తెలంగాణలో ఓటర్ల సంఖ్య భారీగా పెరిగింది. రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3.26 కోట్లకు చేరింది. పురుష, మహిళా ఓటర్లు దాదాపు సమానంగా ఉండగా.. యువ ఓటర్లు 10 లక్షల మంది ఉన్నారు. ఇక తెలంగాణలో హైదరాబాద్ లో అత్యధికంగా ఓటర్లు ఉండగా, ములుగు జిల్లాలో అత్యల్పంగా ఓటర్లు ఉన్నారు.
తెలంగాణలో తుది ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించింది. గతంలో అక్టోబర్ 4న ఓటర్ల జాబితాను ప్రకటించగా 3.17 కోట్ల మంది ఓటర్లు ఉండగా, ఆ తరువాత అక్టోబర్ 31 వరకు కొత్త ఓటర్ల నమోదుకు అవకాశం కల్పించింది ఈసీ. దీంతో మరో 9 లక్షల పైచిలుకు ఓటర్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. దీంతో ప్రస్తుతం తెలంగాణలో ఓటర్ల సంఖ్య 3 కోట్ల 26 లక్షల 2వేల 799 కి చేరింది. ఇందులో 1 కోటి 63 లక్షల 13 వేల 268 మంది పురుష ఓటర్లు ఉండగా, 1 కోటి 63 లక్షల 2 వేల 261 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. అంటే దాదాపుగా పురుష, మహిళా ఓటర్లు సమానంగా ఉన్నారని చెప్పవచ్చు.
ఇక తెలంగాణలో ట్రాన్స్ జెండర్ ఓటర్లు 2676 మంది ఉండగా, ఎన్ఐర్ఐ ఓటర్లు 2,949 మంది ఉన్నారు. 18 నుంచి 19 ఏళ్ల మధ్య వయసులో ఉన్న యువ ఓటర్లు 9 లక్షల 99 వేల 667 మంది ఉన్నారని ఈసీ తెలిపింది. ఇదే సమయంలో 80 ఏళ్లు పైబడిన వృధ్ద ఓటర్లు 4, లక్షల 40 వేల 371 మంది ఉన్నారు. హైదరాబాద్ జిల్లాలో అత్యధిక ఓటర్లు 45 లక్షల 36 వేల 852 మంది ఓటర్లు ఉంగా, రెండవ స్థానంలో రంగారెడ్డి జిల్లాలో 35 లక్షల 22 వేల 420 ఓటర్లు ఉన్నారని ఎన్నికల కమీషన్ తెలిపింది. రాష్ట్రంలో 3వ స్థానంలో మేడ్చల్ జిల్లాలో 28 లక్షల 19 వేల 292 ఓటర్లు ఉన్నారు.
ఇక నియోజకవర్గాల వారిగా చూస్తే శేరిలింగంపల్లిలో తెలంగాణలోనే అత్యధికంగా 7 లక్షల 32 వేల 560 ఓటర్లు ఉన్నారు. 2వ స్థానంలో కుత్బుల్లాపూర్ లో 6 లక్షల 99 వేల 239 మంది ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. తెలంగాణలో అతి తక్కువగా భద్రాచలంలో 1,48,713 మంది ఓటర్లు ఉండగా, అశ్వరావుపేటలో 1 లక్ష 52 వేల 12 మందితో తక్కువ ఓటర్లు ఉన్న నియోజకవర్గాల్లో రెండవ స్థానంలో నిలిచింది.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z