Business

భారీ నష్టాలు మూటగట్టుకున్న స్టాక్ మార్కెట్-వాణిజ్యం

భారీ నష్టాలు మూటగట్టుకున్న స్టాక్ మార్కెట్-వాణిజ్యం

* భారత్‌లోని ఏడు అగ్రశ్రేణి నగరాల్లో జులై- సెప్టెంబర్‌ త్రైమాసికంలో వార్షిక ప్రాతిపదికన ఇళ్ల విక్రయాల్లో (Housing Sales) 36 శాతం వృద్ధి నమోదైంది. దాదాపు 1,20,280 యూనిట్లు అమ్ముడైనట్లు స్థిరాస్తి కన్సల్టెన్సీ సంస్థ అనరాక్‌ వెల్లడించింది. వర్షాలు ఎక్కువగా ఉండే ఈ త్రైమాసికంలో సాధారణంగా ఇళ్ల విక్రయాలు స్తబ్దుగా ఉంటాయి. కానీ, ఈసారి అందుకు భిన్నంగా రికార్డు స్థాయిలో అమ్మకాలు నమోదు కావడం గమనార్హం. క్రితం ఏడాది ఇదే మూడు నెలల వ్యవధిలో 88 వేల యూనిట్లు అమ్ముడైనట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఏప్రిల్‌- జూన్ త్రైమాసికంతో పోల్చినా జులై- సెప్టెంబర్‌లో ఇళ్లకు గిరాకీ ఐదు శాతం పుంజుకోవడం విశేషం. ధరల విషయంలో గణనీయ వృద్ధి నమోదైనట్లు అనరాక్‌ వెల్లడించింది. ఏడు నగరాల్లో ఇళ్ల సగటు ధరల్లో 11 శాతం వార్షిక వృద్ధి నమోదైనట్లు తెలిపింది. అత్యధికంగా హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు 18 శాతం పెరిగినట్లు వెల్లడించింది. ముంబయి మెట్రోపాలిటన్‌ ప్రాంతంలో అత్యధికంగా 38,500 యూనిట్లు అమ్ముడైనట్లు పేర్కొంది. క్రితం ఏడాది నమోదైన 26,400 యూనిట్లతో పోలిస్తే ఇది 46 శాతం అధికం. తర్వాత పుణెలో 22,885, బెంగళూరులో 16,395 యూనిట్లు విక్రయమయ్యాయి. పుణెలో ఇళ్ల విక్రయాలు 63 శాతం, బెంగళూరులో 29 శాతం పుంజుకున్నాయి. కీలక వడ్డీరేట్ల పెంపుదల పరంపరను ఆర్‌బీఐ నిలిపివేయడం ఇళ్ల విక్రయాలు పుంజుకోవడానికి ఓ కారణమని అనరాక్‌ విశ్లేషించింది. హోమ్‌ లోన్ వడ్డీరేట్లలో స్థిరత్వం వల్ల చాలా మంది కొనుగోళ్లకు మొగ్గచూపి ఉండొచ్చని అంచనా వేసింది. గిరాకీతో పాటు కొత్త ఇళ్ల నిర్మాణాల పూర్తి సైతం అదే స్థాయిలో పుంజుకున్నట్లు అనరాక్‌ తెలిపింది. జులై- సెప్టెంబర్‌ మధ్య ఏడు నగరాల్లో 1,16,200 కొత్త యూనిట్లు అందుబాటులోకి వచ్చినట్లు పేర్కొంది. వార్షిక ప్రాతిపదికన 24 శాతం వృద్ధి నమోదైంది.

* ‘గ్లోబల్‌ ఇన్నోవేషన్‌ ఇండెక్స్‌- 2023 ర్యాంకింగ్స్‌లో భారత్‌ 40వ స్థానంలో నిలిచింది. ‘ప్రపంచ మేధో సంపత్తి సంస్థ (WIPO)’ గురువారం ఈ జాబితాను విడుదల చేసింది. స్విట్జర్లాండ్‌, స్వీడన్‌, అమెరికా తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. భారత్‌ గత ఏడాది కూడా 40వ స్థానంలోనే ఉండడం గమనార్హం. 2013లో 66వ స్థానంలో ఉన్న భారత్‌.. పదేళ్లలో 26 స్థానాలు ఎగబాకడం విశేషం. రాజకీయ వాతావరణం, విద్య, మౌలిక సదుపాయాలు, పరిశోధన, మానవ మూలధనం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఏటా ఈ ర్యాంకులు కేటాయిస్తారు. భారత్‌ తాజా ర్యాంకింగ్‌పై నీతి ఆయోగ్‌ స్పందిస్తూ.. అంకుర సంస్థలకు అనువైన వాతావరణం, అపారమైన విజ్ఞాన సంపద అందుబాటులో ఉండటం, ప్రభుత్వ ప్రైవేట్‌ సంస్థల పరిశోధనలు మెరుగైన ర్యాకింగ్‌కు దోహదపడినట్లు పేర్కొంది. విద్యుత్‌ వాహనాలు, బయోటెక్నాలజీ, నానో టెక్నాలజీ, అంతరిక్షం, ప్రత్యామ్నాయ ఇంధన వనరులు మొదలైన వివిధ రంగాల్లో ఆవిష్కరణల కోసం చేస్తున్న ప్రయత్నాలను నీతి ఆయోగ్ శ్రద్ధగా సమన్వయపరుస్తోందని తెలిపింది. మధ్యాదాయ దేశాల్లో టాప్‌-40లో భారత్‌ సహా చైనా (12), మలేషియా(36), బల్గేరియా(38), తుర్కియే(39) మాత్రమే ఉన్నాయని డబ్ల్యూఐపీఓ తెలిపింది. దిగువ మధ్యాదాయ ఆర్థిక వ్యవస్థల్లో భారత్‌ అగ్రస్థానంలో ఉన్నట్లు తెలిపింది. తర్వాత వియత్నాం, ఉక్రెయిన్‌ నిలిచినట్లు వెల్లడించింది. అలాగే వరుసగా 13వ ఏడాది ‘ఇన్నోవేషన్‌ ఓవర్‌పర్ఫార్మర్లు’గా భారత్‌, రిపబ్లిక్‌ ఆఫ్‌ మాల్దోవా, వియత్నాం నిలిచినట్లు తెలిపింది. ప్రపంచంలోని యూనికార్న్‌ (ఒక బిలియన్ డాలర్‌ విలువ కలిగిన అంకుర సంస్థలు) సంస్థల్లో దాదాపు 80 శాతం ఐదు దేశాల్లోనే ఉన్నట్లు తెలిపింది. ఈ జాబితాలో అమెరికా (54%), చైనా (14%), భారత్‌ (6%), యూకే (4%), జర్మనీ (2%) ఉన్నాయని వెల్లడించింది. ప్రపంచంలోని మొత్తం యూనికార్న్‌ల విలువ 3.8 మిలియన్ డాలర్లు కాగా.. ఒక్క అమెరికాలోని వాటి విలువే రెండు ట్రిలియన్‌ డాలర్లని పేర్కొంది. తర్వాత చైనాలో 736 బిలియన్‌ డాలర్లు, భారత్‌లో 193 బిలియన్‌ డాలర్లు విలువ చేసే యూనికార్న్‌ కంపెనీలు ఉన్నట్లు తెలిపింది.

* దేశీయ స్టాక్‌ మార్కెట్‌ (Stock Market) సూచీలు గురువారం భారీ నష్టాలతో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన మార్కెట్లకు వెంటనే అమ్మకాల సెగ తగిలింది. దీంతో నష్టాల్లోకి జారుకున్న సూచీలు ఏ దశలోనూ పై చూపులకు నోచుకోలేదు. అధిక ముడి చమురు ధరలు, విదేశీ సంస్థాగత మదుపర్ల అమ్మకాలు, సెప్టెంబర్‌ డెరైవేటివ్‌ల కాంట్రాక్టుల గడువు ముగింపు వంటి పరిణామాలు మార్కెట్లపై ప్రభావం చూపాయి. ఉదయం సెన్సెక్స్‌ (Sensex) 66,406.01 దగ్గర నష్టాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 66,406.01 వద్ద గరిష్ఠాన్ని, 65,423.39 దగ్గర కనిష్ఠాన్ని తాకింది. చివరకు 610.37 పాయింట్ల నష్టంతో 65,508.69 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ (Nifty) 19,761.80 దగ్గర ప్రారంభమై ఇంట్రాడేలో 19,766.65- 19,492.10 మధ్య కదలాడింది. చివరకు 192.90 పాయింట్లు నష్టపోయి 19,523.55 దగ్గర ముగిసింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.19 వద్ద నిలిచింది.

* జీఎస్టీ దర్యాప్తు ఏజెన్సీ డీజీజీఐ రూ.1,728 కోట్లు విలువ చేసే డిమాండ్‌ నోటీసులను ఐసీఐసీఐ లాంబార్డ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌కు పంపింది. 2017 జులై నుంచి 2022 మార్చి మధ్య చేసిన కొన్ని సరఫరాలకు సంబంధించి పన్నులు చెల్లించలేదని నోటీసుల్లో పేర్కొంది. రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ఐసీఐసీఐ లాంబార్డ్‌ నోటీసులు అందినట్లు ధ్రువీకరించింది. డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ జీఎస్టీ ఇంటెలిజెన్స్‌ పుణె ప్రాంతీయ కార్యాలయం నుంచి ఇవి అందినట్లు తెలిపింది. అయితే, తాము అందుకున్న నోటీసుల్లో పేర్కొన్న సమస్య మొత్తం ఇన్సూరెన్స్‌ పరిశ్రమ ఎదుర్కొంటోందని వివరించింది. తగిన సమాధానం ఇస్తూ నోటీసులపై స్పందిస్తామని కంపెనీ తెలిపింది.

* రెండు వేల రూపాయల నోట్ల మార్పిడికి (2000 Note exchange) ఆర్‌బీఐ (RBI) ఇచ్చిన గడువు దగ్గర పడింది. సెప్టెంబర్‌ 30తో గడువు తీరబోతోంది. ఒకవేళ ఇప్పటికీ మీ దగ్గర రూ.2 వేల నోట్లు ఉంటే.. మార్చుకోవడానికి ఇంకా మూడు రోజులే గడువు ఉంది. అయితే, డెడ్‌లైన్‌ తర్వాత రూ.2 వేల నోట్ల పరిస్థితి ఏంటి? ఆర్‌బీఐ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందన్నది? ఆసక్తిగా మారింది. దీనిపై ఇప్పటి వరకు ఆర్‌బీఐ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. పెద్ద నోట్ల రద్దు అనంతరం 2016లో రూ.2 వేలు నోట్లను ఆర్‌బీఐ అందుబాటులోకి తెచ్చింది. ‘క్లీన్‌ నోట్‌ పాలసీ’లో భాగంగా ఈ ఏడాది మే నెలలో ఉప సంహరించుకుంది. నోట్లను రద్దు చేయలేదు. అంటే ఇప్పటికీ లీగల్‌ టెండర్‌గానే (నోట్లకు చట్టబద్ధత) రూ.2వేల నోటు కొనసాగుతోంది. అయితే, ఇప్పటికే పలు దుకాణాలు, పెట్రోల్‌ బంకులు రూ.2 వేల నోట్లను తీసుకోవడానికి నిరాకరిస్తున్నాయి. వాస్తవానికి నోట్ల మార్పిడికి ఆర్‌బీఐ దాదాపు 4 నెలల గడువు ఇచ్చింది. సెప్టెంబర్‌ 1 నాటికే దాదాపు 93 శాతం నోట్లు వెనక్కి వచ్చినట్లు ఆర్‌బీఐ గణాంకాలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో సెప్టెంబర్‌ 30 తర్వాత కూడా రూ.2 వేల నోట్ల మార్పిడికి బ్యాంకుల్లో మరో అవకాశం ఇవ్వకపోవచ్చని తెలుస్తోంది. అయితే, నిర్దిష్ట గడువులోగా ఉపసంహరణ లక్ష్యం నెరవేరకపోతే లీగల్‌ టెండర్‌గా కొనసాగిస్తామని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ ఇప్పటికే ఓ సందర్భంలో చెప్పారు.