పలు భాషల మధ్య, వాటి మీద ఆధారపడి వచ్చిన సాహిత్యాల మధ్య పోలిక అవసరమని అప్పుడే ఆయా భాషలు, సాహిత్యాలు మరింత కాలం మనగలుగుతాయని ఏపీ అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షుడు, రాజ్యసభ మాజీ సభ్యులు డా. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు. శని, ఆదివారాల్లో డెట్రాయిట్‌లో డెట్రాయిట్ తెలుగు సంఘం అనుబంధ సంస్థ డెట్రాయిట్ తెలుగు సాహితీ సమితి 25వ వార్షికోత్సవంలో ఆయన కీలకోపన్యాసం చేశారు.
భవిష్యత్తు తరాలకు మనం గుర్తుండాలంటే ప్రస్తుతంలో సాహిత్యానికి మనం చేసే సేవల వలనే సాధ్యపడుతుందన్న యార్లగడ్డ సాహితీ ప్రక్రియల మధ్య తులనాత్మక అధ్యయనం ద్వారా గతచరిత్ర పట్ల అవగాహన, నిర్వహించాల్సిన బాధ్యత పట్ల ఆలోచన కలుగుతాయని ఆశాభావాన్ని వ్యక్తపరిచారు. కవుల మధ్య, గ్రంథాల మధ్య, సాహిత్యాల మధ్య తులనాత్మక పరిశీలన ద్వారా సమైక్యవాదం బలపడుతుందని అన్నారు. స్వాతంత్ర్య పోరాటంలో ఒకరిని ఒకరు కలుసుకోకపోయినా ఎన్నో రకాల దేశభక్తి గేయాలు, సాహిత్యాలు వెలువడ్డాయని, వీటిని పోల్చి చూడటం ద్వారా ఆయా సాహిత్యాల విలువ ప్రస్ఫుటమవుతుందని లక్ష్మీప్రసాద్ వివరించారు. ఛాయావాదం, ప్రగతివాదం, ప్రయోగవాదం, మహిళావాదం, దళితవాదం పేరిట దేశవ్యాప్తంగా వచ్చిన రచనల్లో భావస్వారూప్యత గమనించవచ్చునని అన్నారు. అనువాదం లేనిదే భావుకత, సమైక్యత లేదన్న యార్లగడ్డ…అనువాదం ద్వారా తులనాత్మక అధ్యయనం సాధ్యపడుతుందని, తద్వారా సాహిత్యం ఎక్కువ కాలం నిలబడుతుందని పేర్కొన్నారు. విశ్వనాథ సత్యనారాయణకు సమానంగా దేశేంద్ర ప్రసాద్, రాయప్రోలు సుబ్బారావుకు సమానంగా రాంధరి సింఘ్ దినకర్, శ్రీశ్రీకి సమానంగా సూర్యకాంత్ త్రిపాఠి నిరాలలు తమ రచనలను కొనసాగించి సాహితీ పరిమళాల వ్యాప్తికి కృషి చేశారని గుర్తు చేసుకున్నారు.
శనివారం ఉదయం తానా అధ్యక్షుడూ నిరంజన్ శృంగవరపు, ప్రముఖ అవధాని మేడసాని మోహన్, డెట్రాయిట్ తెలుగు సంఘం అధ్యక్షుడు కిరణ్ చౌదరిలు ప్రారంభ సమావేశంలో పాల్గొని అతిథులకు స్వాగతం పలికారు. సిలికానాంధ్ర వ్యవస్థాపకుడు కూచిభొట్ల ఆనంద్, వంగూరి చిట్టెన్‌రాజు తదితరులు పాల్గొని ప్రసంగించారు. మాజీ ఉప-రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, బ్రహ్మానందంల సందేశాలను ఈ సందర్భంగా ప్రదర్శించారు.
DTLC25: భాషల మధ్య సాహిత్యాల మధ్య పోలిక అవసరం: యార్లగడ్డ
Related tags :