సేవా కార్యక్రమాల్లో చురుగ్గా ఉండే ప్రముఖ హీరో మహేశ్‌బాబు (Mahesh Babu) మరోసారి ఉదారత చాటుకున్నారు. ఇప్పటికే మహేశ్ బాబు ఫౌండేషన్ (Mahesh Babu Foundation)ను స్థాపించి ఎంతోమంది చిన్నారులకు గుండె ఆపరేషన్లకు సాయం చేస్తున్నారు. తన తండ్రి కృష్ణ ప్రథమ వర్ధంతి (నవంబరు 15) సందర్భంగా పేద విద్యార్థులకు చేయూతనిచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అదే ‘సూపర్‌స్టార్ కృష్ణ ఎడ్యుకేషనల్ ఫండ్’ (Superstar Krishna Educational Fund). 40మందికి పైగా పేద విద్యార్థులను ఎంపిక చేసి ఈ స్కాలర్షిప్ అందించునున్నారు. పాఠశాల చదువు నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు ఉపకార వేతనం ఇవ్వనున్నారు.
నటి, తన సతీమణి నమ్రతా శిరోద్కర్‌తో కలిసి మహేశ్.. మహేశ్ బాబు ఫౌండేషన్‌ను 2020లో ప్రారంభించిన సంగతి తెలిసిందే. సుమారు 2500 మందికిపైగా చిన్నారులకు గుండెకు సంబంధించిన శస్త్ర చికిత్సలకు సాయం చేశారు. కృష్ణ స్వగ్రామం ఆంధ్రప్రదేశ్‌లోని బుర్రిపాలెంలో ఓ పాఠశాలను నిర్మించారు. మరోవైపు, తన తండ్రిని గుర్తుచేసుకుంటూ మహేశ్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ‘ఎప్పటికీ సూపర్‌స్టార్’ అంటూ కృష్ణ ఫొటోను షేర్ చేశారు. సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) సినిమాతో బిజీగా ఉన్నారు. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నారు. ‘అతడు’, ‘ఖలేజా’ తర్వాత మహేశ్- త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాకావడంతో ‘గుంటూరు కారం’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. వచ్చే ఏడాది జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
👉 – Please join our whatsapp channel here –