Business

ఆగని పసిడి ధరల పతనం-వాణిజ్యం

ఆగని పసిడి ధరల పతనం-వాణిజ్యం

* నూత‌న ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్‌గా మునీష్ క‌పూర్‌ను రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నియ‌మించింది. అక్టోబ‌ర్ 3 నుంచి ఈ నియామ‌కం అమ‌ల్లోకి వ‌స్తుంద‌ని ఆర్‌బీఐ పేర్కొంది. ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్‌గా ప‌దోన్న‌తికి ముందు క‌పూర్ ఆర్‌బీఐ మానేట‌రీ పాల‌సీ విభాగం అడ్వైజ‌ర్ ఇన్‌చార్జిగా వ్య‌వ‌హ‌రించారు. ఆర్‌బీఐలో మూడు ద‌శాబ్ధాల ప్ర‌స్ధానంలో క‌పూర్ స్ధూలఆర్ధిక విధానం, రీసెర్చి, ద్ర‌వ్య విధానం వంటి ప‌లు విభాగాల్లో ప‌నిచేశారు. 2012-15లో ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్‌కు మునీష్ క‌పూర్ అడ్వైజ‌ర్‌గా వ్య‌వ‌హ‌రించారు. ఆర్‌బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్‌గా క‌పూర్ ఆర్ధిక‌, విధాన ప‌రిశోధ‌న విభాగాన్ని ప‌ర్య‌వేక్షిస్తారు. క‌పూర్ ఎక‌న‌మిక్స్‌లో మాస్ట‌ర్స్ డిగ్రీని క‌లిగిఉండ‌టంతో పాటు ఇండియ‌న్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంక‌ర్స్ స‌ర్టిఫైడ్ అసోసియేట్‌గా కొన‌సాగుతున్నారు.

* దేశీయ బెంచ్‌మార్క్‌ సూచీలు వరుసగా రెండోరోజైన బుధవారం నష్టాల్లోనే ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న ప్రతికూల వాతావరణం దేశీయ మార్కెట్లపై పడింది. ఉదయం సెన్సెక్స్‌ 465 పాయింట్ల నష్టంతో 65,047 పాయింట్ల నష్టంతో మొదలైంది. నిఫ్టీ 83.24 పాయింట్లు తగ్గి 19,397 వద్ద మొదలైంది. ఇంట్రాడేలో స్వల్పంగా కోలుకున్న సూచీలు.. చివరకు 286.06 పాయింట్ల నష్టంతో 65,226.04 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 92.70 పాయింట్ల నష్టంతో 19,346.10 వద్ద ముగిసింది.

* దేశీయ మార్కెట్‌లో గత వారం, పది రోజులుగా పసిడి జిలుగులు, వెండి వెలుగులు ఏమీ కనిపించడం లేదు. సాధారణంగా పండుగలు, పెండ్లిళ్ల సీజన్‌ వచ్చిందంటే చాలు.. గోల్డ్‌, సిల్వర్‌ మార్కెట్లలో సందడి వాతావరణం నెలకొంటుంది. కానీ ఈసారి ఆ పరిస్థితి ఇంకా కానరావడం లేదుమరి. తగ్గుతున్న ధరలకు, పడిపోతున్న డిమాండ్‌కు ఇది అద్దం పడుతున్నది. మున్ముందూ మార్కెట్‌లో ఇదే మందగమనం ఆవరించి ఉంటుందన్న అభిప్రాయాలు ఇప్పుడు వినిపిస్తుండగా, ఇప్పట్లో ధరలు పెరిగే వీలు దాదాపుగా ఉండకపోవచ్చన్న అంచనాలూ కొనుగోలుదారులను వేచిచూసే ధోరణిలోకి నెడుతున్నాయి. ఆగితే ధరలు తగ్గి మరింత లాభాన్ని పొందవచ్చన్న తీరు కస్టమర్లలో ఉంటున్నది. మంగళవారం బంగారం, వెండి ధరలు భారీగా పడిపోయాయి. దీంతో తులం పసిడి రేటు రూ.58 వేల మార్కు దిగువకు, కిలో వెండి విలువ రూ.74,000 కిందికి చేరాయి. ఈ ఒక్కరోజే హైదరాబాద్‌ మార్కెట్‌లో 24 క్యారెట్‌ పుత్తడి 10 గ్రాముల ధర రూ.660 తగ్గి రూ.57,380కి దిగొచ్చింది. 22 క్యారెట్‌ రేటు సైతం రూ.600 క్షీణించి రూ.52,600లకు పరిమితమైంది. ఇలా గడిచిన పది రోజుల్లో తులం ధర రూ.2,500 వరకు దిగిరావడం గమనార్హం. మరోవైపు కస్టమర్ల ఆదరణ లేక మార్కెట్లో కిలో వెండి ధర కూడా గత పది దినాల్లో రూ.3,000 వరకు తగ్గడం గమనార్హం. మంగళవారం ఒక్కరోజే రూ.2,000 దిగింది. అటు ఢిల్లీ మార్కెట్‌లోనూ 10 గ్రాముల పుత్తడి రూ.650, కిలో వెండి ధర రూ.1,800 చొప్పున క్షీణించాయి.

* ఫేస్‌బుక్‌ (Facebook) మాతృసంస్థ మెటా (Meta) మరింత మంది ఉద్యోగులను తొలగించే (Layoffs) యోచనలో ఉన్నట్లు సమాచారం. అయితే ఈ సారి మెటావర్స్‌ విభాగంలో పనిచేస్తున్న వారికి ఉద్వాసన పలకనున్నట్లు తెలుస్తోంది. మంగళవారం జరిగిన కంపెనీ అంతర్గత సమావేశాల్లో ఉద్యోగాల కోత గురించి చర్చించినట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు. బుధవారం నాటికి సదరు ఉద్యోగులకు ఆ సమాచారాన్ని అందజేస్తారని సమాచారం. మెటాకు చెందిన ఫాస్ట్‌ (FAST) యూనిట్‌లో పనిచేస్తున్న 600 మంది ఉద్యోగులపై ఈ లేఆఫ్‌ ప్రభావం ఉండనున్నట్లు తెలుస్తోంది. మెటా గత కొంతకాలంగా చిప్‌ల తయారీ విభాగంలో సవాళ్లు ఎదుర్కొంటోంది. దీని కోసం చిప్‌మేకర్‌ అయిన క్వాల్కమ్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ క్రమంలో తమ ఫాస్ట్‌ యూనిట్‌ని పునర్నిర్మించడంలో భాగంగానే ఉద్యోగుల సంఖ్యలో కోత విధించనున్నట్లు సమాచారం. అయితే తాజా లేఆఫ్‌ల విషయాన్ని మెటా ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు.