సీనియర్ నటుడు చంద్రమోహన్ (Chandramohan) మరణంతో చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతికి సంతాపం ప్రకటిస్తూ పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతున్నారు.
‘‘ప్రముఖ తెలుగు సినీనటుడు చంద్రమోహన్ పరమపదించారని తెలిసి ఎంతో విచారించా. నాటి చిత్రాలు మొదలుకొని నిన్న మొన్నటి చిత్రాల వరకూ నటుడిగా వారి ప్రాధాన్యత ఎనలేనిది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నా’’ – మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
‘‘ప్రముఖ నటుడు చంద్రమోహన్ గారు అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూయడం బాధాకరం. తొలి సినిమాకే నంది అవార్డును గెలుచుకున్న ఆయన తెలుగు, తమిళ భాషల్లో వందలాది సినిమాల్లో నటించి తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ – ఏపీ ముఖ్యమంత్రి జగన్
‘‘ఎన్నో దశాబ్దాలుగా చిత్రాల్లో విభిన్నమైన పాత్రలు పోషించి, తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న చంద్రమోహన్ గారి అకాల మరణం బాధాకరం. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా’’ – ఎన్టీఆర్
‘‘సీనియర్ నటుడు చంద్రమోహన్ మృతి బాధాకరం. హీరో, కమెడియన్, సహాయ నటుడిగా విభిన్న పాత్రలు అలవోకగా పోషించిన ఆయన మరణం తెలుగు చిత్ర పరిశ్రమకి తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.’’ – నారా లోకేశ్
‘‘ఆయన మోము మనకు అద్భుతమైన జ్ఞాపకాలు గుర్తుచేస్తుంది. ఆయన చిరస్మరణీయమైన నటన, అద్భుతమైన పాత్రలతో ప్రతిసారీ మన పెదవులపై చిరునవ్వు విరుస్తుంది’’ – సాయి ధరమ్ తేజ్
‘‘విలక్షణ నటుడు చంద్రమోహన్ అకాల మరణం సినిమా జగత్తుకు తీరని లోటు. ఆయనతో పలు సినిమాల్లో కలిసి నటించి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’’ – కల్యాణ్ రామ్
👉 – Please join our whatsapp channel here –