DailyDose

ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ-తాజా వార్తలు

ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ-తాజా వార్తలు

* జగన్‌ పాలనలో దళితులకు రక్షణ లేకుండా పోయింది

సీఎం జగన్‌ పాలనలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ధ్వజమెత్తారు. జగన్ రెడ్డి ప్రభుత్వంలో డాక్టర్ సుధాకర్ నుంచి దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం వరకు ఎంతో మంది దళితబిడ్డలు బలికాగా.. తాజాగా మరో దారుణం చోటుచేసుకుందని మండిపడ్డారు. ఈ మేరకు లోకేశ్‌ ట్వీట్‌ చేశారు. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల అంబేడ్కర్‌ కాలనీకి చెందిన దళిత యువకుడు కాండ్రు శ్యామ్‌కుమార్‌ను కొందరు దుండగులు నిర్బంధించారన్నారు. 4 గంటలపాటు చిత్రహింసలు పెట్టడమే కాకుండా దాహం వేసి మంచినీళ్లు అడిగితే సభ్యసమాజం తలదించుకునేలా మూత్రం పోసి అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ముఖ్యమంత్రి జగన్‌కు ఏమాత్రం మనస్సాక్షి ఉన్నా.. ఈ అమానవీయ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని లోకేశ్‌ డిమాండ్‌ చేశారు. బాధిత దళితులకు న్యాయం చేసేందుకు ఏర్పాటైన చట్టబద్ధ సంస్థకు అధిపతి అయిన ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ బాబు ఈ ప్రభుత్వంలో నేనే బాధితుడ్ని అని వాపోవడం… జగన్ జమానాలో దళితులపై అణచివేత చర్యలకు పరాకాష్ఠ అని ఆయన దుయ్యబట్టారు.

* ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగే క్యాబినెట్ సమావేశం ముగిసింది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు బ్లాక్ కేబినెట్ సమావేశ మందిరంలో ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా జర్నలిస్ట్ లకు ఇళ్ల స్థలాలకు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఎస్ఐపీబీ ప్రతిపాదనలకు.. రూ.19వేల కోట్ల పెట్టుబడుల పరిశ్రమల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సమగ్ర కులగణన, ఏపీలో జర్నలిస్టుకు ఇళ్ల స్థలాల పంపిణీ పై కేబినెట్ చర్చించింది.ఎన్నికల మేనిఫెస్టోలో జర్నలిస్టులకు ఇచ్చిన హామీని సీఎం జగన్ ప్రభుత్వం నెరవేర్చనుంది. వర్సిటీలు, ట్రిపుల్ ఐటీలలో 3,200 పోస్టుల భర్తీకి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. గ్రూపు 1, గ్రూపు 2 పోస్టుల భర్తీపై చర్చలు జరిపింది ఏపీ కేబినెట్. దాదాపు రెండున్నర గంటలకు పైగా ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీ జరిగింది. ఈ భేటీలో కీలక విషయాలపై చర్చలు జరిగాయి. ఇటు జర్నలిస్టులకు, అటు నిరుద్యోగులకు, ఉద్యోగులకు, కులగణన వంటి కీలక అంశాలపై చర్చలు జరిపారు.

* జర్నలిస్టులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌

జర్నలిస్టులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ అందించింది. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల పంపిణీకి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ప్రతి జర్నలిస్ట్‌కు 3 సెంట్ల స్థలం ఇవ్వాలని కేబినెట్‌ నిర్ణయించింది. ఈ మేరకు ఎన్నికల హామీని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిలబెట్టున్నారు.ఎస్ఐపీబీ ప్రతిపాదనలకు.. రూ. 19 వేల కోట్ల పెట్టుబడుల పరిశ్రమల ఏర్పాటు, సమగ్ర కుల గణన, ఏపీలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల పంపిణీ తదితర అంశాలపై చర్చించిన కేబినెట్‌ అందుకుఆమోద ముద్ర వేసింది.కులగణనకు ఏపీ కేబినెట్‌ ఆమోదం తెలిపింది. అణగారిన వర్గాల అభ్యున్నతికి కులగణన మరింత ఉపయోగపడుతుందని సీఎం జగన్‌ ఈ సందర్భంగా పేర్కొన్నారు. అదే సమయంలో జ.గనన్న సురక్ష కార్యక్రమానికి కేబినెట్‌ అభినందనలు తెలిపింది. ఈ మేరకు సీఎం జగన్‌ మాట్లాడుతూ.. మంత్రులందరూ జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగస్వామ్యులు కావాలని ఆదేశించారు.

* రేవంత్‌ ఎలాంటి వాడో నిన్న గాంధీ భవన్‌లో చూశాం

తెలంగాణ వ్యతిరేకులతోనే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి దోస్తానా చేస్తున్నారని మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. తెలంగాణ రాకుండా కుట్రలు చేసిన వారందరూ ఒక్కటయ్యారన్నారు. అసలైన తెలంగాణ వ్యతిరేకి.. రేవంత్‌ రెడ్డి కాదా.. అని ప్రశ్నించారు. సంగారెడ్డిలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో హరీశ్‌రావు పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ గెలవాలంటే ప్రజలు కేసీఆర్‌ వైపు ఉండాలి. తెలంగాణ ఓడాలంటే రేవంత్‌ రెడ్డి అండ్‌ గ్యాంగ్‌ వైపు నిలవాలి. రేవంత్‌ ఎలాంటి వాడో నిన్న గాంధీ భవన్‌లో చూశాం. ఓటుకు నోటు కేసులో జైలుకు వెళ్లి వచ్చింది ఎవరో చూశాం. ఉస్మానియా విద్యార్థులపై అనుచిత వ్యాఖ్యలు చేసిందెవరు?క్రిమినల్‌ ఎవరో.. ఆ మైండ్‌ సెట్‌ ఎవరిదో అందరికీ తెలుసు. కాంగ్రెస్‌కు ఓటేసి కర్ణాటక ప్రజలు మోసపోయారు. అభివృద్ధిలో దేశానికే దిక్సూచిగా తెలంగాణ మారుతుంది. ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో రిస్క్‌ తీసుకోవడం ఎందుకు?’’ అని హరీశ్‌రావు.

* బీఆర్ఎస్‌లో చేరిన కాసాని

అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తోన్న వేళ రాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. టీ-టీడీపీ మాజీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. శుక్రవారం ఎర్రవల్లిలోని సీఎం ఫామ్ హౌస్‌లో కాసానికి కండువా కప్పి సీఎం కేసీఆర్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నుండి వెళ్లిపోయిన ఈటల రాజేందర్ కంటే పెద్దమనిషి కాసాని మన పార్టీలోకి వచ్చారని అన్నారు. ఈటల బీఆర్ఎస్‌లో ముదిరాజ్‌లను ఎదగనివ్వలేదని మండిపడ్డారు. నామినేటేట్ పదవుల్లో ముదిరాజ్‌లకు పెద్ద పీట వేస్తామని ఈ సందర్భంగా కేసీఆర్ హామీ ఇచ్చారు.బీఆర్ఎస్‌లో ముదిరాజ్‌లకు ఎమ్మెల్సీ, రాజ్య సభ పదవులు దక్కుతాయని తెలిపారు. బండ ప్రకాష్ ముదిరాజ్‌ను తీసుకువచ్చి పదవి ఇచ్చామని కేసీఆర్ గుర్తు చేశారు. ముదిరాజ్‌లకు వృత్తి పరంగా న్యాయం జరిగిందన్నారు. ఎన్నికల తర్వాత ముదిరాజ్‌లతో సమావేశమవుతానని పేర్కొన్నారు. తెలంగాణలోని 119 అసెంబ్లీ స్థానాల్లో 112 మాత్రమే మన లెక్కలోకి వస్తాయని.. గెలవని చోట ముదిరాజ్‌ అభ్యర్థులను తమాషాకి నిలబెట్టవద్దన్నారు. కాగా, తెలంగాణ టీడీపీ చీఫ్‌గా కాసాని ఇటీవలే ఆ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయవద్దని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకోవడంతో కాసాని తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఈ నేపథ్యంలోనే టీడీపీకి గుడ్ బై చెప్పి ఇవాళ గులాబీ తీర్థం పుచ్చుకున్నారు.

* కేటీఆర్ గన్నేరు పప్పు అంటూ రేవంత్ రెడ్డి కౌంటర్

నేను కందిపప్పు అయితే… కేటీఆర్ గన్నేరు పప్పు అంటూ రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఆల్ ఇండియా పప్పు రాహుల్, తెలంగాణ పప్పు రేవంత్ రెడ్డి అని సెటైర్లు పేల్చారు మంత్రి KTR. నిన్న కాళేశ్వరంలో రాహుల్, రేవంత్ పర్యటన పై మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. అయితే కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు రేవంత్ రీ కౌంటర్ ఇచ్చారు.తెలంగాణ రాష్ట్ర చిహ్నంలోనే రాచరిక పోకడల గుర్తులు కనిపిస్తున్నాయని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో ప్రజల త్యాగాల గుర్తులు ఉండాలని చెప్పారు. రాష్ట్ర అధికారిక చిహ్నంలో పోరాటాల స్ఫూర్తి కనిపించడం లేదని తెలిపారు. తెలంగాణ కోసం ఎందరో యువకులు ప్రాణత్యాగం చేశారన్న రేవంత్ రెడ్డి.. ఈ పదేళ్లలో కేసీఆర్ ఏం చెప్పారు.. ఏం జరిగిందో ప్రజలు ఆలోచించాలని కోరారు. పేదల సంక్షేమం కోసం నిధులు ఉపయోగపడ్డాయో లేదో ప్రజలు ఆలోచించాలని సూచించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.

* రాజధాని నగరాన్ని కమ్మేసిన వాయు కాలుష్యం

దేశ రాజధాని నగరం ఢిల్లీని వాయు కాలుష్యం కమ్మేసింది. ఒక్క సారిగా వాయు నాణ్యత పడిపోవడంతో కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది. శుక్రవారం ఉద‌యం రాజధాని నగరంలోని చాలా ప్రాంతాలు పొగ‌తో క‌మ్ముకుపోయాయి. మరోవైపు వాయు కాలుష్యానికి చలి తోడవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం 8 గంటలు దాటినప్పటికీ నగరాన్ని పొగ చుట్టేయడంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇవాళ ఉదయం ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 346గా ఉన్నట్లు కాలుష్య నియంత్రణ బోర్డు తెలిపింది. లోధీ రోడ్‌, జ‌హంగిర్‌పురి, ఆర్కే పురం, ఐజీఐ ఎయిర్‌పోర్టులో వాయు నాణ్యత 438, 491, 486,473గా ఉన్నట్లు సీపీసీబీ వివరించింది. నగరాన్ని పొగ కమ్మేసిన డ్రోన్‌ విజువల్స్‌ను ప్రముఖ వార్తా సంస్థ ఏఎన్‌ఐ ట్విట్టర్‌లో పోస్టు చేసింది.

* MIM అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ రిలీజ్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఏఐఎంఐఎం 9 నియోజకవర్గాల్లో పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ ప్రకటించారు. తాజాగా ఆరు నియోజకవర్గాల్లో బరిలోకి దిగుతున్న అభ్యర్థుల పేర్లను ఆయన వెల్లడించారు. ఈసారి ఎన్నికల్లో రాజేంద్రనగర్‌, జూబ్లీహిల్స్‌ నుంచి కూడా ఎంఐఎం ప్రాతినిధ్యం వహిస్తుందని చెప్పారు.చంద్రాయణగుట్ట నుంచి అక్బరుద్దీన్‌ ఒవైసీ, నాంపల్లి నుంచి మాజిద్‌ హుస్సేన్‌, చార్మినార్ నుంచి మాజీ మేయర్ జుల్ఫికర్, యాకుత్పురా నుంచి జాఫర్ హుస్సేన్ మిరాజ్, మలక్‌పేట నుంచి అహ్మద్ బలాల, కార్వాన్‌ నుంచి కౌసర్‌ మొయినుద్దీన్‌ బరిలోకి దిగుతారని తెలిపారు. బహదూర్‌పురా, జూబ్లీహిల్స్‌, రాజేంద్రనగర్‌ నియోజకవర్గాల అభ్యర్థుల్ని త్వరలోనే ప్రకటిస్తామని, ఒకట్రెండు రోజుల్లో ప్రచారం ప్రారంభిస్తామని అసదుద్దీన్‌ ఒవైసీ తెలిపారు. ప్రజా సమస్యల్ని పరిష్కరించడంలో ఎంఐఎం ఎప్పుడూ ముందుంటుందని ఆయన అన్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z