NRI-NRT

దుబాయ్‌లో త్వరలో తెలుగు సంఘాల ఎన్నికలు

దుబాయ్‌లో త్వరలో తెలుగు సంఘాల ఎన్నికలు

త్వరలో జరుగనున్న దుబాయిలోని తెలుగు సంఘం (తెలుగు అసోసియెషన్ – టి.ఏ) ఎన్నికలు దుబాయిలో దుమ్ము రేపుతున్నాయి. అధ్యక్ష పదవి కోసం ఇద్దరు అభ్యర్ధులు పోటీపడుతూ దాన్ని కైవసం చేసుకోవడానికి వ్యూహాత్మకంగా పావులు కదుపుతూ ముందుకు వెళ్తున్నారు. తమ తమ వ్యాపారవృధ్ధి లక్ష్యంగా టి.ఏను మలిచారనే సార్వత్ర అరోపణలు ఎదుర్కోంటున్న ఈ సంఘం ప్రప్రథమంగా సామాజిక సేవ ప్రధాన ధ్యేయంగా ఈ సారి ఎన్నికలను ఎదుర్కోంటుంది. పోటీ చేస్తున్న అభ్యర్ధులు తాము ఏ రకంగా తెలుగు వారికి సేవ చేయగలమో చెప్పడానికి బదులుగా తమ తమ వృత్తి, వ్యాపారాలలో తమకున్న అనుభవాలు, పరిచయాలను ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. కానీ సంఘాన్ని ఏ విధంగా విస్తరిస్తూ అభివృద్ధి చేసే ప్రణాళికలు లేదా తెలుగు ప్రవాసీయులకు సేవల గూర్చి మాత్రం విశదీకరించడం లేదు. ఒకరు సంఘానికి నూతన భవనం కొరకు ప్రయత్నిస్తానని హామీ ఇస్తుండగా మరోకరు ఇప్పటి వరకు అన్ని కార్యక్రమాలకు చేయూతనిచ్చిన తాను చిరకాలం జ్ఞాపకం ఉంచుకునే విధంగా సామాజిక సేవ చేస్తానని వాగ్దానాం చేస్తున్నారు.

గడువు ముగిసిన కార్యవర్గంలోని ఇద్దరు ప్రముఖులు ఈసారి పోటీకు దూరంగా ఉన్నా పరోక్షంగా చక్రం తిప్పుతూ సంఘంపై తమ పట్టు కొరకు ప్రయత్నిస్తున్నారు. సంఘాన్ని నెలకోల్పడంలో కీలక పాత్ర వహించిన ‘పెద్దాయన’ నిశబ్దంగా నిష్క్రమించిన కొద్ది కాలానికి మళ్ళి తిరిగి రావడం కూడా ఆసక్తి కల్గిస్తుంది. పోటి చేస్తున్న వారందరు దాదపుగా కొత్తవారే కావడం గమనార్హం.

అధ్యక్ష పదవి కొరకు హైద్రాబాద్ నగరానికి చెందిన మోహమ్మద్ మసీయోద్దీన్, బాలుస వేకానంద పోటీపడుతున్నారు. ఇప్పటి వరకు ఈ ఇరువురు ఒకరు కీలక పదవులలో ఒకరు ఉపాధ్యక్షునిగా, మరోకరు ప్రధాన కార్యదర్శిగా వ్యవహారిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కొందరు వ్యాపారవేత్తలు ప్రారంభించిన ఈ సంఘంలో మొదటి కార్యవర్గ అధ్యక్షునిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన దినేష్ ఉండగా, ఈ సారి రోటేషన్ పద్దతిలో అధ్యక్ష పదవిని తెలంగాణకు ఇవ్వడం జరిగింది. దాంతో తెలంగాణ నుండి మసీయోద్దీన్, వివేకానంద పోటీలో ఉన్నారు. ఉపాధ్యక్షునిగా తిరుపతికు చెందిన కటారు సుదర్శన్, ప్రధాన కార్యదర్శిగా గుంటూరు నగరానికి చెందిన కలకోట విజయ భాస్కర రెడ్డి, తెలంగాణ రాష్ట్రం నుండి కార్యవర్గ సభ్యులుగా బంగారి భీం శంకర్ (నిజామాబాద్), చనికినాల చైతన్యలు (రాజన్న సిరిసిల్లా) ఎకగ్రీవంగా ఎన్నికయ్యారు. వారి అధికారిక ప్రకటన లాంఛనంగా మిగిలింది. ఇక ఆంధ్రప్రదేశ్ కోటా నుండి రెండు స్ధానాలకు ముగ్గురు అభ్యర్ధులు- లతా నగేశ్ (విశాఖపట్టణం), ఫ్లోరెన్స్ విమల (విశాఖపట్టణం), శేఖ్ అబ్దుల్ ఫహీం (అనంతపురం) పోటీపడుతున్నారు. విమల, ఫహీం వివిధ రకాల సామాజిక సేవల ద్వారా పరిచయాలు కల్గి ఉన్నారు. అధ్యక్ష పదవితో పాటు కోశాధికారి పదవి కూడా తెలంగాణకు రిజర్వు చేయగా దాని కొరకు రాచకొండ శ్రీనివాస్ గౌడ్ (నిజామాబాద్), అచంట ఆనంత్ (హైద్రాబాద్) రంగంలో ఉన్నారు.

పేరు గొప్ప ఊరు దిబ్బ..

సామాజిక సేవ పేర ప్రారంభమయిన కొద్ది మంది వ్యాపారస్ధులు కలిసి నెలకోల్పిన ఈ సంఘం పూర్తిగా కార్పోరేటీకరణ విధానంలో సామాన్యులకు అందనంత బహుదూరంగా ఉండి వారి చేతిలో బందీగా మారిందనే విమర్శలు ఉన్నాయి. కనీసం ఫోన్లు చేస్తే కూడా ఎత్తరనే అరోపణలను కూడా వీరిలో అత్యధికులు ఎదుర్కోన్నారు. పేరుకు పెద్ద ఉద్యోగాలు, బీజీ వ్యాపారాలు అయినా దానికి అనుగుణంగా వారి దాతృత్వం కార్యచరణలో కొరవడిందనే అభిప్రాయం కూడా ఉంది. దుబాయిలోని తెలుగు ప్రవాసీయులకు సంఘం గురించి తెలియకుండా క్రమేణా ఉనికి కోల్పోతుండగా ఇప్పుడు ఎన్నికల వేళ సామాజిక సేవ అంటూ నూతన పల్లవి అందుకోంది. ఇప్పటి వరకు సామాజిక సేవ లేదా పేద కార్మికుల కష్టాల గురించి తప్పిపోయి కూడా ఊసెత్తని నాయకగణం అంతా కూడా ఈసారి విచిత్రంగా పేద కార్మికులు, లేబర్ క్యాంపులు అంటుంది.

దీనికి స్ధానిక నిబంధనలు, సామాజిక సేవ రంగానికి నూతనం కావడంతో ఆశించిన మేరకు సామాజిక సేవలు చేయలేకపోయామని కొందరు ప్రముఖులు వివరణ ఇస్తున్నారు. బాలారిష్టాల కారణంగా కొంత మేరకు సేవలో వెనుకబడిన విషయాన్ని కూడా నిజాయితీగా అంగీకరిస్తున్నారు. కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారి అధిపత్యం కలిగిన సంస్ధగా ఉన్న అప్రతిష్ఠను తొలగించుకోవడానికి టీఏ రోటేషన్ పద్దతిలో కీలకమైన అధ్యక్ష, కోశాధికారి పదవులను తెలంగాణ వారికి కేటాయించి విజ్ఞత ప్రదర్శించిన విషయాన్ని కూడా అనేకులు అభినందిస్తున్నారు. ఒక్క దుబాయి అనేది కాకుండా దాదాపు అన్ని గల్ఫ్ దేశాలలో సహాజంగా తెలంగాణ ప్రవాసీయులు సామాజిక, సాంస్కృతిక సంస్ధలలో క్రీయాశీలకంగా పాల్గొనడం స్వల్పం, గత కొద్ది కాలంగా సంవత్సరానికి ఒకసారి మాత్రం ఎట్టకేలకు బతుకమ్మ సంబురాలను దాతల పుణ్యమా అంటూ చేసుకొంటున్నారు.

అదే విధంగా వివిధ కార్యక్రమాలకు స్పాన్సర్ల విషయంలో కూడ పారదర్శకతో పాటు అచీతూచీ వ్యవహరించవల్సిన విషయాన్ని కూడ గుర్తు చేస్తున్నారు. అర్జునుడికి శ్రీకృష్ణుడు భోదించినట్లుగా, అసక్తబుద్ధిః సర్వత్ర జితాత్మా విగతస్పృహః నైష్కర్మ్యసిద్ధిం పరమాం సన్న్యాసేనాధిగచ్ఛతి అన్న విషయాన్ని అభ్యర్ధులందరు ఆలోచిస్తే నూతనంగా ఎన్నికయ్యే కార్యవర్గం ఒక మహోన్నత లక్ష్య సిద్ధి దిశగా పురోగమించవచ్చని ఆశిస్తున్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z