DailyDose

14 ఏళ్లు పైబడిన చదువుతున్న బాలికలందరికీ మెట్రో ప్రయాణం ఉచితం

14 ఏళ్లు పైబడిన చదువుతున్న బాలికలందరికీ మెట్రో ప్రయాణం ఉచితం

విద్యార్థినిలకు స్కూటీలు ఇస్తామని, ల్యాప్‌టాప్‌లిస్తామని అంటున్న కాంగ్రెస్‌ పార్టీ ఆ వర్గానికే మరో కీలక హామీ ఇవ్వబోతోంది. 14 ఏళ్లు నిండి, చదువుకుంటున్న బాలికలందరికీ మెట్రో ప్రయాణాన్ని ఉచితం చేస్తామని చెప్పబోతోంది. పదో తరగతి చదువుకుంటున్న బాలికల నుంచి పీహెచ్‌డీలు చేసే విద్యార్థినుల వరకు అన్ని స్థాయిల్లోని కళాశాలలు, యూనివర్సిటీల్లో చదివే వారికి ఈ సౌకర్యాన్ని వర్తింపజేస్తామని చెపుతోంది. ఈ మేరకు తన ఎన్నికల మేనిఫెస్టోలో హామీలను పొందుపర్చాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించింది.

‘ప్రజా మేనిఫెస్టో’పేరుతో తయారవుతున్న ఈ ప్రణాళిక కోసం కాంగ్రెస్‌ పార్టీ తన కసరత్తును పూర్తి చేసింది. మాజీ మంత్రి శ్రీధర్‌బాబు నేతృత్వంలోని కమిటీ ఇప్పటికే పలుమార్లు సమావేశమై అనేక అంశాలకు తుది రూపు తీసుకువచ్చింది. కమిటీ రూపొందించిన ముసాయిదా మేనిఫెస్టోను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రే, పార్టీ వ్యూహకర్త సునీల్‌ కనుగోలు పరిశీలనకు పంపారని, ఈనెల 14న పార్టీ మేనిఫెస్టో అధికారికంగా విడుదలవుతుందని గాంధీభవన్‌ వర్గాలు చెపుతున్నాయి. అనివార్య కారణాల వల్ల వాయిదా పడితే ఒక రోజు ఆలస్యమవుతుందని అంటున్నాయి.

ప్రజాకర్షకంగా రూపకల్పన..
ఈసారి ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించే పథకాలకు కాంగ్రెస్‌ పార్టీ అధిక ప్రాధాన్యమిస్తోంది. ఆరుగ్యారంటీల పేరుతో మహిళలు, వృద్ధులు, పేద వర్గాలకు చెందిన ఓట్లను రాబట్టుకునే పనిలో పడిన కాంగ్రెస్‌.. మేనిఫెస్టోలో కూడా అన్ని వర్గాల ఓట్లు సంపాదించేలా పథకాలను ప్రతిపాదిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతున్న అమ్మ ఒడి తరహా పథకాన్ని ప్రతిపాదించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అయితే, ఆంధ్రప్రదేశ్‌ తరహాలో పెద్ద మొత్తంలో కాకుండా రూ.1,000 ఆర్థిక సాయం చేయాలనే ప్రతిపాదనపై మేనిఫెస్టో కమిటీ తీవ్ర కసరత్తు చేసింది. ఎంత మొత్తం ప్రతిపాదించాలన్న దానిపై తర్జనభర్జనలు ఓ కొలిక్కి రావడంతో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ పరిశీలనకు ఈ ప్రతిపాదనను పంపినట్టు తెలుస్తోంది. స్థానిక సంస్థల వార్డు మెంబర్లకు నెలకు రూ.1,500 గౌరవవేతనం ఇస్తామనే హామీని కూడా కాంగ్రెస్‌ ఇవ్వబోతోంది.

హైదరాబాద్‌పై ప్రత్యేక దృష్టి..
ఇక, విశ్వనగరం హైదరాబాద్‌ అభివృద్ధిపై కాంగ్రెస్‌ పార్టీ తన మేనిఫెస్టోలో ప్రత్యేక విభాగాన్ని రూపొందిస్తోంది. దినదినాభివృద్ధి చెందుతున్న నగరంలో ట్రాఫిక్‌ నియంత్రణపై ప్రత్యేక ప్రణాâళిక రూపొందిస్తోంది. ఇటు హైదరాబాద్‌తో పాటు అటు రాష్ట్రంలోని ప్రజలందరికీ ఆకర్షణీయంగా ఉండేలా వాహన చలాన్లను ఏకకాలంలో రద్దు చేస్తామని ప్రకటించనుంది.

హైదరాబాద్‌ చుట్టూ నాలుగువైపులా కార్పొరేట్‌ ఆసుపత్రులు, వరదల తాకిడి నుంచి బయటపడేందుకు లోతట్టు ప్రాంతాల్లో నిలిచే నీరు త్వరగా వెళ్లిపోవడం కోసం లింక్‌డ్‌ కెనాల్స్‌ ఏర్పాటు లాంటి ప్రతిపాదనలతో పాటు మూసీ ప్రక్షాళన అంశాన్ని ప్రధానాంశంగా ప్రస్తావించనుంది. మూసీ చుట్టూ రేడియల్‌ రోడ్ల నిర్మాణం, నల్లగొండ జిల్లా వరకు మూసీ కనెక్టివిటీ కారిడార్‌ ఏర్పాటు లాంటి అంశాలను కాంగ్రెస్‌ పార్టీ తన మేనిఫెస్టోలో ప్రకటించనుందని తెలుస్తోంది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z