DailyDose

భారత్‌లోని ఖలిస్థానీల ఆస్తులపై NIA ఉక్కుపాదం-నేరవార్తలు

భారత్‌లోని ఖలిస్థానీల ఆస్తులపై NIA ఉక్కుపాదం-నేరవార్తలు

* కెనడాలోని భారత వ్యతిరేక శక్తులను ఆర్థికంగా దెబ్బతీసేందుకు ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో ఇటీవల భారతీయులను బెదిరించిన సిఖ్స్‌ ఫర్‌ జస్టిస్‌ (SFJ) నేత గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూకు పంజాబ్‌లో ఉన్న ఆస్తులను జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) జప్తు చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో ముందడుగు వేసిన ఎన్‌ఐఏ.. వివిధ దేశాల్లో నివసిస్తోన్న మరో 19 మంది ఖలిస్థానీ ఉగ్రవాదుల (Khalistani Terrorists) ఆస్తుల జాబితాను సిద్ధం చేసినట్లు సమాచారం. త్వరలోనే వీరి ఆస్తులను జప్తు చేసే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. వివిధ దేశాల్లో ఉంటూ భారత్‌లో వేర్పాటువాదంపై ఖలిస్థాన్‌ సానుభూతిపరులు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్నారు. బ్రిటన్‌, అమెరికా, కెనడా, దుబాయ్‌, పాకిస్థాన్‌తోపాటు ఇతర దేశాల్లో ఉంటున్న వీరిని.. భారత్‌ ఇప్పటికే ఉగ్రవాదులుగా (Khalistani terrorists) ప్రకటించింది. విదేశీ గడ్డపై ఉంటూ భారత్‌ వ్యతిరేక చర్యలకు పాల్పడుతోన్న వీరి హవాలా కార్యకలాపాలు, స్థానికంగా ఆస్తులపై ఎన్‌ఐఏ దృష్టి సారించింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల (నిరోధక) చట్టం కింద వీరందరిపై చర్యలకు సిద్ధమైన ఎన్‌ఐఏ.. దాదాపు 20 మంది ఆస్తులను జప్తు చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం.

* టాలీవుడ్‌ను వణికిస్తున్న మాదాపూర్‌ డ్రగ్స్‌ కేసులో ఎట్టకేలకు సినీనటుడు నవదీప్‌ టీఎస్‌న్యాబ్‌(తెలంగాణ యాంటీ నార్కోటిక్స్‌ బ్యూరో) పోలీసుల విచారణకు హాజరయ్యారు. ఈ నెల 14న మాదకద్రవ్యాల రవాణా కేసులో ముగ్గురు నైజీరియన్లతో సహా 8 మంది అరెస్టయ్యారు. వారి వద్ద లభించిన కొనుగోలుదారుల జాబితాలో పోలీసులు నవదీప్‌ పేరును గుర్తించారు. ఈ విషయం తెలియగానే వెంటనే అతను న్యాయస్థానాన్ని ఆశ్రయించి తనను అరెస్టు చేయకుండా అనుమతి తీసుకున్నారు. అనంతరం టీఎస్‌న్యాబ్‌ పోలీసులు విచారణకు హాజరుకావాలంటూ గురువారం నోటీసులు జారీచేశారు. ఈ మేరకు శనివారం నాంపల్లిలోని పోలీసు కార్యాలయానికి వచ్చిన నవదీప్‌ను ఎస్పీ సునీతారెడ్డి ఆధ్వర్యంలోని బృందం విచారించింది. ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అతడి నుంచి కీలక సమాచారం సేకరించినట్టు సమాచారం. తొలుత తనకేం తెలియదంటూ బుకాయించేందుకు ప్రయత్నించినా పోలీసులు అతడి ఫోన్‌కాల్‌ డేటా, నిందితులతో జరిపిన సంప్రదింపులు, పబ్బుల్లో ఏర్పాటు చేసిన పార్టీల వివరాలు ముందుంచి అడగటంతో దారికొచ్చినట్టు తెలుస్తోంది. గతంలో తాను పబ్‌ నిర్వహించినప్పుడు డ్రగ్స్‌ ముఠాలతో పరిచయాలున్న మాట వాస్తవమేనని అంగీకరించినట్టు సమాచారం. అతడి రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వాటిల్లో డేటా, చాటింగ్‌లు మొత్తం తొలగించి ఉండటంతో తిరిగి సేకరించేందుకు ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపనున్నారు. అక్కడి నుంచి వచ్చే వివరాల ఆధారంగా మరోసారి నవదీప్‌ను విచారణకు పిలిచే అవకాశం ఉందని పోలీసు అధికారులు తెలిపారు.

* హైదరాబాద్‌ జగద్గిరిగుట్ట పరిధిలోని కేటీఆర్‌ కాలనీలో విషాదం నెలకొంది. సెల్‌ఫోన్‌ పోయిందని ఓ యువకుడు మనస్తాపంతో.. ఇవాళ తెల్లవారుజామున ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిని నీతీష్‌రాజ్‌ (26)గా గుర్తించారు. ఘటనాస్థలిని పరిశీలించిన పోలీసులు వివరాలు సేకరించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

* మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌ సమీపంలో 5 క్వింటాళ్ల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శ్రీరాంపూర్‌ జాతీయ రహదారిపై ఇటుక లోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌ బోల్తా పడటంతో.. పోలీసులు ట్రాక్టర్‌ను తనిఖీ చేశారు. అందులో గంజాయి ఉన్నట్లు గుర్తించి శ్రీరాంపూర్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సుమారు 5 క్వింటాళ్ల గంజాయి ఉన్నట్లు నిర్ధరించారు. డ్రైవర్‌ పరారీలో ఉన్నట్లు సమాచారం. ఛత్తీస్‌గఢ్‌ నుంచి గంజాయి తరలిస్తున్నట్లు తెలుస్తోంది. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

* విశ్వసనీయ సమాచారం మేరకు హైదరాబాద్‌లోని నార్త్‌జోన్‌ కమిషనర్‌ టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది ఓ నకిలీ వైద్యుడిని అరెస్ట్ చేసింది. తుకారాంగేట్‌తో పాటు హైదరాబాద్‌లోని మారేడ్‌పల్లి పరిధిలోని తుకారాంగేట్‌లోని మీనా హాస్పిటల్ పక్కన గీతా క్లినిక్ పేరు తో పైల్స్/ఫిస్టులా/ఫిషర్ ట్రీట్‌మెంట్ నిర్వహిస్తున్న 30 ఏళ్ళ తుహిన్ కుమార్ మండల్ అనే నకిలీ వైద్యున్ని పట్టుకున్నారు. ఏకంగా గీతా క్లినిక్‌ పేరిట చిన్నా హాస్పిటల్ సెటప్ చేసి డాక్టర్ టి.కె.మండల్ పేరుతో విజిటింగ్ కార్డ్‌లు కూడా కొట్టించాడు నకిలీ డాక్టర్. పోలీస్ లు రైడ్ చేసి అతని క్లినిక్ నుంచి ఆయింట్‌మెంట్స్, ట్యాబ్లెట్‌లు, పైల్స్ ట్రీట్‌మెంట్ సాధనాలు స్వాధీనం చేసుకున్నారు. తుహిన్ కుమార్ చదివింది 10వ తరగతి అని తెలుసుకున్న చుట్టుపక్కల వారు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఏ అర్హతతోని వైద్యం చేస్తున్నావని అడగ్గా ఓ డాక్టర్ దగ్గర అసిస్టెంట్ గా చేసినానని అన్నీ తెలుసని సమర్థించుకున్నాడు. 2012లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా మదనపల్లికి వెళ్లి డాక్టర్ బిశ్వాస్ వద్ద సహాయకుడిగా చేరారు, అక్కడ పైల్స్ చికిత్స నేర్చుకున్నారు. 2016లో హైదరాబాద్‌కు వచ్చి ‘గీతా క్లినిక్‌’ పేరుతో పైల్స్‌ ట్రీట్‌మెంట్‌ క్లినిక్‌ని ప్రారంభించి పైల్స్‌, ఫిస్టులా, ఫిషర్‌ స్పెషలిస్ట్‌ డాక్టర్‌ టి.కె.మండల్‌గా పేషెంట్లకు ఫోజులిస్తూ తాను చికిత్స చేస్తే ఎలాంటి జబ్బు ఉంటుందని భరోసా ఇచ్చారు. రోగం మళ్ళీ తిరగబడకుండా ట్రీట్మెంట్ చేయటం తన స్పెషాలిటీ అంటూ పబ్లిసిటీ చేసుకున్నాడు. వాస్తవానికి, రోగులకు చికిత్స చేయడానికి అతని వద్ద క్వాలిఫైడ్ సర్టిఫికేట్ లేదు. ఇలా రోగులను మోసం చేస్తున్నాడు. నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ కే సైదులు దాడి చేసి ఈ నకిలీ డాక్టర్ భరతం పట్టించారు. ఫిస్టులా పైల్స్ వంటి సమస్యలతో బాధపడేవారు తమ సమస్యలను ఇతరులతో చెప్పుకోవడానికి ఇబ్బంది పడుతూ వీటికి సరైన వైద్యం ఎక్కడ అందుతుందో సరైన అవగాహన లేకపోవడం ఇలాంటి నకిలీ వైద్యులకు అవకాశం గా మారుతుంది పోస్టర్లు పాంప్లేట్లతో ప్రచారం చేస్తూ గల్లీలో చిన్న చిన్న షట్టర్లలో తక్కువ ఖర్చుతోనే వైద్యం చేస్తుండటంతో వీరి వైపు కి ఆకర్షితులవుతున్నారు అమాయకులు.ఇటువంటి జబ్బులకి వైద్యం చేసే నకిలీ వైద్యులు చాలామంది ఉన్నారని వీరి పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

* తెలిసిన వాళ్లే కదా అని ఇంట్లోకి రానిస్తే ఆ ఇంటిని నిండా ముంచేశారు. భర్తకు ఫూటుగా మద్యం తాగించి, భార్యపై అత్యాచారం చేశారు. అవమానం భరించలేక ఆ భర్త, భార్యలు ఆత్మహత్య చేసుకునేందుకు కారణమయ్యారు. వారి ముగ్గురు పిల్లలను అనాథలను చేశారు. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని బస్తీ జిల్లాలో ఇటీవల ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బస్తీ జిల్లాలోని బాధితుల ఇంటికి శుక్రవారం రాత్రి వారికి తెలిసిన ఇద్దరు వ్యక్తులు వచ్చారు. వస్తూనే మద్యం తీసుకొచ్చిన నిందితులు బాధితురాలి భర్తకు బాగా తాగించారు. అతను మద్యం మత్తులోకి జారుకున్న తర్వాత ఇద్దరూ కలిసి అతడి భార్యపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. విషయం బయటికి చెబితే భర్తను చంపేస్తామని బెదిరించారు. దాంతో భర్త మద్యం మత్తు నుంచి తేరుకున్న తర్వాత బాధితురాలు అతడికి విషయం చెప్పింది. ఆ తర్వాత అవమానం భరించలేక వీడియో రికార్డు చేసి ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీడియోలో నిందితుల పేర్లను వెల్లడించారు. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. కాగా, ఆత్మహత్య చేసుకున్న దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారిలో 8 ఏళ్ల, 6 ఏళ్ల వయసున్న ఇద్దరు కొడుకులతోపాటు ఏడాది వయసున్న ఒక కుమార్తె ఉన్నది. తల్లిదండ్రి ఇద్దరూ మరణించడంతో ఇప్పుడు ఆ ముగ్గురూ అనాథలుగా మిగిలిపోయారు.