Politics

6 నెలలకు ఒకరు ముఖ్యమంత్రి అయ్యే ప్రభుత్వం మనకెందుకు?

6 నెలలకు ఒకరు ముఖ్యమంత్రి అయ్యే ప్రభుత్వం మనకెందుకు?

తెలంగాణలో గడిచిన తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసుకున్నామని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. రాష్ట్రం వచ్చాక మౌలిక వసతులు బాగుపడ్డాయని.. కరెంట్, తాగు, సాగు నీటి సమస్యలను పరిష్కరించుకున్నామని చెప్పారు. ధాన్యం దిగుబడిలో తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉందని.. దేశానికే అన్నం పెట్టే స్థాయికి ఎదిగిందని కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ స్టేట్ హ్యాండ్లూమ్‌ అండ్ టెక్స్‌టైల్‌ వీవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్‌ పాల్గొన్నారు.

‘‘రాష్ట్రంలో వెయ్యి గురుకుల పాఠశాలలు పెట్టి పేద బిడ్డలకు ఉచితంగా చదువు అందిస్తున్నాం. ఒక్కో విద్యార్థిపై రూ.లక్ష ఖర్చు చేస్తున్నాం. గత ప్రభుత్వాలు చేసినవి గుర్తుకు తెచ్చుకోవాలి. గడిచిన తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలో ఎంతో అభివృద్ధి చేసి చూపించాం. 65 ఏళ్లు పాలించిన వారు వచ్చి ఒక్క ఛాన్స్‌ అని అడుగుతున్నారు. అన్ని రంగాలను అన్ని విధాలా ఆదుకున్న ఏకైక ప్రభుత్వం భారాస. మన ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే. కొత్త సీసాలో పాత సారానే ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ. సంపద పెంచాలి.. పేదలకు పంచాలి అనేదే మా నినాదం. తెలంగాణలో దృఢమైన నాయకత్వం, స్థిరమైన ప్రభుత్వం ఉండాలి. 6 నెలలకు ఒకరు ముఖ్యమంత్రి అయ్యే ప్రభుత్వం మనకెందుకు?దిల్లీ నుంచి సీల్డ్ కవర్‌లో వచ్చే సీఎంలు మనకెందుకు?’’ అని కేటీఆర్‌ అన్నారు.

‘‘ఇది చేతల ప్రభుత్వం.. చేనేతల ప్రభుత్వం. ఎవరి చేతుల్లో రాష్ట్రాన్ని పెట్టాలో ఆలోచన చేయాలి. ఎవరి చేతుల్లో పెడితే బాగుంటుందో మీరు ఆలోచించాలి. ఆవైపు 11 మంది ముఖ్యమంత్రులున్నారు. ఇటువైపు ఒక్క కేసీఆర్ మాత్రమే ఉన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని టెక్స్‌టైల్‌ పార్క్‌లు ఏర్పాటు చేసుకుందాం. చేనేత రుణమాఫీ చేసుకుందాం. నేతన్నల బాగు కోసం ఏమైనా చేసేందుకు ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది’’ అని కేటీఆర్‌ తెలిపారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z