DailyDose

అంబానీని బెదిరించింది తెలంగాణ యువకుడు

అంబానీని బెదిరించింది తెలంగాణ యువకుడు

అడిగినంత డబ్బు ఇవ్వాలంటూ ప్రముఖ వ్యాపార దిగ్గజం, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేశ్‌ అంబానీకి ఇటీవల బెదిరింపు లేఖలు పంపింది తెలంగాణకు చెందిన విద్యార్థే అని ముంబయి పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. దీంతో శనివారం నిందితుడిని అరెస్టు చేసి ముంబయికి తీసుకెళ్లారు. వ్యాపారవేత్త ముఖేశ్‌ అంబానీకి ఇటీవల ఈ-మెయిల్‌ ద్వారా వరుసగా బెదిరింపు లేఖలు వచ్చిన విషయం తెలిసిందే. రూ.400 కోట్ల వరకు ఇవ్వకపోతే అంతుచూస్తామని ఆ లేఖల్లో హెచ్చరించారు. ఈ విషయమై ముఖేశ్‌ సెక్యూరిటీ ఇన్‌ఛార్జి ఫిర్యాదు మేరకు ముంబయి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అయితే, వరంగల్‌లోని ఓ కళాశాలలో ఇంజినీరింగ్‌ రెండో సంవత్సరం చదువుతున్న వనపర్ది గణేశ్‌ రమేశ్‌(19)తోపాటు గుజరాత్‌కు చెందిన మరో యువకుడు వేర్వేరు ఐడీలతో మెయిల్‌లో బెదిరింపు లేఖలు పంపినట్టు పోలీసులు ఐపీ అడ్రస్‌ ఆధారంగా గుర్తించారు. లేఖలను షాదాబ్‌ ఖాన్‌ అనే పేరుతో మెయిల్‌లో పంపినట్టు సమాచారం.

ఈ మేరకు ముంబయికి చెందిన స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసులు శనివారం తెల్లవారుజామున వరంగల్‌కు వచ్చారు. స్థానిక హసన్‌పర్తి పోలీసుల సహకారంతో వారు గణేశ్‌ ఉంటున్న వసతి గృహానికి వెళ్లి అరెస్టు చేశారు. అతడిని కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం ఈ నెల 8వ తేదీ వరకు పోలీసు కస్టడీకి అప్పగించింది. గణేశ్‌ స్వస్థలం పెద్దపల్లి జిల్లా కేంద్రంగా తెలిసింది. అయితే, గణేశ్‌కు, గుజరాత్‌లో ఉండే యువకుడు ఎలా పరిచయమయ్యాడు? ఇద్దరు కలిసే లేఖలు పంపారా? వేర్వేరు గానా? అన్న అంశాలపై స్పష్టత రాలేదు. దీనిపై మరింత దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. గణేశ్‌ను మరింత విచారిస్తే అసలు విషయం వెలుగుచూసే అవకాశముంది

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z