అసెంబ్లీ ఎన్నికలకు రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో మొత్తం 4,798 నామినేషన్ లు దాఖలయ్యాయి. చివరి రోజైన శుక్రవారం అభ్యర్థులు ఏకంగా 2,324 నామినేషన్లు వేశారు. సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న రెండు నియోజకవర్గాల్లోనూ ఎక్కువ మంది నామినేషన్లు సమర్పించారు. గజ్వేల్‌లో అత్యధికంగా 145, కామారెడ్డిలో 92 నామినేషన్లు వచ్చాయి. గజ్వేల్ తర్వాత మేడ్చల్లో 116, ఎల్బీ నగర్ లో 77, మునుగోడులో 74 నామినేషన్లు వేశారు. అత్యల్పంగా నారాయణపేటలో 13, వైరా, మక్తల్ సెగ్మెంట్లలో19 చొప్పున నామినేషన్ లు దాఖలయ్యాయి. ఆయా సమస్యలకు నిరసనగా సీఎం కేసీఆర్‌పై పలువురు బాధితులు నామినేషన్లు వేశారు. వీరిలో రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లిలోని శంకర్ హిల్స్ ప్లాట్ల బాధితులు కూడా ఉన్నారు. గజ్వేల్‌లో సీఎం కేసీఆర్‌పై జగిత్యాల చెరకు రైతులు కూడా పోటీకి దిగారు. నిరుద్యోగులు, తెలంగాణ అమరవీరుల కుటుంబాల తరపున కూడా నామినేషన్ దాఖలు అయింది.
మొత్తం ఓటర్లు 3,26,18,205 మంది..రాష్ట్రంలో మొత్తం 3,26,18,205 మంది ఓటర్లు ఉన్నట్లు సీఈఓ ఆఫీస్ ప్రకటించింది. ఇందులో 1,62,98,418 మంది పురుషులు, 1, 63,01,705 మంది మహిళలు ఉన్నారు. థర్డ్ జెండర్ ఓటర్లు 2,676 మంది ఉన్నట్లు పేర్కొన్నారు. మొత్తం15,406 మంది సర్వీస్ ఓటర్లు, 2,944 మంది ఓవర్సీస్ ఓటర్లు ఉన్నట్లు ప్రకటించారు. ఈ ఏడాది జనవరిలో రిలీజ్చేసిన ఓటర్ల జాబితాతో చూస్తే తాజా జాబితాలో 8.75 శాతం ఓటర్లు పెరిగారు. కొత్తగా 35.73 లక్షల మంది ఓటర్లను యాడ్ చేయగా.. 9.48 లక్షల ఓటర్లను డిలీట్ చేసినట్లు పేర్కొన్నారు. ఇక పోస్టల్ బ్యాలెట్ కోసం 31,551 మంది నుంచి12డీ ఫామ్స్ రిసీవ్ చేసుకున్నట్లు సీఈఓ ఆఫీస్ వివరించింది.
👉 – Please join our whatsapp channel here –