DailyDose

తిరుమల బస్సు దొంగ దొరికాడు -నేరవార్తలు

తిరుమల బస్సు దొంగ దొరికాడు -నేరవార్తలు

* డ్రగ్స్ కేసు వ్యవహారంలో జాతీయ దర్యాప్తు సంస్థ తనకు నోటీసులు ఇచ్చారనే ప్రచారాన్ని ప్రముఖ సినీనటి వరలక్ష్మి శరత్ కుమార్ (VaraLakshmi) ఖండించారు. ఆ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఆదిలింగం అనే వ్యక్తి గతంలో తన వద్ద ఫ్రీలాన్స్ మేనేజర్‌గా పనిచేశారని, ఆయన తీసుకొచ్చిన ‘సర్కార్’ సినిమాలో నటించడం వల్లే తనపై డ్రగ్స్ ఆరోపణలు వచ్చాయని వెల్లడించారు. హైదరాబాద్‌లో జరిగిన ‘మాన్షన్ 24’ వెబ్ సిరీస్ ట్రైలర్ విడుదల వేడుకకు హాజరైన వరలక్ష్మి శరత్ కుమార్.. డ్రగ్స్ ఆరోపణలపై వివరణ ఇచ్చారు.

* ఇటలీ (Italy)లో జరిగిన రోడ్డు ప్రమాదంలో బాలీవుడ్‌ నటి (Bollywood Actress) గాయత్రీ జోషి (Gayatri Joshi), ఆమె భర్త వికాస్‌ ఒబెరాయ్‌ తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారి పరిస్థితి నిలకడగా ఉందని వికాస్‌ కార్యాలయ సిబ్బంది తెలిపారు. ఇదే ఘటనలో మరో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు మృతి చెందారు. విహారయాత్ర నిమిత్తం గాయత్రీ ఆమె భర్తతో కలిసి ఇటలీలోని సార్డీనియాకు వెళ్లారు. అక్కడ జరుగుతున్న లగ్జరీ కార్ల పరేడ్‌లో వీరు కూడా పాల్గొన్నారు.

* స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో తెదేపా అధినేత చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌, సీఐడీ కస్టడీ పిటిషన్లపై ఏసీబీ కోర్టులో విచారణ వాయిదా పడింది. ఇరువైపుల వాదనలు విన్న ఏసీబీ కోర్టు విచారణను గురువారానికి (అక్టోబర్‌ 5కు) వాయిదా వేసింది. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది ప్రమోద్‌కుమార్ దూబే వాదనలు వినిపించారు. చంద్రబాబుకు బెయిల్‌ ఇవ్వొద్దని, కస్టడీకి అనుమతించాలంటూ ప్రభుత్వం తరఫున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదించారు.

* నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట పట్టణంలోని ఎస్బీఐలో ఓ ఉద్యోగి చేతివాటం ప్రదర్శించారు. ఖాతాదారుడి సొమ్మును.. సొంత ఖాతాకు బదిలీ చేసుకున్నాడు. మరో బాధితురాలికి నకిలీ ఎఫ్‌డీ పత్రం ఇచ్చి మోసగించాడు. బాధితులు అందోళనకు దిగడంతో మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుల కథనం ప్రకారం..ఉప్పునుంతల మండలం తాడూరు గ్రామానికి చెందిన వినోద్‌కుమార్‌కు అచ్చంపేట పట్టణంలోని స్టేట్‌ బ్యాంకు శాఖలో ఖాతా ఉంది. అందులో రూ.14.73 లక్షలు ఉన్నాయి. సెప్టెంబరు 29న ఖాతాదారు బ్యాంకుకు వెళ్లి రూ.లక్ష తీసుకునే నిమిత్తం సంబంధిత పత్రాలు ఇచ్చాడు. దాన్ని పరిశీలించిన క్యాషియర్‌ ఖాతాలో అంత మొత్తం లేదని చెప్పడంతో ఆయన అవాక్కయ్యారు. ఈ విషయమై 30న రాతపూర్వకంగా మేనేజర్‌కు ఫిర్యాదు చేశాడు.

* తిరుమల క్షేత్రంలో తితిదే ఉచితంగా నడిపే ధర్మరథం ఎలక్ట్రిక్‌ బస్సు చోరీ కేసులో నిందితుడిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తిరుపతి నేరవిభాగం ఏఎస్పీ విమలకుమారి తెలిపారు. మంగళవారం తిరుమలలోని వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు వివరాలు వెల్లడించారు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌ మండలం అనాజ్‌పూర్‌కు చెందిన నీలావర్‌ విష్ణు సెప్టెంబర్‌ 24న తిరుమలలోని తితిదే ట్రాన్స్‌పోర్ట్‌ కార్యాలయం వద్ద ఉంచిన రూ.1.44 కోట్ల విలువైన బస్సును చోరీ చేసి తీసుకెళ్లాడు. పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలించారు. నిందితుడు భయపడి అదేరోజు నాయుడుపేట- చెన్నై రహదారిలో బస్సును వదిలేసి పారిపోయాడు. సోమవారం తిరుపతి ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలో పోలీసులు అతణ్ని అరెస్టు చేశారు. నిందితుడి తల్లిదండ్రులు మహారాష్ట్ర నుంచి హైదరాబాద్‌కు వలస వచ్చారు. 2015లో విష్ణు తండ్రి.. తన భార్యను హత్య చేసి జైలుకు వెళ్లాడు. అనాథలైన విష్ణు, అతని అక్కను స్థానిక పోలీసులు సైదాబాద్‌ ప్రభుత్వ బాలల సంరక్షణ కేంద్రంలో చేర్పించారు. 2020లో పదో తరగతి పూర్తిచేసిన అనంతరం చేతివృత్తులు నేర్పించే కేంద్రంలో శిక్షణ ఇస్తుండగా, విష్ణు అక్కడ సైకిల్‌ చోరీ చేసి పారిపోయాడు. అప్పటి నుంచి దొంగతనాలు వృత్తిగా ఎంచుకున్నాడు. ఇటీవల తిరుమలకు వచ్చి, తితిదే ఉచిత బస్సులో తిరుగుతూ సిబ్బందితో నమ్మకంగా ఉంటూ ఏకంగా బస్సు చోరీ చేశాడు. వాహనాన్ని తీసుకెళ్లి విడిభాగాలు అమ్ముకోవాలని యత్నించాడు. గతంలో కారు చోరీ: నీలావర్‌ విష్ణు గతంలో తితిదే ఎలక్ట్రిక్‌ కారు చోరీ చేసి పట్టుబడ్డాడు. ఆ సమయంలో అతన్ని హెచ్చరించి పంపించారు. పోలీసులకు ఫిర్యాదు అందలేదు. దానిపైనా విచారిస్తున్నామని ఏఎస్పీ తెలిపారు.