Politics

నమో కబడ్డీ’ పేరిట అన్ని జిల్లాల్లో కబడ్డీ పోటీలు

నమో కబడ్డీ’ పేరిట అన్ని జిల్లాల్లో కబడ్డీ పోటీలు

దేశవ్యాప్తంగా గ్రామీణ యువతకు మరింత చేరువయ్యేందుకు భాజపా సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. భాజపా కిసాన్‌ మోర్చా (BJP Kisan Morcha) ఆధ్వర్యంలో ‘నమో కబడ్డీ’ (Namo Kabaddi) పేరిట అన్ని జిల్లాల్లో కబడ్డీ పోటీలు నిర్వహించాలని నిర్ణయించింది. నవంబర్‌ 15 (బుధవారం) నుంచి నెలాఖరు వరకు దేశ వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లోనూ ఈ పోటీలు నిర్వహించనున్నారు. తద్వారా గ్రామీణ స్థాయి క్రీడాకారుల్లోని ప్రతిభను వెలికి తీసి.. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వారికి గుర్తింపు తీసుకొచ్చేందుకు కేంద్రం తీసుకొచ్చిన ‘ఖేలో ఇండియా’ కార్యక్రమాన్ని ప్రచారం చేసినట్లవుతుందని భాజపా భావిస్తోంది. అయితే, అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌, మిజోరం, మధ్యప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో ‘నమో కబడ్డీ’ పోటీలను నిర్వహించబోమని కిసాన్‌ మోర్చా వెల్లడించింది.

భాజపా కిసాన్‌ మోర్చాతో పాటు, వివిధ రాష్ట్రాల పార్టీ యూనిట్లు సంయుక్తంగా ఈ పోటీలను నిర్వహిస్తారని భాజపా వెల్లడించింది. ఈ మేరకు ఇటీవల సమావేశమై ప్రత్యేక కమిటీలను కూడా ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. జిల్లా, రాష్ట్ర స్థాయిలో విజేతలకు కేంద్ర మంత్రులుగానీ, ఆయా రాష్ట్రాల భాజపా అధ్యక్షులుగానీ సత్కరిస్తారని తెలిపింది. మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారుల ప్రతిభను గుర్తించేందుకు ‘ఖేలో ఇండియా’ కార్యక్రమాన్ని తీసుకొచ్చిన ప్రధాని మోదీని భాజపా కిసాన్‌ మోర్చా జాతీయ అధ్యక్షుడు ఓం ప్రకాశ్‌ ధంకర్‌ అభినందించారు. దీని ప్రయోజనాలను కూడా దేశ ప్రజలు గుర్తించారని, 2023 ఆసియా క్రీడల్లో భారత్‌ 100కిపైగా పతకాలు సాధించడమే అందుకు నిదర్శనమని ఆయన చెప్పారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z