డీయాక్టివేట్, రద్దు చేసుకున్న మొబైల్ నంబర్లను (Mobile) కనీసం 90 రోజుల తర్వాతే వేరొకరికి కేటాయిస్తామని టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ (TRAI) సుప్రీంకోర్టుకు తెలిపింది. వ్యక్తుల డేటా గోప్యతను దృష్టిలో పెట్టుకుని కొత్త వ్యక్తులకు నంబర్‌ను కేటాయించే విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది. రద్దైన, డీయాక్టివేట్ అయిన నంబర్ల విషయంలో సుప్రీంకోర్టులో దాఖలైన ఓ పిటిషన్‌పై ఈ మేరకు సమాధానం ఇచ్చింది.
చాలా మంది తమ ఫోన్ నంబర్లను వినియోగించకుండా వదిలేస్తుంటారు. దీంతో అవి కొన్నాళ్లకు డీయాక్టివేట్ అయిపోతాయి. మరికొందరు ఎక్కువ నంబర్లు ఉన్నప్పుడు నంబర్లను రద్దు చేసుకుంటూ ఉంటారు. ఇలా రద్దైన నంబర్లు కొన్నాళ్ల తర్వాత వేరొకరికి కేటాయిస్తారు. ఇలా చేయడం వల్ల ఆ నంబర్ వాడిన వ్యక్తి డేటా దుర్వినియోగానికి గురయ్యే అవకాశం ఉందంటూ 2021లో సుప్రీంకోర్టులో ఓ రిట్ పిటిషన్ దాఖలైంది. వాట్సప్ అకౌంట్ ఇన్ఫర్మేషన్ సహా వ్యక్తుల పర్సనల్ డేటా ప్రమాదంలో పడే అవకాశం ఉందని పిటిషనర్ పేర్కొన్నారు.ఫోన్ నంబర్ల రీసైక్లింగ్‌పై జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టితో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. దీనిపై ట్రాయ్ తన స్పందనను తెలియజేసింది. మునుపటి చందాదారుడి గోప్యతకు భంగం వాటిల్లకుండా ఉండేందుకే 90 రోజుల వ్యవధిని పాటిస్తున్నామని ట్రాయ్ తెలియజేసింది. సబ్‌స్క్రైబర్లు సైతం తమ వంతుగా వ్యక్తిగత సమాచారానికి సంబంధించి చర్యలు తీసుకోవాలని సూచించింది. వాట్సప్ సైతం తన స్పందనను కోర్టుకు తెలియజేసింది. ఇలాంటి సందర్భాల్లో డేటా దుర్వినియోగం కాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. అకౌంట్ ఇన్-యాక్టివిటీని తాము పరిశీలిస్తామని, ఒకవేళ 45 రోజుల కంటే ఎక్కువ రోజుల పాటు ఇన్-యాక్టివ్ మోడ్‌లో ఉండి.. ఆ తర్వాత కొత్త డివైజ్‌లో యాక్టివేట్ అయితే అందులోని డేటా మొత్తం ఆటోమేటిక్‌గా తొలిగిపోతుందని వాట్సప్ పేర్కొంది. దీనివల్ల వ్యక్తుల డేటా అక్రమార్కుల చేతిలో దుర్వినియోగం కాకుండా ఉంటుందని తెలిపింది.
👉 – Please join our whatsapp channel here –