రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తే తెదేపా కోవర్టు అంటారా అని భాజపా రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురందేశ్వరి మండిపడ్డారు. శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో సోమవారం నిర్వహించిన జిల్లా స్థాయి పార్టీ బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్ర ఇన్‌ఛార్జుల సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించకూడదా? అలాచేస్తే ప్రతిపక్షాల గొంతు నొక్కుతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మద్యం అక్రమాలపై కేంద్ర హోంమంత్రికి ఫిర్యాదు చేశానని చెప్పారు. రాష్ట్రంలో కేంద్ర నిధులతో నూతన జాతీయ రహదారులను నిర్మిస్తున్నారని, ఆ పనులను కూడా తామే చేస్తున్నట్లు రాష్ట్ర పాలకులు చెప్పడం సిగ్గుచేటన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు వైకాపా ప్రభుత్వం స్టిక్కర్లు వేసుకుని, పాలన కొనసాగిస్తోందని విమర్శించారు. నిరుపేదలకు 18 లక్షల ఇళ్లు కేటాయిస్తే ఎన్ని నిర్మించారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో భాజపా, జనసేన మధ్య పొత్తు కొనసాగుతుందని చెప్పారు. దానిపై పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని, పొత్తు లేకుంటే 175 స్థానాలకు భాజపా అభ్యర్థులు బరిలో ఉంటారని పేర్కొన్నారు.
👉 – Please join our whatsapp channel here –