుంది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ శివుడిగా కనిపించనున్నాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ మంచు విష్ణు కూడా పరోక్షంగా స్పందించారు. అయితే, తాజాగా ఈ భారీ ప్రాజెక్ట్‌లో స్టార్ హీరోయిన్ నయనతార కూడా భాగం కానుంది.
వరుస సినిమాలతో అలరిస్తోన్న నయనతార ‘కన్నప్ప’లో ఓ కీలకపాత్రలో కనిపించనుంది. నటి మధుబాల ఈ విషయంపై మాట్లాడిన వీడియో ఒకటి తాజాగా బయటకు వచ్చింది. ‘నేను త్వరలోనే ‘కన్నప్ప’ సినిమా చేయనున్నాను. ఇందులో ప్రభాస్, నయనతార కూడా ఉన్నారు’ అని ఆ వీడియోలో మధుబాల అన్నారు. దీంతో 16 ఏళ్ల తర్వాత ఈ జోడి మరోసారి తెరపై కనిపించనుందని అభిమానులు సంతోషిస్తున్నారు. 2007లో వి.వి.వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ‘యోగి’ సినిమాలో ప్రభాస్, నయనతార అలరించారు. మళ్లీ ఇప్పుడు ‘కన్నప్ప’ కోసం శివపార్వతులుగా కనిపించనున్నారని టాక్. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా మొదట నుపుర్ సనన్ ఎంపిక చేశారు. అయితే డేట్స్ సర్దుబాటు చేయడంలో సమస్యలు తలెత్తడంతే ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి వైదొలగింది.
‘కన్నప్ప’ షూటింగ్ మొత్తం న్యూజిలాండ్‌లో జరపనున్నారు. ఒకే ఒక్క షెడ్యూల్‌లో దీన్ని పూర్తి చేయనున్నట్లు మంచు విష్ణు ఇప్పటికే ప్రకటించారు. తాజాగా 800 మంది సిబ్బందితో 5నెలల పాటు ఆర్ట్ వర్క్ పూర్తి చేయించినట్లు చెప్పారు. సినిమా చిత్రీకరణకు కావాల్సిన సెట్ వర్క్ అంతా సిద్ధం చేశారు. ఈ మొత్తం సామాగ్రిని 8 కంటెయినర్లలో న్యూజిలాండ్‌కు తరలించారు. ఈ మేరకు ఈ ఆర్ట్ వర్క్‌కు సంబంధించిన మేకింగ్ వీడియోను కూడా చిత్రబృందం సోషల్ మీడియాలో పంచుకున్న సంగతి తెలిసిందే. అత్యంత భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా రానుంది. ప్రముఖ నటుడు మోహన్ బాబు దీన్ని నిర్మించనున్నారు.