అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎలక్షన్ కమిషన్ గత నెల 9న షెడ్యూలు ప్రకటించడంతో దానికి అనుగుణంగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం శుక్రవారం నోటిఫికేషన్‌ను జారీ చేయనున్నది. నోటిఫికేషన్ వెలువడడంతోనే అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుంది. ఈ నెల 10వ తేదీ వరకు నామినేషన్లను దాఖలు చేసుకోడానికి కమిషన్ గడువు ఇచ్చింది. నామినేషన్లను ఈ నెల 13వ తేదీ వరకు పరిశీలించి, అర్హత కలిగిన దరఖాస్తుల విషయమై ప్రకటన చేయనున్నది. నిబంధనల మేరకు సక్రమంగా ఉన్న నామినేషన్ల విషయంలో అభ్యర్థులు ఉపసంహరించుకోడానికి ఈ నెల 15వ తేదీ వరకు గడువు ఉన్నది. ఆ ప్రక్రియ ముగియగానే ఏ నియోజకవర్గంలో ఎంత మంది అభ్యర్థులు బరిలో ఉన్నారనేది తేలిపోతుంది.
అభ్యర్థుల ప్రకటనలో పార్టీలు..బీఆర్ఎస్ ఆగస్టు 21వ తేదీనే 115 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయగా ఆ తర్వాత మరో రెండు స్థానాలకు కూడా ఖరారు చేసింది. నాంపల్లి, గోషామహల్ సెగ్మెంట్లకు మాత్రం ఇంకా పేర్లను ప్రకటించలేదు. మరోవైపు కాంగ్రెస్ 100 స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. సీపీఐ, సీపీఎం సీట్ల సర్దుబాటు తర్వాత మిగిలిన 19 స్థానాల విషయంలోనూ క్లారిటీ ఇచ్చి అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్నది. సీట్ల సర్దుబాటు నిర్ణయానికి అనుగుణంగా సీపీఐ, సీపీఎం ఎన్ని స్థానాల్లో పోటీ చేయనున్నదీ, బరిలో ఉండే అభ్యర్థులెవరో క్లారిటీ వస్తుంది. మరోవైపు బీజేపీ 53 మంది అభ్యర్థులతో ఫస్ట్, సెకండ్ లిస్టులను ప్రకటించింది. ఇంకా 66 మంది అభ్యర్థుల పేర్లను రిలీజ్ చేయాల్సి ఉన్నది. జనసేన పార్టీతో పొత్తు వ్యవహారం ఇంకా కొలిక్కి రాకపోవడంతో గురువారం ఫైనల్ చేసి విడుదల చేసే అవకాశమున్నది.
ఏర్పాట్లు పూర్తి..నోటిఫికేషన్ వెలువడడంతోనే నామినేషన్ల ప్రక్రియ ఊపందుకోనున్నందున ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. ఇప్పటికే జీహెచ్ఎంసీ పరిధిలోని 15 అసెంబ్లీ స్థానాలకు ప్రిసైడింగ్ అధికారులను ప్రకటించిన కమిషనర్ రోనాల్డ్ రోస్ ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. అన్ని జిల్లాల కలెక్టర్లు (ఆ జిల్లాలకు వీరే ఎన్నికల అధికారులు) కూడా వారి పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో నామినేషన్ల స్వీకరణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేసిన ఏర్పాట్లపై రివ్యూ చేశారు. మరోవైపు మంచి ముహూర్తం చూసుకుని నామినేషన్లను దాఖలు చేసుకోడానికి అన్ని పార్టీల అభ్యర్థులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంతో పాటు కామారెడ్డిలోనూ పోటీ చేస్తున్నందున ఒకే రోజున రెండు చోట్లా నామినేషన్‌లను దాఖలు చేయడానికి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. ఈ నెల 9వ తేదీన తొలుత గజ్వేల్‌లో మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో నామినేషన్ వేసి ఆ తర్వాత కామారెడ్డిలో దాఖలు చేయనున్నారు. అనంతరం అక్కడే (కామారెడ్డి)లో బహిరంగసభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించే ఎన్నికల క్యాంపెయిన్‌లో పాల్గొననున్నారు. రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో 3.17 కోట్ల మంది ఓటర్లు ఉండగా సగటున ఒక్కో పోలింగ్ కేంద్రంలో 870 మంది చొప్పున 35,356 పోలింగ్ కేంద్రాలను సీఈఓ ఆఫీస్ నెలకొల్పింది. కొత్తగా ఓటర్ల జాబితాలో పేర్లను నమోదు చేసుకోడానికి గడువు అక్టోబరు 31తో ముగిసింది.
👉 – Please join our whatsapp channel here –