Politics

కేసీఆర్‌ విజన్‌ కారణంగానే కరెంట్ సమస్యను అధిగమించాం

కేసీఆర్‌ విజన్‌ కారణంగానే  కరెంట్ సమస్యను అధిగమించాం

కేసీఆర్‌ పాలనను మెచ్చుకుంటూ కేంద్రం నుంచి తెలంగాణ ప్రభుత్వానికి ఎన్నో అవార్డులు వచ్చాయని మంత్రి హరీశ్‌రావు అన్నారు. హైదరాబాద్‌లో ‘తెలంగాణ స్టేట్‌ యూనియన్‌ ఆఫ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌’ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మీట్‌ ది ప్రెస్‌’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దేశంలోని ఇతర రాష్ట్రాలు తెలంగాణ దరిదాపుల్లో లేవని చెప్పారు. ఎన్నికల హామీల్లో ప్రకటించని కల్యాణలక్ష్మి, కేసీఆర్‌ కిట్‌, కేసీఆర్‌ బీమా, రైతుబంధు వంటి పథకాలను అమలు చేశామన్నారు.

‘‘పల్లె కన్నీరు పెడుతోంది అనే పాటలు పాడుకునే పరిస్థితిపోయి.. పట్టణాల నుంచే పల్లెలకు వెళ్లి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు సైతం సౌకర్యంగా తమ పనులు చేసుకునే స్థాయిలో అభివృద్ధి చేశాం. నాటి కాంగ్రెస్‌ పాలనను నేటి కేసీఆర్‌ పాలనను బేరీజు వేసుకొని ప్రజలు ఓటెయ్యాలని కోరుతున్నాను. కేసీఆర్‌ విజన్‌ కారణంగానే విద్యుత్‌ సమస్య పరిష్కారమైంది. ఎన్నో రాష్ట్రాల్లో ఇప్పటికీ కోతలు అమలవుతున్నాయి. నాణ్యమైన విద్యుత్‌ ఇవ్వడంతో రైతులు అన్ని కాలాల్లో పంటలు పండించుకుంటున్నారు. మోటార్లు కాలిపోవడం లేదు. పక్క రాష్ట్రాలు రెండు, మూడు గంటలు కరెంటు ఇవ్వడం కూడా గగనమైపోయింది. రైతుబంధు కింద దాదాపు రూ. 72వేల కోట్ల రూపాయలు నగదు బదిలీ జరిగింది. భూగర్భ జలాలను పెంచడంతో కోటి మెట్రిక్‌ టన్నుల ధాన్యం పండే రాష్ట్రం మూడు కోట్ల మెట్రిక్‌ టన్నులు ధాన్యం పండే రాష్ట్రంగా మారింది. పంజాబ్‌ను అధిగమించింది. కర్ణాటక సహా ఇతర ప్రభుత్వాలు సైతం మన రాష్ట్రాన్ని ధాన్యం అడిగే పరిస్థితి వచ్చింది.

గ్రామాల్లో దవాఖానాలు, ప్రతి జిల్లా, నగరాల్లోని ఆస్పత్రులను అభివృద్ధి చేస్తున్నాం. మాతాశిశు మరణాలు తగ్గుముఖం పట్టాయి. ఎంబీబీఎస్‌ సీట్లను 10వేల సీట్లకు పెంచాం. విదేశాలకు వెళ్లకుండా ఈ సౌలభ్యం తెచ్చిన ఘనత భారాస ప్రభుత్వానిది. విద్యలో గుణాత్మక మార్పు తీసుకొచ్చాం. గురుకుల పాఠశాలలను జూనియర్‌ కళాశాలలుగా తీర్చిదిద్దాం. ఆంగ్ల మాధ్యమంలో బోధన, కార్పొరేట్‌ స్థాయి వసతులను పాఠశాల్లో కల్పించేందుకు కృషి చేస్తున్నాం.

ఉద్యోగ నియామకాల విషయంపై ప్రతిపక్షాలు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయి. మన ఉద్యోగాలు మన పిల్లలకు దక్కాలనే ఉద్దేశంతో 95 శాతం ఉద్యోగాలు స్థానికులకు దక్కేలా రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ తీసుకొచ్చాం. గత ప్రభుత్వంలో 1.32 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం. ఈ సారి 80వేల ఉద్యోగాలను భర్తీ చేయాలని సీఎం హామీ ఇచ్చారు. కరోనా, రాష్ట్రపతి ఉత్తర్వులు తీసుకురావడానికి కేంద్రంతో ఏడాదిన్నర పోరాటం చేయాల్సి వచ్చింది. దాదాపు 2 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వ రంగంలో నియామకాలు చేశాం. ప్రైవేటు రంగంలో 24 లక్షల ఉద్యోగాలు వచ్చాయి. ఐటీ రంగంలోనే 6 లక్షల ఉద్యోగాలు వచ్చాయి. భవిష్యత్తులో జాబ్‌ క్యాలెండర్‌ అమలు చేసి ఏ ఏడాది ఉద్యోగాలు ఆ ఏడాదే భర్తీ చేస్తాం. దురదృష్టవశాత్తూ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌లో పేపర్‌ లీక్‌ జరిగింది. వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకొని బాధ్యులపై చర్యలు చేపట్టి.. దోషులను శిక్షించాం. ఐటీ రంగంలో ఒకప్పుడు బెంగళూరు సిలికాన్‌ వ్యాలీగా ఉండేది. ఇప్పుడు ఐటీ ఉత్పత్తుల ఎగుమతిలో రాష్ట్రం నంబర్‌ వన్‌గా మారింది. గూగుల్‌, యాపిల్‌, మైక్రోసాఫ్ట్‌ వంటి పేరుమోసిన కంపెనీలు ఇక్కడ అతి పెద్ద క్యాంపస్‌లను ఏర్పాటు చేశాయి.

10ఏళ్ల కేసీఆర్‌ పాలనలో ఎలాంటి కర్ఫ్యూలు లేవు. హైదరాబాద్‌ను ప్రశాంత నగరంగా మార్చాం. ఒక గ్లోబల్‌ సీటీగా తీర్చిదిద్దడంతో ఇటీవల గ్లోబల్‌ గ్రీన్‌సీటీ అవార్డు వచ్చింది. ఇతర రాష్ట్రాల్లోలా ఇక్కడ కులాలు, మతాలు, ప్రాంతాల చిచ్చులు లేవు. ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు అందాయి. అందుకే తప్పకుండా పాజిటివ్‌ ఓటింగ్‌ జరుగుతుందని ఆశిస్తున్నాం. మళ్లీ మూడోసారి ముఖ్యమంత్రి అయ్యి కేసీఆర్‌ దక్షిణ భారతదేశంలోనే ఓ చరిత్ర సృష్టించబోతున్నారు. అన్ని సమస్యలను ముందుగానే పరిష్కరించి అసెంబ్లీలో ప్రశ్నించడానికి ప్రతిపక్షాలకు అవకాశం లేకుండా చేశాం. అందుకే వారు బూతులు మాట్లాడుతున్నారు. అలాంటి వారికి ప్రజలే ఓటుతో బుద్ధి చెబుతారు.

తెలంగాణలో కాంగ్రెస్‌, భాజపా ఒక్కటయ్యాయి. మూడు ఉప ఎన్నికల్లో డిపాజిట్‌ కోల్పోయిన కాంగ్రెస్‌కు ఇప్పుడు భాజపా సహకరిస్తోంది. మళ్లీ భాజపా, భారాస ఒక్కటేనని బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. భారాస, భాజపా ఒక్కటే అన్న విషయం నిజమైతే మా ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లులను గవర్నర్‌ ఎందుకు ఆపుతారు. ఆమె ఆపడం వల్లే ఆర్టీసీ ఉద్యోగుల బిల్లు ఆలస్యమైంది. సత్యనారాయణ, దాసోజు శ్రవణ్‌ల పేర్లను ఎమ్మెల్సీలుగా ఎంపిక చేస్తే వాటిని ఆపేశారు. భాజపా, భారాస ఒక్కటే అయితే ఆ పార్టీ మా ఎమ్మెల్యేలను ఎందుకు కొనుగోలు చేయాలని చూస్తుంది. తెలంగాణ అడిగిన వాటిని ఇవ్వకుండా కేంద్రం ఎన్నో నిధులను ఆపేసింది. అందుకే కాంగ్రెస్‌ చేసే దుష్ప్రచారాన్ని నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. కాంగ్రెస్‌, భాజపాలు కలిసి లోయర్‌ సీలేరు ప్రాజెక్టు, ఏడు మండలాలు తెలంగాణకు దక్కకుండా చేశాయి. కేసీఆర్‌ పాలననే తెలంగాణ ప్రజలకు శ్రీరామరక్ష. పసిగుడ్డులాంటి తెలంగాణ కేసీఆర్‌ చేతుల్లో ఉండటమే సురక్షితం’’ అని హరీశ్‌ వివరించారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z