Politics

జగన్‌కు గంటా శ్రీనివాసరావు బహిరంగ లేఖ

జగన్‌కు గంటా శ్రీనివాసరావు బహిరంగ లేఖ

నిన్నటి వరకు ‘మా నమ్మకం నువ్వే జగన్‌’ అని అన్న ప్రజలు ఇవాళ ‘నిన్ను నమ్మం జగన్‌’ అని అంటున్నారని తెదేపా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. ఈ రాష్ట్రానికి జగన్‌ ఎందుకు వద్దో చెప్పడానికి సవాలక్ష కారణాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ మేరకు సీఎం జగన్‌కు ట్విటర్‌ వేదికగా 20 ప్రశ్నలతో కూడిన బహిరంగ లేఖ రాశారు. ‘‘గడపగడపకూ వైకాపా అన్నారు. గడపగడపలో అవమానంతో వెనుదిరిగారు. ఇప్పుడు ‘వై ఏపీ నీడ్స్‌ జగన్‌’ అనే కొత్త పల్లవి అందుకున్నారు. ప్రజలు ‘ఏపీ హేట్స్‌ జగన్‌’ అనే స్వరం అందుకున్నారు. ‘వద్దు వద్దు ఈ జగన్.. మళ్లీ మాకొద్దు ఈ జగన్’ అనే నినాదంతో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రాన్ని మీ మూర్ఖపు పాలనతో అధోగతిపాలు చేసి.. అగమ్యగోచరంలోకి నెట్టేసినందుకా.. ఈ రాష్ట్రానికి మీరు అవసరం..? నవరత్నాలు నవమోసాలుగా చేసి ఏ ఒక్క రత్నాన్ని కూడా సక్రమంగా అమలు చేయనందుకా ఈ రాష్ట్రానికి మీరు అవసరం? ఈ 20 ప్రశ్నలకు జగన్‌ రెడ్డి, మంత్రులు, సలహాదారులు.. మీలో ఎవరైనా సమాధానం చెప్పగలరా?’’ అని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు.

ఇందుకేనా ఏపీ నీడ్స్‌ జగన్‌..
1. రైతు భరోసా: రూ.50వేలు ఇస్తానని హామీ ఇచ్చి రూ.37,500కు కుదించారు. రైతు రుణమాఫీ, అన్నదాత సుఖీభవ, డ్రిప్ ఇరిగేషన్ వంటి పథకాలు రద్దు చేసి రూ.2 లక్షలు నష్టం చేసినందుకా వై ఏపీ నీడ్స్ జగన్?

2. అమ్మఒడి: అమ్మఒడికి రూ.13వేలు ఇచ్చి నాన్న బుడ్డీలో రూ.70 వేలు కొట్టేస్తున్నారు. MTF, RTF స్కాలర్ షిప్స్, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ వంటి పథకాలను రద్దు చేసినందుకా వై ఏపీ నీడ్స్ జగన్…?

3.పెన్షన్లు: చంద్రన్న రూ.1800 పెంచగా.. జగన్ రెడ్డి రూ.750 ఇచ్చారు. అధికారంలోకి వస్తే రూ.3 వేల పెన్షన్ హామీపై మాట తప్పారు. ఏటా పెంపు హామీపై మడమ తిప్పినందుకా వై ఏపీ నీడ్స్ జగన్…?

4. పేదలందరికీ ఇళ్లు : సెంటు పట్టా పేరుతో పేదల్ని అప్పుల పాల్జేశారు. భూమి కొనుగోలులో రూ.7 వేల కోట్లు వైకాపా నేతలు మింగేశారు. ఓటీఎస్ పేరుతో ఒక్కొక్కరి నుంచి రూ.10వేల నుంచి రూ.40 వేల చొప్పున బలవంతంగా వసూల్ చేసినందుకా వై ఏపీ నీడ్స్ జగన్…?

5. ఫీజు రీయింబర్స్‌మెంట్‌: చంద్రన్న 16 లక్షల మందికి ఇచ్చారు. జగన్ రెడ్డి 7 లక్షల మందికి కోత కోసి 9 లక్షల మందికే ఇస్తున్నారు. చంద్రన్న ఒకే విడతలో ఇస్తే.. జగన్ రెడ్డి నాలుగు విడతలతో మోసం చేసినందుకా వై ఏపీ నీడ్స్ జగన్…?

6. మద్య నిషేధం: రూ.2 లక్షల కోట్లకు పైగా మద్యం అమ్మి పేదలను కొల్లగొట్టారు. రూ.లక్ష కోట్లు కమిషన్లుగా దండుకున్నారు. మద్య నిషేధంపై మాట తప్పి మహిళల మాంగళ్యాలను తెంచుతున్నందుకా వై ఏపీ నీడ్స్ జగన్…?

7. జలయజ్ఞం: కృష్ణా గోదావరి జలాలపై హక్కుల్ని కేంద్రానికి, తుంగభద్రపై హక్కుల్ని కర్ణాటకకు తాకట్టు పెట్టారు. రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరాన్ని దెబ్బతీసి నదుల అనుసంధానానికి గండికొట్టారు. రాష్ట్రాన్ని కరవు రక్కసికి బలిపెట్టారు. ఈ ఏడాది 34 లక్షల ఎకరాల్లో సాగు తగ్గిపోయినందుకా చేసినందుకా వై ఏపీ నీడ్స్ జగన్…?

8. ఆరోగ్యశ్రీ: రూ.1400 కోట్లకు పైగా బకాయిలు పెట్టడంతో ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేసేందుకు నెట్ వర్క్ ఆస్పత్రులు నిరాకరిస్తున్నాయి. 104, 108 అంబులెన్సులు అక్కరకు రాని చుట్టాలైనందుకా వై ఏపీ నీడ్స్ జగన్…?

9. ఆసరా: ఆసరా కింద మొండి బకాయిలున్న 25% మందికే లబ్ధి. సకాలం 75% మందికి జగన్ రెడ్డి టోకరా వేశారు. చంద్రన్న పాలనలో డ్వాక్రా రుణమాఫీ, పసుపు కుంకుమ ద్వారా ఒక్కో మహిళకు రూ.20 వేల వరకు లబ్ధి పొందారు. 45 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు పెన్షన్ ఇచ్చి ఉంటే రూ.1.80 లక్షల చొప్పున లబ్ది కలిగేది. హామీకి తిలోదకాలిచ్చి రూ.75వేలు అంటూ ఒక్కో మహిళకు రూ.1.05 లక్షలు ఎగ్గొట్టినందుకా వై ఏపీ నీడ్స్ జగన్…?

10. ల్యాండ్, శాండ్, వైన్, మైన్, డ్రగ్స్, గంజాయి, ఎర్రచందనం దోపిడీ చేసి రూ.3.5 లక్షల కోట్లు కొల్లగొట్టి.. పేదవాడికి పెత్తందారులకు మధ్య జరిగే యుద్ధమే అంటున్న మీరు.. దేశంలోని ముఖ్యమంత్రులు అందరికంటే ధనవంతుడైనందుకా వై ఏపీ నీడ్స్ జగన్…?

11. ప్రశ్నించిన పౌరులు, మీడియా, ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు, జైలు నిర్బంధాలు, హత్యలు, రాజ్యాంగ హక్కులు కాలరాస్తూ టెర్రిస్టు పాలన చేస్తూ.. ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా చేసి రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేసినందుకా వై ఏపీ నీడ్స్ జగన్…?

12. రైతు రుణమాఫీ, అన్నదాత సుఖీభవ ద్వారా చంద్రబాబు గారి పాలనలో ఒక్కో రైతు రూ.1,15,000 లబ్ధి పొందగా.. వాటిని రద్దు చేసి రైతు భరోసా పేరుతో రూ.37,500 ఇచ్చి దగా చేసినందుకా… ఎక్కువ అప్పులున్న రైతు కుటుంబాల్లో ఏపీ దేశంలో మొదటి స్థానంలో ఉంది. ఒక్కో రైతు కుటుంబంపై సగటున రూ.2,45,554 అప్పు ఉన్నట్లు జాతీయ గణాంక సర్వేలో ఏపీని మొదటి స్థానంలో నిలిపినందుకా.. రైతు ఆత్మహత్యల్లో ఏపీ దేశంలో 3వ స్థానంలో, కౌలు రైతుల ఆత్మహత్యల్లో 2వ స్థానంలో ఉందని NCRP రిపోర్టులో తేలినందుకా వై ఏపీ నీడ్స్ జగన్…?

13. ధరలు, పన్నులు, ఛార్జీలు, అప్పుల బాదుడుతో ఈ నాలుగేళ్ల ఎనిమిది నెలల పాలనలో ఒక్కో కుటుంబంపై రూ.8,25,549/- అదనపు భారం మోపినందుకా వై ఏపీ నీడ్స్ జగన్…?

14. ఉచిత ఇసుక విధానం రద్దు చేసి, నాలుగు రెట్లు ఇసుక రేట్లు పెంచి, భవన నిర్మాణ రంగాన్ని కుప్పకూల్చి 125 వృత్తులు, వ్యాపారాల్ని దెబ్బతీశారు. 30 లక్షల భవన నిర్మాణ కార్మికులు ఉపాధిని పోగొట్టినందుకా వై ఏపీ నీడ్స్ జగన్…?

15. ప్రత్యేక హోదా ను.. విశాఖ రైల్వే జోన్ ను.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను కేసులు భయంతో కేంద్ర వద్ద రాష్ట్రాన్నీ తాకట్టు పెట్టినందుకా వై ఏపీ నీడ్స్ జగన్…?

16.అన్న క్యాంటీన్లు, పసుపు-కుంకుమ, నిరుద్యోగ భృతి, చంద్రన్న భీమా, పండుగ కానుకలు లాంటి 120 పైగా సంక్షేమ పథకాలు రద్దు చేసి పేదోడి పొట్ట కొట్టినందుకా వై ఏపీ నీడ్స్ జగన్…?

17. 8 సార్లు కరెంటు ఛార్జీలు పెంచారు. 4 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచారు. ప్రతి సంవత్సరం 15% ఆస్థి పన్ను పెంచుకుంటూ పోతూ పేదోడి నడ్డి విరిచినందుకా వై ఏపీ నీడ్స్ జగన్…?

18. 2.30 లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తానని మాట తప్పి యువతకు ఉద్యోగ కల్పన చేయకుండా, ప్రతి ఏడాదీ జాబ్ క్యాలెండరని నమ్మించి.. ఆశతో ఎదురు చూపులు చూసి యువత విసిగి ఉద్యోగాల కోసం పక్క రాష్ట్రాలకు వలస వెళ్లేలా చేసినందుకా వై ఏపీ నీడ్స్ జగన్…?

19. చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందాలు చేసుకున్న సంస్థల్ని వెంటాడి వేధించి రాష్ట్రం నుంచి తరిమేసి మీ రివర్స్ పాలనతో రాష్ట్రాన్ని నాశనం చేసినందుకా వై ఏపీ నీడ్స్ జగన్…?

20. తన దోపిడీని ఎదుటి వారికి అంటగట్టి చెప్పిన అబద్దమే వంద సార్లు చెప్పడం తన నైజంగా మార్చుకున్నాడు జగన్మోహన్ రెడ్డి.. తాను 16 నెలలు జైలులో ఉన్నాడు కాబట్టి… లేని కేసులో చంద్రబాబును జైల్లో పెట్టి పైశాచికానందం పొందినందుకా వై ఏపీ నీడ్స్ జగన్…?

ఈ రాష్ట్రానికి మీరు వద్దని చెప్పడానికి ఇంకా సవాలక్ష కారణాలు ఉన్నాయని, మీరు ఈ రాష్ట్రానికి అవసరం లేదనడానికి ఇంతకంటే ఏం రుజువులు కావాలి జగన్మోహన్ రెడ్డి గారు అని గంటా శ్రీనివాసరావు ప్రశ్నించారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z