Business

జుకర్‌పై మస్క్‌ సెటైర్‌- వాణిజ్య వార్తలు

జుకర్‌పై మస్క్‌ సెటైర్‌- వాణిజ్య వార్తలు

* జుకర్‌పై మస్క్‌ సెటైర్‌

ప్రపంచ కుబేరుడు, స్పేస్‌ ఎక్స్‌ అధినేత ఎలాన్‌ మస్క్‌ తన ఎక్స్‌ ఖాతాలో (ట్విటర్‌) చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఎక్స్‌ను సొంతం చేసుకోక ముందు నుంచీ మస్క్‌ అంతే. ఎప్పటికప్పుడు పోస్టులు పెట్టడమే కాకుండా.. నెటిజన్లు పెట్టే కామెంట్లకు సమాధానం ఇస్తుంటారు. నచ్చిన, నచ్చని విషయాలపై నిర్మొహమాటంగా తన అభిప్రాయాలను చెప్తుంటారు. తాజాగా ఆయన మెటా సీఈఓ మార్క్‌ జుకర్‌ బర్గ్‌ను ఓ విషయంలో ట్రోల్‌ చేశారు. ట్విటర్‌కు పోటీగా థ్రెడ్స్‌ పేరిట మెటా ఓ కొత్త యాప్‌ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఫేస్‌బుక్‌, వాట్సప్‌, ఇన్‌స్టా.. ఇలా పలు సామాజిక మాధ్యమాలను నడుపుతున్న మార్క్‌.. సోషల్‌ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉండేది అంతంత మాత్రమే. ఈ నేపథ్యంలో ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన మస్క్‌.. థ్రెడ్స్‌ను ‘ఘోస్ట్‌ టౌన్‌’గా అభివర్ణించారు. జుకర్‌ తన సొంత యాప్‌లో ఎలాంటి పోస్టులూ పెట్టడని, తన సొంత ప్రొడక్ట్‌ను ఉపయోగించకపోతే ఎలా అని ప్రశ్నించారు. గతంలో సైతం ఇలానే ఓ సందర్భంలో జుకర్‌ను విమర్శించారు. గడిచిన 6 రోజులుగా జుకర్‌బర్గ్‌ ఒక్క పోస్టూ పెట్టకపోవడంపై గ్రెగ్ అనే వ్యక్తి పోస్ట్‌ పెట్టారు. దానిపై మస్క్‌ స్పందిస్తూ.. ఆయన తన సొంత ప్రొడక్ట్‌ను పట్టించుకుంటున్నట్లు లేదంటూ దెప్పిపొడిచారుట్విటర్‌కు పోటీగా జుకర్‌ బర్గ్‌ థ్రెడ్స్‌ను ఈ ఏడాది జులైలో తీసుకొచ్చారు. ఈ యాప్‌ అనతికాలంలోనే ప్రాచుర్యం పొందింది. కేవలం ఐదు రోజుల్లోనే 100 మిలియన్‌ డౌన్‌లోడ్స్‌ను సాధించింది. అయితే, కొద్ది రోజులకే దాని డౌన్‌ఫాల్‌ స్టార్ట్‌ అయ్యింది. డెయిలీ యూజర్లు తగ్గడం మొదలు పెట్టారు. దీనిపై జుకర్‌బర్గ్‌ సైతం అంతర్గతంగా సమీక్ష చేశారు. ఈ క్రమంలోనే థ్రెడ్స్‌ను యూజర్లు లేని ‘ఘోస్ట్‌ టౌన్‌’గా మస్క్‌ అభివర్ణించారు.

దీపావళికి దుమ్మురేపే ఆఫర్‌

మొన్నటి వరకు దసరా పండుగను క్యాష్‌ చేసుకునే క్రమంలో ఈ కామర్స్‌ సైట్స్‌ భారీ ఆఫర్లను అందించిన విషయం తెలిసిందే. అమెజాన్‌తోపాటు ఫ్లిప్‌కార్ట్ సైతం భారీ ఆఫర్లను ప్రకటించాయి. అయితే తాజాగా ఫ్లిప్‌కార్ట్ సైతం దీపావళికి.. ‘బిగ్‌ దీపావళి సేల్’ పేరుతో సేల్‌ను తీసుకొచ్చింది. నవంబర్‌ 2వ తేదీ నుంచి ఈ సేల్‌ ప్రారంభం కానుంది..ఫ్లిప్‌కార్ట్ బిగ్‌ దీపావళి సేల్‌ పేరుతో నిర్వహిస్తున్న ఈ సేల్‌లో ఎన్నో ఆఫర్లను అందిస్తున్నారు. ఎస్‌బీఐ కార్డుతో కొనుగోలు చేసిన వారికి 10 శాతం ఇన్‌స్టాంట్ డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. ఈ సేల్‌లో భాగంగానే గూగుల్‌ పిక్సెల్‌ 7ఏపై భారీ ఆఫర్‌ను అందిస్తోంది.గూగుల్ పిక్సెల్ 7ఏ అసలు ధర రూ. 43,999కాగా సేల్‌లో భాగంగా రూ. 8000 డిస్కౌంట్‌కు లభిస్తోంది. దీంతో ఈ ఫోన్‌ ధర రూ. 35,999కి సొంతం చేసుకోవచ్చు. ఒకవేళ ఎస్‌బీఐ కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా రూ. 3000 డిస్కౌంట్‌ను పొందొచ్చు. దీంతో అన్ని ఆఫర్లు కలుపుకొని ఈ ఫోన్‌ను రూ. 32,999కే పొందొచ్చు. వీటికి అదనంగా ఎక్స్ఛేంజ్‌ ఆఫర్‌ కింద డిస్కౌంట్ పొందొచ్చు.గూగుల్‌ పిక్సెల్‌ 7ఏ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.1 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. 90 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేట్ను అందించారు. ఈ ఫోన్‌లో టెన్సర్‌ జీ2 ప్రాసెసర్‌ను అందించారు.ఈ స్మార్ట్ ఫోన్‌ను 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌తో లాంచ్‌ చేశారు. ఇక కెమెరా విషయానికొస్తే ఇందులో 64 మెగాపిక్సెల్‌ రెయిర్‌ కెమెరాను అందించారు. ఇక సెల్ఫీల కోసం ఇందులో 13 మెగాపిక్సెల్‌తో కూడిన సెల్ఫీ కెమెరాను ఇచ్చారు.ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్‌ ప్రాసెసర్‌ను అందించారు. ఇక ఈ స్మార్ట్ ఫోన్‌లో బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 4300 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు.

* 16 లక్షల బైకుపై ఫుడ్ డెలివరీ

సోషల్ మీడియాలో పాపులర్ అవ్వడానికి నేటి యువత ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఇందులో భాగంగానే గత కొన్ని రోజులుగా ఖరీదైన బైకుల ద్వారా జొమాటో ఫుడ్ డెలివరీ చేయడం వంటివి చేస్తున్నారు. ఇలాంటి వీడియోలు గతంలో కోకొల్లలుగా వెలుగులోకి వచ్చాయి. తాజాగా మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.హెచ్‌ఎస్‌బీ అఫీషియల్ ఇన్‌స్టాగ్రామ్ పేజీలో కనిపించిన వీడియోలో ఒక వ్యక్తి ఖరీదైన ‘సుజుకి హయబుసా’ (Suzuki Hayabusa) బైక్ రైడ్ చేస్తున్నాడు. ఇందులో రైడర్ జొమాటో డెలివరీ బాయ్ వేషధారణలో ఉండటం గమనించవచ్చు.వీడియోలో కనిపించే ఖరీదైన సూపర్ బైక్ ధర రూ. 13 లక్షల నుంచి రూ. 17 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంటుంది. బైక్ రైడర్ నిజంగా డెలివరీ బాయ్ అవునా? కాదా? అనేది తెలియదు. ఎందుకంటే గత కొన్ని రోజులుగా చాలామంది సోషల్ మీడియాలో ఫెమస్ అవ్వడానికి ఇలాంటి వీడియోలు చేస్తున్నారు.ఇలాంటి వీడియోలు వెలుగులోకి రావడం ఇదే మొదటిసారి కాదు, గత వారం ఇండోర్‌లో కూడా ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. ఇందులో రోడ్డుపై జొమాటో బ్రాండింగ్ టీ-షర్ట్ వేసుకున్న ఒక అమ్మాయి యమహా ఆర్15 మోటార్‌సైకిల్‌ రైడ్ చేసింది. ఈ వీడియో అతి తక్కువ కాలంలోనే వైరల్ అయింది. దీనిపై స్పందించిన జొమాటో సీఈవో దీపిందర్ గోయల్.. ఆ సంఘటనకు, జొమాటోకు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చాడు.

* నేడు భారీగా తగ్గిన బంగారం ధరలు

బంగారం ధరలు క్షీణిస్తున్నాయి. వరుసగా మూడోరోజూ పతనం చెందగా.. ఈ మూడు రోజుల్లో తులం రేటు రూ.1,100 దిగొచ్చింది. బుధవారం హైదరాబాద్‌లో మరో రూ.320 పడిపోయి 10 గ్రాముల 24 క్యారెట్‌ పుత్తడి విలువ రూ.61,530కి తగ్గింది. సోమ, మంగళవారాల్లోనూ రూ.230, రూ.550 చొప్పున దిగిన విషయం తెలిసిందే. 22 క్యారెట్‌ రేటు కూడా ఈ మూడు రోజుల్లో రూ.1,010 దిగజారి తులం రూ.56,400 వద్ద ఉన్నది. బుధవారం ఒక్కరోజే రూ.300 పడింది. మరోవైపు ఢిల్లీలోనూ రూ.350 తగ్గి 10 గ్రాముల మేలిమి పసిడి రూ.61,700 పలికింది.

యాపిల్‌కు నోటీసులు ఇచ్చిన కేంద్రం

ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ యాపిల్ కు కేంద్ర ప్రభుత్వం గురువారం నోటీసులు పంపించింది. కేంద్ర ప్రభుత్వంపై చేసిన హ్యాకింగ్ ఆరోపణలపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ప్రతిపక్ష నేతల ఫోన్లలో మాల్ వేర్ చొప్పించేందుకు ప్రయత్నించిందని ఎలా నిర్ధారించారని ప్రశ్నించింది. ఈ ఆరోపణలకు సంబంధించి ఉన్న ఆధారాలు ఏంటని, వాటిని అప్పగించాలని కేంద్ర ఐటీ శాఖ ఈ నోటీసుల్లో పేర్కొంది. తమ ఫోన్లను కేంద్ర ప్రభుత్వం హ్యాక్ చేసేందుకు ప్రయత్నిస్తోందని ప్రతిపక్ష నేతలు శశిథరూర్, మహువా మొయిత్రాలతో పాటు పలువురు నేతలు ఇటీవల ఆరోపించారు. మహువా మొయిత్రా ఈ విషయంపై స్పీకర్ కు ఓ లేఖ కూడా రాశారు. ఈమేరకు యాపిల్ కంపెనీ నుంచి వచ్చిన అలర్ట్ మెసేజ్ లను మొయిత్రా బయటపెట్టారు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు కూడా ఈ అలర్ట్ మెసేజ్ వచ్చినట్లు సమాచారం. దీనిపై కాంగ్రెస్ మాజీ చీఫ్, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ స్పందిస్తూ.. కేంద్ర ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు.ప్రతిపక్ష నేతల ఆరోపణలపై కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని కుమార్ వైష్ణవ్ స్పందించారు. యాపిల్ కంపెనీ మొత్తం 150 దేశాల్లోని తన కస్టమర్లకు ఇలాంటి హెచ్చరిక సందేశాలు పంపించిందని వివరించారు. ఇలాంటి సందేశాలు ఒక్కోసారి పొరపాటున కూడా వస్తాయని చెప్పారు. ఈ విషయంపై యాపిల్ కంపెనీ వివరణ కోరతామని, ఆ కంపెనీ దగ్గరున్న ఆధారాలతో దర్యాఫ్తు జరిపిస్తామని మంత్రి పేర్కొన్నారు.

* కారు కొనేటప్పుడు కస్టమర్ల ఫొటో తీయడానికి కారణం?

ఇటీవల సెల్‌ఫోన్ వచ్చిన కానుంచి చాలా మంది ఏదైనా వస్తువును కొనుగోలు చేసిన ఎక్కడికైనా వెళ్లినప్పుడు ఫొటోలు తీసుకోవడం కామన్ అయిపోయింది. అలాగే ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ రచ్చ చేస్తుంటారు. అయితే ముఖ్యంగా కారు కొన్నప్పుడు షోరూమ్ వాళ్లే ఫొటో తీసుకుంటారు. కారు ముందు కస్టమర్‌ను నిల్చో బెట్టి వారి చేతికి ఓ పెద్ద తాళం ఇచ్చి ఫొటో దింపుతారు. ఆ తర్వాతే కారును అప్పగిస్తారు. అలా ఎందుకు చేస్తారని చాలా మందిలో అనుమానం ఉండొచ్చు. అయితే వారు అలా చేయడానికి కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయట. అవెంటో ఇక్కడ తెలుసుకుందాం.అలా ఫొటో తీసుకోవడం వల్ల కారు కొనడానికి తీసుకున్న నిర్ణయం సరైనదని ఆ సమయం గుర్తుండి పోవాలని పెద్ద తాళం తో ఫొటో తీస్తారు. అలాగే భారీగా పెట్టుబడి పెడతారు దాన్ని ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేసుకోవాలని అందరూ అనుకుంటారు. వారి ఉత్సాహం ఎంతలా ఉందో తెలపడానికి ఈ ఫొటోను తీస్తారు. అయితే పెద్ద కీలో ఈ బ్రాండ్ పేరుతో పాటు లోగో కూడా ఉంటుంది. దీంతో వినియోగదారులు దాన్ని చూసుకొని మురిసిపోతూ జ్ఞాపకంగా వారితో పదిలంగా దాచుకుంటారు. అలాగే ఈ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తే కంపెనీ వారికి భారీగా ప్రమేషన్స్ చేసినట్లు అవుతుంది. దీంతో వారికి ఏ కష్టం లేకుండా వారి బ్రాండ్ గురించి అందరికీ తెలుస్తుంది. దీన్ని నమ్మి కారు కొన్న వారికి తెలిసిన వారు కూడా ఆ బ్రాండ్ కారునే కొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

ఐరోపాలో మెటాకు ఎదురుదెబ్బ

టెక్‌ దిగ్గజం మెటా (Meta), ఐరోపా దేశాల మధ్య వివాదం మరింత ముదిరింది. యూజర్ల ఆన్‌లైన్‌ హిస్టరీ ఆధారంగా వాణిజ్య ప్రకటనలను పంపే విధానంపై అమల్లో ఉన్న నిషేధాన్ని దాదాపు ఐరోపా వ్యాప్తంగా విస్తరిస్తున్నట్లు ‘యురోపియన్‌ డేటా ప్రొటెక్షన్‌ బోర్డ్‌’ బుధవారం ప్రకటించింది. మెటాకు చెందిన ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ సహా ఇతర టెక్‌ కంపెనీలు యూజర్ల బ్రౌజింగ్‌, మౌస్‌ క్లిక్‌లు, యాప్‌ల వాడకాన్ని పరిశీలిస్తాయి. వాటి ఆధారంగా ఆయా యూజర్ల ఆసక్తులకు అనుగుణంగా వాణిజ్య ప్రకటనలను పంపుతుంటాయి. దీన్నే ‘బిహేవియరల్‌ అడ్వర్టయిజింగ్‌ ’ అంటారు.బిహేవియరల్‌ అడ్వర్టయిజింగ్‌’పై తొలుత నార్వేలో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. సరైన అనుమతులు లేకుండా యూజర్ల వ్యక్తిగత డేటాను తీసుకున్నందుకు రోజుకు 90 వేల డాలర్ల జరిమానా చెల్లించాలని ఆ దేశ ప్రైవసీ విభాగం మెటా ను ఆదేశించింది. అయితే, డేటా సేకరణకు యూజర్లు అనుమతించే ఆప్షన్‌ను కల్పించామని నియంత్రణా సంస్థలకు తెలిపినట్ల మెటా తాజాగా వెల్లడించింది. నెలకు 9.99 యూరోలతో ప్రకటనలరహిత సేవలను కూడా తీసుకొచ్చినట్లు తెలిపింది. అయినప్పటికీ.. బోర్డు తమపై చర్యలు తీసుకోవడం సమ్మతంకాదని పేర్కొంది. అయితే, మెటా తీసుకున్న చర్యలు ఐరోపా ప్రమాణాల స్థాయిలో లేవని నార్వే డేటా ప్రొటెక్షన్‌ అథారిటీ చీఫ్‌ తెలిపారు. డేటా సేకరణకు యూజర్లు తమ ఇష్టపూర్వకంగా అనుమతిచ్చేలా విధానాలు ఉండాలని.. బలవంతంగా సబ్‌స్క్రిప్షన్‌ రూపంలో దాన్ని అమలు చేయాలని చూడొద్దని వివరించారు.ప్రైవసీ విషయంలో ఐరోపాలో మెటా (Meta) అనేక వివాదాలను ఎదుర్కొంటోంది. యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని ఇతర ప్రదేశాలకు పంపుతున్నందుకుగానూ మే నెలలో ఐరోపా సమాఖ్య 1.3 బిలియన్‌ డాలర్ల జరిమానా విధించింది. అలాగే నియంత్రణాపరమైన చర్యల కారణంగా మెటా టెక్ట్స్‌ ఆధారిత యాప్‌ ‘థ్రెడ్స్‌’ను ఐరోపాలో ప్రవేశపెట్టలేదు.

* స్కూల్‌ను ప్రారంభించిన నీతా అంబానీ

రిలయన్స్‌ ఫౌండేషన్‌ చైర్‌పర్సన్‌ నీతా అంబానీ (Nita Ambani) కొత్త ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. బుధవారం నీతా పుట్టినరోజు సందర్భంగా బోధన, అభ్యాసంలో నూతన అధ్యాయానికి శ్రీకారం చుడుతూ కొత్తగా నీతా ముఖేష్‌ అంబానీ జూనియర్ స్కూల్‌ (Nita Mukesh Ambani Junior School)ను ప్రారంభించారు. ముంబైలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్‌లోని ధీరూభాయ్‌ అంబానీ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ (DAIS ) క్యాంపస్‌కు ఆనుకొని ఈ కొత్త పాఠశాలను ప్రారంభించారు. అత్యాధునిక క్యాంపస్‌గా దీన్ని తీర్చిదిద్దారు.లాంచ్‌ ఈవెంట్‌ సందర్భంగా నీతా అంబానీ మాట్లాడుతూ.. ఇక్కడ బోధన ఆనందాన్ని కలిగిస్తుందన్నారు. డీఏఐఎస్‌ ద్వారా దశాబ్దాలుగా వేలాది మంది పిల్లలు వారి కుటుంబాల జీవితాల్లో మార్పు తీసుకురాగలిగినట్లు చెప్పారు. ఈ కొత్త లెర్నింగ్‌ పాఠశాల ముంబై నగరానికి మొత్తం దేశానికి అంకితం చేయడం గర్వకారణంగా భావిస్తున్నట్లు వెల్లడించారు.మరోవైపు పుట్టినరోజు సందర్భంగా నీతా అంబానీ పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముంబైలో సుమారు 3 వేల మంది అనాథ పిల్లలకు అన్నదానం చేశారు. వారికి స్వయంగా తన చేతులతోనే వడ్డించారు. అనంతరం పిల్లలతో కలిసి కేక్‌ కట్‌ చేసి బర్త్‌డేని సెలబ్రేట్‌ చేసుకున్నారు. వారితో సరదాగా సమయాన్ని గడిపారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి.

* తెలుగు రాష్ట్రాల్లో ఉల్లి ధరలు ఎలా ఉన్నాయంటే?

ఉల్లి ఉత్పత్తిలో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉందన్న సంగతి తెలిసిందే. తమిళనాడుకు ఉల్లి కావాలంటే మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలపైనే ఆధారపడి ఉంది. మహారాష్ట్ర రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు సకాలంలో రాకపోవడంతో గత నెల రోజులుగా ఉల్లి సరఫరా తగ్గింది. దీంతో ఉల్లి ధర పెరుగుతోంది. తమిళనాడులో రెండు నెలల క్రితం టమాటా ధర కిలో రూ.110 వరకు విక్రయించారు. మూడు రోజుల క్రితం వరకూ ఉల్లి రూ.25 నుంచి రూ.30 వరకు విక్రయిస్తుండగా, ప్రస్తుతం ఉల్లి కిలో రూ.80 వరకు విక్రయిస్తున్నారు. నోయిడాలో కూడా కిలో ఉల్లి ధర రూ.100. వినియోగదారుల వ్యవహారాల వెబ్‌సైట్ వెల్లడించింది. మధ్యప్రదేశ్‌లో కిలో ఉల్లి ధర రూ.53.16గా ఉంది. గోవాలో కూడా ఉల్లి ధర రూ.70 దాటింది. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ అదే పరిస్థితి నెలకొంది. హైదరాబాద్‌లో నాణ్యతను బట్టి కిలో ఉల్లి ధర రూ.60 నుంచి రూ.70 వరకు ఉంది. రిటైల్ దుకాణాల్లో ఇప్పటికే కిలో రూ.90కి చేరుకోగా, త్వరలోనే కిలో రూ.100కు చేరుకుంటుందని వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z