Politics

కమ్యూనిస్టు పార్టీ నేత ఎన్‌ శంకరయ్య ఇక లేరు

కమ్యూనిస్టు పార్టీ నేత ఎన్‌ శంకరయ్య ఇక లేరు

స్వాతంత్య్ర సమరయోధుడు, కమ్యూనిస్టు పార్టీ నేత (సీపీఐ (ఎం)) ఎన్‌ శంకరయ్య (102) బుధవారం కన్నుమూశారు. గత కొంత కాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతోన్న ఆయన అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆరోజు ఉదయం చెన్నైలో కన్నుమూశారు. తాజాగా తీవ్ర జ్వరం రావడంతో శంకరయ్యను ఆయన కుటుంబసభ్యులు చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ శంకరయ్య చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తమిళనాడుకు చెందిన ఎన్‌ శంకరయ్య దేశ స్వాతంత్య్రపోరాటంలో తనవంతు పాత్ర పోషించారు. 1922లో జన్మించిన శంకరయ్య, లేత వయసులోనే దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడాడు. దాదాపు 9 ఏళ్లు జైలు శిక్ష అనుభవించారు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాలోని 32 మంది జాతీయ కౌన్సిల్ సభ్యులలో ఆయన ఒకరు. సైద్ధాంతిక విభేదాల కారణంగా దాని నుంచి విడిపోయిన ఆయన ఆ తర్వాత 1964లో సీపీఎంను ఆయన స్థాపించారు. కమ్యూనిస్టు నాయకుడిగా సుదీర్ఘకాలం ఆయన రాజకీయాల్లో కొనసాగారు.

సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసి 1967లో మధురై (పశ్చిమ) నియోజకవర్గం నుంచి, 1977, 1980లో మదురై తూర్పు నియోజకవర్గం నుంచి రెండుసార్లు తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. కాగా, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ఇతర డీఎంకే సీనియర్ మంత్రులు ఆసుపత్రికి వెళ్లి ఆయనకు నివాళులర్పించారు. సీఎం స్టాలిన్ తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. స్వాతంత్య్ర సమరయోధుడిగా, అసెంబ్లీ సభ్యుడిగా, రాజకీయ పార్టీ నాయకుడిగా శంకరయ్య చేసిన కృషి మరువలేనిది అని సీఎం స్టాలిన్‌ కొనియాడారు. ఆయన అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. అభిమానుల సందర్శనార్థం అక్కడ కొంతసేపు ఆయన భౌతిక కాయాన్ని ఉంచి, అనతరం శంకరయ్య భౌతికకాయాన్ని చెన్నైలోని సీపీఐ (ఎం) కార్యాలయానికి తరలించారు.

ఏఐఏడీఎంకే, కాంగ్రెస్, విడుతలై చిరుతైగల్ కట్చి (వీసీకే), బీజేపీతో సహా పలు ప్రధాన రాజకీయ పార్టీలు కూడా తమ సంతాపాన్ని తెలిపాయి. 2021లో తమిళనాడు రాష్ట్రానికి ఆయన అందించిన సేవలకు గానూ DMK ప్రభుత్వం తగైసల్ తమిజర్ అవార్డుతో ఆయనను సత్కరించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం తనకు అందించిన రూ. 10 లక్షల నగదు పురస్కారాన్ని ముఖ్యమంత్రి కోవిడ్-19 సహాయ నిధికి విరాళంగా ఆయన తిరిగి ఇచ్చాడు. శంకర్యకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.

తాజాగా ఆయనకు గౌరవ డాక్టరేట్ ఇవ్వడంపై ప్రభుత్వం, గవర్నర్ ఆర్ ఎన్ రవి మధ్య వివాదం చెలరేగింది. శంకరయ్య లాంటి స్వాతంత్ర్య సమరయోధుడిని గవర్నర్ గౌరవించలేకపోతే దానికి కారణం ఆయన ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు తప్ప మరొకటి కాదని, స్వాతంత్ర్య సమరయోధుల పట్ల ఆర్‌ఎస్‌ఎస్‌కు ఎలాంటి గౌరవం లేదని’ తమిళనాడు ఉన్నత విద్యాశాఖ మంత్రి కె పొన్ముడి అప్పట్లో తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z