Health

హైబీపీ ఉంటే ఈ ఔషధంతో జాగ్రత్త

హైబీపీ ఉంటే ఈ ఔషధంతో జాగ్రత్త

అధిక రక్తపోటు (హైబీపీ) ఉందా? చీటికీ మాటికీ నొప్పి మందులు కూడా వాడుతున్నారా? అయితే కాస్త జాగ్రత్త. ఐబూప్రొఫెన్‌, డైక్లోఫెనాక్‌ సోడియం వంటి కొన్నిరకాల నాన్‌స్టిరాయిడల్‌ యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ మందులు (ఎన్‌ఎస్‌ఏఐడీలు) రక్తపోటు పెరిగేలా చేస్తాయి. కొన్నిసార్లు ఇది ప్రమాదకరంగానూ పరిణమించొచ్చు. రక్తపోటు పెరిగినా పైకి ఎలాంటి లక్షణాలూ కనిపించవు కాబట్టి జాగ్రత్త అవసరం. అనవసరంగా, డాక్టర్ల సలహా లేకుండా నొప్పి మందులు వాడితే తమకు తామే హాని తలపెట్టుకున్నట్టే.

ఇలా నొప్పి అనగానే అలా మాత్ర వేసుకోవటం మనదగ్గర చాలామందికి అలవాటే. డాక్టర్‌ సలహా లేకుండానే మందుల దుకాణాలకు వెళ్లి కొనుక్కొని, మింగేస్తుంటారు. డాక్టర్‌ చీటీ లేకుండా దుకాణాల్లో అమ్మే మందులన్నీ సురక్షితమైనవనే భావిస్తుంటారు. కానీ నొప్పి మందులతో ఛాతీ మంట, కడుపు నొప్పి, జీర్ణాశయంలో పుండ్ల వంటి రకరకాల దుష్ప్రభావాలు తలెత్తుతాయి. ఎవరైనా సరే చీటికీ మాటికీ నొప్పి మందులను వాడటం తగదు. అధిక రక్తపోటు గలవారికైతే ఇది మరింత ముఖ్యం. నొప్పి మందులు రక్తపోటును పెంచే ప్రమాదముంది. హైబీపీ గలవారు రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవటా చాలా కీలకం. లేకపోతే పక్షవాతం, గుండెపోటు వంటి తీవ్ర అనర్థాలకు దారితీస్తుంది. కాబట్టి నొప్పి మందుల అనర్థాల గురించి, వీటిని సక్రమంగా వాడే తీరు గురించి తెలుసుకొని మసలుకోవాలి.

నొప్పి మందులెలా పనిచేస్తాయి?
ఆశ్చర్యంగా అనిపించినా నొప్పులన్నీ మెదడులోనే ఉంటాయి. ఆయా భాగాల్లోని నాడుల నుంచి మెదడుకు అందే విద్యుత్తు సంకేతాలతోనే మనకు నొప్పి భావన కలుగుతుంది. అలాగని మొత్తమంతా విద్యుత్తు సంకేతాల ప్రక్రియేమీ కాదు. కణజాలం దెబ్బతినప్పుడు.. ఉదాహరణకు- మడమ బెణికినప్పుడు అక్కడి కణాలు కొన్ని రసాయనాలను విడుదల చేస్తాయి. ఇవి వాపును ప్రేరేపించి, నాడుల నుంచి మెదడుకు మరింత ఎక్కువగా విద్యుత్తు సంకేతాలు వెళ్లేలా పురికొల్పుతాయి. దీంతో నొప్పి భావనా పెరుగుతుంది. కణాలు విడుదల చేసే రసాయనాల ప్రభావాలను నొప్పి మందులు నిలువరిస్తాయి. ఇలా నొప్పి తగ్గిన భావన కలిగిస్తాయి. అయితే చిక్కేంటంటే- ఈ మందులు నొప్పి ఉన్నచోటుకే పరిమితం కావు. శరీరమంతా ప్రయాణిస్తాయి. ఇదే కొన్ని దుష్ప్రభావాలకు కారణమవుతుంది.

హైబీపీ గలవారికి ముప్పెందుకు?
కొన్నిరకాల నొప్పి మందులు కిడ్నీలకు రక్త సరఫరా తగ్గేలా చేస్తాయి. దీంతో కిడ్నీల్లో రక్తం శుద్ధి చేసే ప్రక్రియ నెమ్మదిస్తుంది. ఫలితంగా శరీరంలో ద్రవాల మోతాదు పెరిగి, రక్తపోటు ఎక్కువయ్యేలా చేస్తుంది. మరోవైపు ఎన్‌ఎస్‌ఏఐడీ రకం నొప్పి మందులను తరచూ వేసుకుంటున్నా, అధిక మోతాదులో తీసుకున్నా కిడ్నీలు చెడిపోయే ప్రమాదమూ ఉంది. కాబట్టి నొప్పి మందుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. డాక్టర్‌ సలహా లేకుండా ఎక్కువ రోజులు వీటిని వాడటం తగదు. అంతగా అవసరమైతే డాక్టర్లు అసిటమెనోఫెన్‌ వంటి సురక్షితమైన మందులను సూచిస్తారు.

మరి నొప్పి తగ్గేదెలా?
నొప్పులు, బాధలకు కేవలం మందులే పరిష్కారం కాదు. ఇతరత్రా సురక్షిత, సమర్థ ప్రత్యామ్నాయాలు లేకపోలేదు. నొప్పి నుంచి ఉపశమనం పొందటానికి మాత్రల కన్నా ముందు ఇలాంటి పద్ధతులను పాటించి చూడొచ్చు.
ఐస్‌ ప్యాక్‌: మడమ బెణకటం వంటి తక్షణ గాయాలకు ఐస్‌ ప్యాక్‌ బాగా ఉపయోగపడుతుంది. నొప్పి ఉన్నచోట ఐస్‌ ముక్కలను అద్దితే వాపు, నొప్పి తగ్గుతాయి.

వేడి కాపు: దీర్ఘకాలంగా వేధించే నొప్పులకు వేడి కాపు మేలు చేస్తుంది. వేడి నీటిలో తువ్వాలును ముంచి పిండి, నొప్పి ఉన్నచోట అద్దితే మంచి ప్రయోజనం కనిపిస్తుంది.

వ్యాయామం: కీళ్ల నొప్పుల వంటి కొన్నిరకాల నొప్పులకు వ్యాయామం ఉపయోగపడుతుంది. ఇది కీళ్లు తేలికగా కదలటానికి తోడ్పడుతుంది.

విశ్రాంతి: యోగా, ధ్యానం వంటివీ నొప్పి తగ్గటానికి తోడ్పడతాయి. ముఖ్యంగా మానసిక ఒత్తిడితో వచ్చే తలనొప్పి వంటి వాటికివి మేలు చేస్తాయి.

ఇతర పద్ధతులు: ఆక్యూపంక్చర్‌ వంటి ఇతరత్రా పద్ధతులతోనూ కొందరికి నొప్పి తగ్గొచ్చు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z