అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్ (Stock Market) సూచీలు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:24 గంటల సమయంలో సెన్సెక్స్ (Sensex) 395 పాయింట్ల లాభంతో 64,759 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 121 పాయింట్ల లాభంతో 19,352 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.16 దగ్గర ప్రారంభమైంది. సెన్సెక్స్ 30 సూచీలో అన్ని షేర్లు లాభాల్లో ఉండడం విశేషం. యాక్సిస్ బ్యాంక్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఎంఅండ్‌ఎం, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఎల్‌అండ్‌టీ, ఐసీఐసీఐ బ్యాంక్, నెస్లే ఇండియా, హెచ్‌సీఎల్ టెక్, ఎన్‌టీపీసీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, విప్రో, పవర్‌గ్రిడ్ అత్యధికంగా లాభపడుతున్న షేర్ల జాబితాలో ఉన్నాయి.
ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్ల పెంపులకు విరామం ఇవ్వడంతో సెంటిమెంట్ బలపడింది. ఈ నేపథ్యంలో గతవారం అంతర్జాతీయ సూచీలన్నీ రాణించాయి. ఈ వారమూ ఆ జోరు కొనసాగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. త్రైమాసిక ఫలితాలతో షేరు ఆధారిత కదలికలు కొనసాగొచ్చని తెలిపారు. మంగళవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఆస్ట్రేలియా వడ్డీరేట్ల పెంపుపై నిర్ణయాన్ని ప్రకటించనుంది. నేడు ఆసియా- పసిఫిక్ సూచీలు సానుకూలంగా కదలాడుతున్నాయి. బ్యారెల్ బ్రెంట్ చమురు ధర స్వల్పంగా పెరిగి 85.20 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. విదేశీ సంస్థాగత మదుపర్లు (FII) శుక్రవారం రూ.12.43 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో దేశీయ సంస్థాగత మదుపర్లు (DII) రూ.402.69 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు ఫలితాలు ప్రకటించనున్న ప్రముఖ కంపెనీలు: దివీస్ లేబొరేటరీస్, హెచ్‌పీసీఎల్, గ్లాండ్ ఫార్మా, అదానీ ఎనర్జీ, ఎన్‌హెచ్‌పీసీ, భారత్ ఫోర్జ్, నైకా, ఇమామీ, ఎక్సైడ్ ఇండస్ట్రీస్, రాడికో ఖైతాన్, బజాజ్ ఎలక్ట్రికల్స్, జైడస్ వెల్‌నెస్, ఉజ్జీవన్ ఫైనాన్షియల్ సర్వీసెస్, దాల్మియా భారత్ షుగర్
గమనించాల్సిన స్టాక్స్..
ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్: ఇండిగో బ్రాండ్‌పై విమానయాన సేవలు అందిస్తున్న ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ సెప్టెంబరు త్రైమాసికంలో రూ.188.9 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. 2022-23 జులై-సెప్టెంబరులో రూ.1583.3 కోట్ల నష్టాన్ని కంపెనీ నమోదు చేయడం గమనార్హం. మొత్తం ఆదాయం సైతం రూ.12,852.3 కోట్ల నుంచి 20.6 శాతం వృద్ధితో రూ.15,502.9 కోట్లకు చేరింది.
వేదాంతా లిమిటెడ్: జులై- సెప్టెంబరులో వేదాంతా లిమిటెడ్ ఏకీకృత పద్ధతిలో రూ.1,783 కోట్ల నికర నష్టాన్ని చవిచూసింది. 2022-23లో ఇదే కాలంలో ఈ సంస్థ రూ.1,808 కోట్ల నికర లాభాన్ని నమోదుచేసింది. కొత్త పన్ను రేటు విధానాన్ని పాటించడం వల్ల ఒకేసారికి రూ.6,128 కోట్ల మేర పన్ను చెల్లించడం నష్టాలకు కారణమైందని కంపెనీ తెలిపింది.
సువెన్ లైఫ్ సైన్సెస్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో సువెన్ లైఫ్ సైన్సెస్ కన్సాలిడేటెడ్ ఖాతాల ప్రకారం రూ.8.20 కోట్ల మొత్తం ఆదాయాన్ని ఆర్జించింది. నికర నష్టం రూ.12.68 కోట్లుగా ఉంది.
ఎస్‌బీఐ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెప్టెంబరు త్రైమాసికంలో రూ.16,099.58 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. అంత క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాల లాభం రూ.14,752 కోట్లతో పోలిస్తే ఇది 9.13 శాతం అధికం. మొత్తం ఆదాయం రూ.88,733 కోట్ల నుంచి రూ.1.12 లక్షల కోట్లకు పెరిగింది.
అరవింద్ ఫ్యాషన్: అరవింద్ ఫ్యాషన్ సౌందర్య ఉత్పత్తుల వ్యాపారాన్ని రిలయన్స్ రిటైల్ కొనుగోలు చేయనుంది. లాల్‌భాయ్ కుటుంబానికి చెందిన సెఫోరా వ్యాపారం కూడా ఇందులో ఉంది. లావాదేవీ ప్రకారం.. అరవింద్ ఫ్యాషన్స్ లిమిటెడ్ నుంచి ఫ్రాన్స్ బ్యూటీ రిటైల్ బ్రాండ్ సెఫోరా 26 స్టోర్‌లను రిలయన్స్ రిటైల్ వెంచర్స్ అనుబంధ సంస్థ రిలయన్స్ బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ టేకోవర్ చేయనుంది.
👉 – Please join our whatsapp channel here –