DailyDose

కడప జిల్లాలో ముగిసిన జగన్ పర్యటన-తాజా వార్తలు

కడప జిల్లాలో ముగిసిన జగన్ పర్యటన-తాజా వార్తలు

* కడప జిల్లాలో ముగిసిన జగన్ పర్యటన

సీఎం వైఎస్ జగన్ కడప జిల్లాలో రెండు రోజుల పర్యటన ముగిసింది. వైఎస్ఆర్ కడప జిల్లా పర్యటనలో భాగంగా శుక్రవారం ఇడుపులపాయలో పర్యటించారు. రూ.1.75 కోట్లతో నిర్మించిన ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ పోలీస్ స్టేషన్, రూ.2.75 కోట్లతో నిర్మించిన జమ్మలమడుగు పోలీస్ స్టేషన్లను ప్రారంభించారు. అనంతరం అర్జీదారుల నుంచి అర్జీలను జగన్ స్వీకరించారు. అనంతరం అక్కడ నుంచి ఎకో పార్కు వద్దకు చేరుకుని అక్కడ వేముల మండల నాయకులు, ప్రజలతో సమావేశమయ్యారు.

* చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా

స్కిల్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ మరోసారి వాయిదా పడింది. ఈనెల 15కు విచారణ వాయిదా వేసింది. ఇప్పటికే ఈ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు మధ్యంతర బెయిల్‌పై బయట ఉన్న సంగతి తెలిసిందే. అయితే రెగ్యులర్ బెయిల్ కోసం చంద్రబాబు నాయుడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్‌పై ఇప్పటికే విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం నేడు విచారణను వాయిదా వేసింది. అయితే నేడు చంద్రబాబు రెగ్యులర్ బెయిల్‌ పిటిషన్‌ విచారణ జరగాల్సి ఉండగా ఈ విచారణకు అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి హాజరుకాలేదు. ఏఏజీ నేటి విచారణకు హాజరుకాలేకపోతున్నారని సీఐడీ ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ వివేకానంద హైకోర్టుకు తెలియజేశారు. వాదనలు వినిపించేందుకు తమకు మరింత సమయం కావాలని కోర్టును కోరారు. సీఐడీ ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ వివేకానంద విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న ఏపీ హైకోర్టు తదుపరి విచారణను ఈనెల 15కు వాయిదా వేసింది. ఇకపోతే ఇదే స్కిల్ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారందరికీ న్యాయస్థానాలు బెయిల్ మంజూరు చేశాయి.ఇటీవల సిమెన్స్ సీనియర్ డైరెక్టర్ భాస్కర్‌కు గతంలో ఇచ్చిన మధ్యంతర ముందస్తు బెయిల్‌ను సుప్రీంకోర్టు పూర్తిస్థాయి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఇదే కేసులో చంద్రబాబుకు బెయిల్‌ దక్కకపోవడంపై ఉత్కంఠ నెలకొంది. ఇదిలా ఉంటే స్కిల్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. దీపావళి సెలవులు తరువాత తీర్పు వెల్లడిస్తామని ఇప్పటికే సుప్రీంకోర్టు ద్విసభ్యధర్మాసనం వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్‌పై తీర్పు వెల్లడైన తర్వాత హైకోర్టు కూడా తీర్పు వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

* పొంగులేటి నివాసంలో ముగిసిన ఐటీ సోదాలు

జూబ్లీహిల్స్‌లోని పొంగులేటి నివాసంలో ముగిసిన ఐటీ సోదాలు,పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్న అధికారులు,రెండు బృందాలుగా ఏర్పడి సోదాలు చేసిన ఐటీ అధికారులు,జూబ్లీహిల్స్‌లోని పొంగులేటి నివాసం నుంచి వెళ్లిపోయిన ఐటీ అధికారులు.

* టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న అఫ్గానిస్థాన్‌‌

ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో దక్షిణాఫ్రికా, అఫ్గానిస్థాన్‌‌ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి అఫ్గానిస్థాన్‌‌ కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. గత మ్యాచ్‌లో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగుతున్నామని హష్మతుల్లా తెలిపాడు. ఈ మ్యాచ్‌ కోసం దక్షిణాఫ్రికారెండు మార్పులు చేసింది. తబ్రేజ్‌ షంషి, మార్కో జన్సెన్‌లకు విశ్రాంతినిచ్చి.. వారి స్థానంలో ఆండిలే ఫెహ్లుక్వాయో, గెరాల్డ్ కోయెట్జీలను తుది జట్టులోకి తీసుకుంది.అఫ్గానిస్థాన్‌‌ సెమీస్‌ చేరాలంటే ఈ మ్యాచ్‌లో 438 పరుగుల భారీ తేడాతో గెలవాల్సి ఉంది. అఫ్గాన్లకు ఇది స్థాయికి మించిన పనే. గత మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై గెలవాల్సిన మ్యాచ్‌లో ఓడటంతో అఫ్గానిస్థాన్‌‌కు ఈ దుస్థితి ఏర్పడింది. అయితే ఆస్ట్రేలియాకు మాత్రం చెమటలు పట్టించింది. ఆస్ట్రేలియా మాదిరే దక్షిణాఫ్రికాను ఆటాడుకునే అవకాశం ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో. దక్షిణాఫ్రికా సెమీస్ బెర్త్ దక్కించుకున్న విషయం తెలిసిందే.

* కాంగ్రెస్‌కు ప్రజల మీద ప్రేమ తక్కువ

తెలంగాణలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అధికార పార్టీ ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పిస్తుంటే.. ప్రతిపక్షాలు మాత్రం అధికార పార్టీ వైఫల్యాలనే అస్త్రాలుగా మలుచుకుని ప్రచారం చేస్తున్నాయి. ముఖ్యంగా అధికార బీఆర్ఎస్ కాంగ్రెస్​పై తీవ్ర విమర్శలు చేస్తోంది. 50 ఏళ్లలో కాంగ్రెస్ దేశానికి చేసిందేం లేదని.. స్కామ్​లు చేయడం తప్ప.. సంక్షేమం ఆ పార్టీకి పట్టదని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి విమర్శించారు.సిద్దిపేటలో పర్యటించిన హరీశ్ రావు కాంగ్రెస్​పై తీవ్ర విమర్శలు చేశారు. అబద్ధాలతో హస్తం పార్టీ అధికారంలోకి రావాలని చూస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్‌కు ప్రజల మీద ప్రేమ తక్కువ.. అధికారం మీద యావ ఎక్కువ అని పేర్కొన్నారు. ఆ పార్టీకి అధికారం ఇస్తే 10 ఏళ్లు వెనక్కి పోతామని తెలిపారు. సిద్దిపేటలో మంత్రి హరీశ్ రావు సమక్షంలో పలువురు నేతలు బీఆర్ఎస్ పార్టీలోకి చేరారు.అంతకుముందు హరీశ్ రావు కాన్వాయ్​ను పోలీసులు తనిఖీ చేశారు. ఎన్నికల విధుల్లో భాగంగా బేగంపేట్‌ రహదారిపై హరీశ్‌ రావు కాన్వాయ్​లో పోలీసులు సోదాలు నిర్వహించారు. తనిఖీలకు సహకరించినందుకు పోలీసులు మంత్రికి ధన్యవాదాలు తెలిపారు.

* జగన్ కు తప్పిన ప్రమాదం

ఏపీ సీఎం జగన్ కు తప్పిన ప్రమాదం. ఇడుపులపాయలో సీఎం వాహనానికి స్వల్ప ప్రమాదం జరిగింది. సీఎం జగన్ వాహనాన్ని వెనుక నుండి మరో కాన్వాయ్ ఢీ కొట్టింది. దీంతో సీఎం జగన్ వాహనం దిగి మరో కారులో ఇడుపులపాయకు వెళ్లారు. ఇవాళ ఉమ్మడి కడప జిల్లా పర్యటనలో భాగంగా ఇడుపులపాయలో సీఎం జగన్ పర్యటిస్తున్న విషయం తెలిసిందే.

* కారు నడిపిన కవిత

బీఆర్ఎస్ ఎమ్మెల్యే నామినేషన్ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత కారు నడిపి సందడి చేశారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ మద్దతుగా నామినేషన్ వేయడానికి వచ్చిన కవిత కొంత దూరం గులాబీ రంగు అంబాసిడర్ కారు నడిపారు. కాగా ప్రస్తుతం కవిత అంబాసిడర్ కారు నడిపిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. నిజామాబాద్ అర్బన్ స్థానంలో బీజేపీ నుంచి ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా, కాంగ్రెస్ నుంచి షబ్బీర్ అలీ పోటీ చేస్తున్నారు. ఇక, నిన్న మంత్రి కేటీఆర్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి మద్దతుగా నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిజామాబాద్ రూరల్ అభ్యర్థి దినేష్ కులాచారి తరపున ఈ రోజు ఈటల రాజేందర్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

* సూర్య కుమార్ యాదవ్ కు అదిరిపోయే గిఫ్ట్‌

సూర్య కుమార్ యాదవ్ కు అదిరిపోయే గిఫ్ట్‌ ఇవ్వనుంది బీసీసీఐ. ప్రతిష్టాత్మక వన్డే ప్రపంచ కప్ అనంతరం భారత జట్టు స్వదేశంలో ఆస్ట్రేలియాతో ఆడనున్న టి20 సిరీస్ కు సూర్య కుమార్ యాదవ్, ఋతురాజ్ గైక్వాడ్ లో ఒకరు టీం ఇండియాకు సారథ్యం వహించనున్నారు. వరల్డ్ కప్ తర్వాత ఆసీస్ తో భారత జట్టు 5 మ్యాచ్ల టి20 సిరీస్ ఆడనుండగా… దానికి సూర్యకుమార్, ఋతురాజ్ లో ఒకరు టీం ఇండియాకు నాయకత్వం వహించనున్నారు.ఈ నెల 23 నుంచి ప్రారంభం కానున్న ఈ సిరీస్ కు స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా అందుబాటులో ఉండేది అనుమానంగా మారడంతో ఈ ఇద్దరిలో ఒకరికి సారధ్య బాధ్యతలు అప్పగించాలని టీం మేనేజ్మెంట్ యోచిస్తున్నది. వచ్చే నెలలో దక్షిణాఫ్రికాతో టి20 సిరీస్ ఆడాల్సి ఉన్న నేపథ్యంలో పాండ్యాకు మరింత విశ్రాంతి అవసరం అని బోర్డు భావిస్తున్నది. అయితే.. ఎక్కువ శాతం సూర్య కుమార్‌ యాదవ్‌ కే కెప్టెన్సీ బాధ్యతలు రానున్నట్లు సమాచారం అందుతోంది.

* టికెట్ రాని నేతలకు కేసీ వేణుగోపాల్ ఫోన్

తెలంగాణ కాంగ్రెస్ లో అసంతతృప్తుల బుజ్జగింపులు దాదాపు కొలిక్కి వచ్చినట్లు కనిపిస్తున్నాయి. పార్టీ నుంచి టికెట్ ఆశించిన భంగపడ్డ 20 మంది నేతలతో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఫోన్ చేసి మాట్లడుతున్నారు. ఇక, ఏఐసీసీ నేత కేసీ వేణుగోపాల్ ఫోన్ చేసిన వారిలో ఎన్‌ఎస్‌యూఐ స్టేట్ ప్రెసిడెంట్ బల్మూరీ వెంకట్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి, బలరాం నాయక్, బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పారిజాత నరసింహారెడ్డితో సహా 20 మందికి కేసీ వేణుగోపాల్ కీలక హామీ ఇచ్చారు. టికెట్ రాలేదని మీరు అధైర్య పడొద్దు.. తెలంగాణలో పూర్తి మెజార్టీతో ప్రభుత్వం రాబోతోందని ఆయన వెల్లడించారు.అయితే, టికెట్ రాని వారు ఎవరిని చూసి ఇబ్బంది పడొద్దని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అన్నారు. ప్రభుత్వంలో టికెట్ రాని నేతలు కూడా భాగస్వామ్యం అవుతారని ఆయన చెప్పుకొచ్చారు. మీ అందరి రాజకీయ భవిష్యత్తుకు బాధ్యత నాదే అని కేసీ వేణుగోపాల్ భరోసా ఇచ్చారని తెలుస్తుంది. మరోవైపు తుంగతుర్తి టికెట్ ఆశించిన కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ కూడా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉన్నానని తాజాగా ఓ వీడియోను రిలీజ్ చేశారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z