* రేపే బీజేపీ అభ్యర్థుల మూడో జాబితా
తెలంగాణ బీజేపీ పెండింగ్ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టింది. ఇప్పటివరకు రెండు జాబితాలు విడుదల చేసిన బీజేపీ.. మూడో జాబితా ప్రకటనపై ఫోకస్ పెట్టింది. మూడో జాబితాలో అన్ని స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసేందుకు కసరత్తులు చేస్తోంది. అందులో భాగంగా బుధవారం ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇంట్లో టీ బీజేపీ కోర్ కమిటీ భేటీ కానుంది. ఈ సమావేశంలో అమిత్ షాతో పాటు కిషన్ రెడ్డి, డీకే అరుణ పాల్గొననున్నారు. ఈ రోజు సాయంత్రం బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో టీ బీజేపీ తుది జాబితాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు. రేపు తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థుల తుది జాబితా విడుదలయ్యే అవకాశముంది. తెలంగాణలో జనసేనతో బీజేపీ పొత్తు ఖరారు అయింది. దీంతో జనసేనకు ఎన్ని సీట్లు కేటాయించాలనే దానిపై చర్చలు జరుగుతున్నాయి. జనసేనకు 8 లేదా 9 సీట్లు ఇవ్వాలని బీజేపీ యోచిస్తోంది.
* కాంగ్రెస్ తీరుపై కామ్రేడ్ల అసంతృప్తి
కాంగ్రెస్ తీరుపై సీపీఐ కార్యవర్గ సమావేశంలో వాడీవేడి చర్చ జరిగింది. సీట్లు ఇవ్వకుండా కాంగ్రెస్ ఊరించి ఉసూరుమన్పించిందని వామపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పొత్తులో కాంగ్రెస్ మొండిపట్టు విడవడం లేదని..ఇది పొత్తు ధర్మం కాదని తెలిపాయి. చెరో రెండు సీట్లు ఇస్తామంటే పొత్తుకు ఒప్పుకున్నామని, కానీ ఇప్పుడు కాంగ్రెస్ మౌనంగా ఉంటడం సరికాదనే అభిప్రాయాన్ని వామపక్షాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇదే వైఖరిని కాంగ్రెస్ అవలంభిస్తే..చెరో 20 స్థానాల్లో పోటీకి సిద్ధమవుతామని వామపక్షాలు అంటున్నాయి.
* హోటల్ రూంలో అడ్డంగా దొరికిపోయిన గిల్ సారా
యంగ్ క్రికెటర్ శుబ్ మన్ గిల్, ఇండియన్ క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ మళ్లీ అడ్డంగా దొరికిపోయారు. యంగ్ క్రికెటర్ శుబ్ మన్ గిల్, ఇండియన్ క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ డేటింగ్ లో ఉన్నట్లు కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి.తాజాగా వీరిద్దరూ ఒకే హోటల్ నుంచి వస్తూ కెమెరాకు చిక్కారు. దీంతో వీరు డేటింగ్ లో ఉన్నారంటూ వస్తున్న వార్తలకు మరింత బలం చేకూరింది. ఇదిలా ఉంటే ఈ మధ్య ఇండియా మ్యాచ్ లకు పదేపదే సారా రావడం, గిల్ బాగా ఆడితే సెలబ్రేట్ చేసుకున్న చిత్రాలు ట్రెండ్ అవుతున్నాయి.కాగా, తన ఫేవరెట్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అని టీమిండియా స్టార్ ప్లేయర్ శుబ్ మన్ గిల్ పేర్కొన్నారు. స్టార్ స్పోర్ట్స్ ఇంటర్వ్యూలో గిల్ ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు. ‘నా జెర్సీ నెంబర్ 77. U19 WCలో నంబర్. 7 జెర్సీ కోసం ట్రై చేశా. కానీ అందుబాటులో లేకపోవడంతో NO. 77 తీసుకున్న. టీమ్ లో నా బెస్ట్ ఫ్రెండ్ ఇషాన్. నా నిక్ నేమ్ కాక. అంటే పంజాబీలో బేబీ. నేను మ్యాచ్ గెలవగానే ఫస్ట్ నాన్నకి కాల్ చేస్తా’ అని చెప్పారు.
* మరో రైలు ప్రమాదం
దేశంలో రైలు ప్రమాద ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ ఏడాది జూన్‌లో ఒడిశాలో జరిగిన ట్రిపుల్ ట్రైన్ యాక్సిడెంట్ ఘటన మరవకముందే.. రెండు రోజుల క్రితం ఏపీలోని విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో సుమారు 14 మంది మరణించగా.. వందల మంది ప్రయాణికులు గాయాలపాలయ్యారు. తాజాగా, ఉత్తరప్రదేశ్‌లో మరో రైలు ప్రమాదం జరిగింది. అయితే, అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు.ఢిల్లీలోని ఆనంద్ విహార్, ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్ మధ్య (Delhi – Ghazipur city) నడిచే సుహేల్దేవ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు మంగళవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో యూపీలోని ప్రయాగ్‌రాజ్ రైల్వే స్టేషన్ వద్ద పట్టాలు తప్పింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని నార్త్ సెంట్రల్ రైల్వే ఆఫీసర్ హిమాన్షు శేఖర్ ఉపాధ్యాయ్ తెలిపారు. ‘రైలు స్టేషన్ నుంచి బయలుదేరింది. అయితే, ఇంజిన్ రెండు చక్రాలు ట్రాక్ నుంచి పక్కకు పోవడంతో.. ఇంజిన్ వెనుక ఉన్న రెండు కోచ్‌లు పట్టాలు తప్పాయి. దీంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకునేందుకు దర్యాప్తు చేపట్టాం. ప్రస్తుతం ఈ మార్గంలో రైలు కార్యకలాపాలకు ఎలాంటి ఆటంకం లేదు’ అని ఆయన వెల్లడించారు.
* ఓటమి భయంతోనే ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి
ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి దాడి అత్యంత హేయమైన చర్య అని పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి(MLA Gudem Mahipal reddy), ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ భూపాల్ రెడ్డి అన్నారు. దుబ్బాకలో ఎన్నికల ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రభాకర్‌రెడ్డిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు బుధవారం ఆర్సీపురం లక్ష్మి గార్డెన్స్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఓటమి భయంతోనే రాష్ట్రంలో అలజడులు సృష్టించాలని, అశాంతిని రేకెత్తించాలని విపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు.రాజకీయంగా ఎదుర్కొనలేక భౌతిక దాడులకు దిగడం సరికాదని హితవుపలికారు. ఇలా దాడులు చేసే వారికి ఓటుతో బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి హింసాత్మక దాడులకు చోటులేదని, దాడి చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి త్వరగా కోలుకొని, ఆరోగ్యంగా ప్రజల్లోకి రావాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నట్టు పేర్కొన్నారు.
* ఢిల్లీలో క్రమంగా పెరుగుతున్న గాలి కాలుష్యం
దేశ రాజధాని ఢిల్లీలో గాలి కాలుష్యం క్రమంగా పెరుగుతున్నది. గత మూడు రోజుల నుంచి గాలి కాలుష్య తీవ్రత వరుసగా పెరుగుతూ వస్తున్నది. సోమవారం 322 గా ఉన్న ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) మంగళవారం 327కు చేరింది. బుధవారం ఉదయానికి 336కు పెరిగింది. సిస్టమ్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్‌కాస్టింగ్ అండ్ రిసెర్చ్ (SAFAR)- ఇండియా ఈ వివరాలను వెల్లడించింది.ఢిల్లీకి పొరుగున ఉన్న పంజాబ్ రాష్ట్రంలోని రైతులు తమ పంట పొలాల్లో కొయ్య కాలు కాల్చివేత (స్టబుల్ బర్నింగ్) కారణంగా వెలువడే దట్టమైన పొగలు ఢిల్లీ వాయు కాలుష్యం పెరగడానికి కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. శీతాకాలం గాలిలో తేమకు ఈ పొగ తోడు కావడంతో కాలుష్యం పెరుగుతోంది. దాంతో ఢిల్లీ వాసుల ఆరోగ్యాలకు ముప్పు పొంచి ఉంది.
* మరికాసేపట్లో హైదరాబాద్‌కు చంద్రబాబు
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో మధ్యంతర బెయిల్‌పై విడుదలైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు హైదరాబాద్ వెళ్లనున్నారు. చంద్రబాబు అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ హైకోర్టు నాలుగు వారాలపాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. అయితే వైద్యులు చికిత్స చేయించుకునేందుకు రావాలని చంద్రబాబును కోరడంతో బుధవారం హైదరాబాద్ వెళ్లనున్నారు. బుధవారం మధ్యాహ్నాం 3 గంటలకు చంద్రబాబు నాయుడు హైదరాబాద్ బయలుదేరి వెళ్లనున్నారు. ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరి 3.45 గంటలకు విజయవాడ ఎయిర్ పోర్ట్ చేరుకుంటారు. 4గంటలకు శంషాబాద్ఎయిర్ పోర్టుకు బయలుదేరతారు. 4.45 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టు చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గం గూండా సాయంత్రం 5 గంటలకు ఎయిర్ పోర్టు నుంచి ఇంటికి పయనమవుతారు. సాయంత్రం 5.50 గంటలకు జూబ్లీహిల్స్‌లోని తన నివాసానికి చంద్రబాబు నాయుడు చేరుకుంటారు. ఈ మేరకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు భద్రత విషయంలో అటు ఏపీ పోలీసులను, అటు తెలంగాణ పోలీసులను చంద్రబాబు నాయుడు సిబ్బంది విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు చంద్రబాబు టూర్ షెడ్యూల్‌ను మెయిల్ ద్వారా అధికారులకు పంపారు. చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఉండవల్లి నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. మధ్యాహ్నాం హైదరాబాద్ వెళ్తున్న నేపథ్యంలో చంద్రబాబును పరామర్శించేందుకు నేతలు, కార్యకర్తలు రావొద్దని టీడీపీ విజ్ఞప్తి చేసింది. ఇకపోతే రాత్రికి హైదరాబాద్‌లోని తన నివాసంలో చంద్రబాబు నాయుడు విశ్రాంతి తీసుకుంటారు. గురువారం హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో చంద్రబాబు వైద్య పరీక్షలు చేయించుకుంటారు. అనంతరం ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రికి చేరుకుని కంటి వైద్య పరీక్షలు చేయించుకుంటారు. అనంతరం జూబ్లీహిల్స్‌లోని తన నివాసానికి చంద్రబాబు చేరుకుంటారు.
* విజయనగరం ఆస్పత్రికి మంత్రి బొత్స
విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రైలు ప్రమాద క్షతగాత్రులను పరామర్శించారు మంత్రి బొత్స సత్యనారాయణ.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి విజయనగరం వచ్చి వెళ్లిన తర్వాత పరిహారం విడుదల చేశారు అని తెలిపారు.. రెండు మూడు నెలలు ఆసుపత్రిలో ఉన్న వారికి రూ.5 లక్షలు, పది రోజులు ఉన్నవారికి రూ. 2 లక్షలు.. అందజేస్తున్నాం.. ఇక, 13 మందికి రూ. 10 లక్షల చొప్పును పరిహారాన్ని ఇవ్వనున్నామని వెల్లడించారు.. 12 మందికి రూ. రెండు లక్షల చొప్పున ఇచ్చాం.. మూడు నెలల పాటు ఆస్పత్రిలో ఉండాల్సిన అవసరం ఉన్న పదిహేను మందికి రూ.75 లక్షలు ఇస్తున్నట్టు తెలిపారు.. రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి.. వికలాంగులుగా మిగిలిపోయిన వారికి రూ.10 లక్షలు ఇస్తున్నాం.. 43 మందికి పరిహారం అందజేస్తున్నాం అన్నారు మంత్రి బొత్స.. ఎవ్వరికైన ఇబ్బంది వస్తే ఆదుకోవాలన్న అలోచనతోనే పరిహారం అందిస్తున్నాం.. ఈ పరిహారంతో వారి జీవితాలు మారిపోతాయని మేం భావించడం లేదు.. కాస్త వారికి సహాయం మాత్రమే అన్నారు. రైలు ప్రమాదంలో గాయపడున వారికి మెరుగైన వైద్యం అందించాలని సంబంధితన వైద్యులను ఆదేశించినట్టు వెల్లడించారు మంత్రి బొత్స సత్యనారాయణ.
* బీజేపీ పార్టీకి వివేక్ రాజీనామా
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. బీజేపీ పార్టీ V6 వివేక్ రాజీనామా చేశారు. ఈ మేరకు కేంద్ర బీజేపీకి మెయిల్ ద్వారా ఫ్యాక్స్ పంపించారు V6 వివేక్.ఇక బీజేపీకి రాజీనామా చేసిన వీ6 వివేక్ ఇవాళ రాహుల్ గాంధీని కలిసే ఛాన్స్ ఉంది. కాంగ్రెస్ లో చేరాలని వివేక్ వెంకటస్వామి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. ఇవాళ, రేపు రాహుల్ గాంధీ తెలంగాణలో ఎన్నికల ప్రచారం జరుగనుంది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరనున్నారట వివేక్ వెంకటస్వామి. ఇక చెన్నూర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ కి వివేక్ వెంకటస్వామి సిద్ధం అయ్యారట. కాంగ్రెస్ లో చేరాలని వివేక్ వెంకటస్వామి నిర్ణయం తీసుకోవడంతో…చెన్నూర్ అసెంబ్లీ టికెట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధం అయిందని సమాచారం.
👉 – Please join our whatsapp channel here –