Editorials

“అన్‌వెయిలింగ్ బాండ్స్” నవలను ఆవిష్కరించిన బాలమోహన్‌దాస్

“అన్‌వెయిలింగ్ బాండ్స్” నవలను ఆవిష్కరించిన బాలమోహన్‌దాస్

రచయిత డా॥ స్నేహ వసుంధర ” అన్‌వెయిలింగ్ బాండ్స్” నవలను ఆవిష్కరించిన ఆచార్య బాల మోహన్ దాస్

కుటుంబ బంధాలు, వాటి వెనుక దాగివున్న అపోహలు, ఆత్మీయతతో కూడిన అంశాలను రచయిత డా॥ స్నేహ వసుంధర తన నవలలో గొప్పగా ఆవిష్కరించారని నాగార్జున విశ్వవిద్యాలయం పూర్వ వైస్ చాన్సలర్ ఆచార్య బాల మోహన్ దాస్ అన్నారు. శుక్రవారం ఆంధ్ర విశ్వ విద్యాలయం హిందీభవన్ లో జరిగిన కార్యక్రమంలో రచయిత డా॥ స్నేహ వసుంధర రచించిన ” అన్‌వెయిలింగ్ బాండ్స్” ఆంగ్ల నవలను ఆచార్య వి. బాలమోహన్ దాస్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవల ఆద్యంతం ఆసక్తిదాయకంగా వున్నదని అన్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతీయ వాతావరణంతో కూడిన పాత్రలు, మరీ ముఖ్యంగా లంబసింగి వంటి ప్రాంతాల సౌందర్యాన్ని ఈ ఆంగ్ల నవలలో ప్రస్తావిస్తూ రచన చేయడం అభినందనీయమని అన్నారు. అధ్యక్షత వహించిన లోక్ నాయక్ ఫౌండేషన్ అధ్యక్షులు, పద్మభూషణ్ ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ మాట్లాడుతూ దంత వైద్య నిపుణురాలిగా, కుటుంబ బాధ్యతలతో చిన్న వయసులోనే డా॥ స్నేహ వసుంధర రచనా వ్యాసంగం చేయడం, అదీ అంతర్జాతీయ స్థాయి భాషా ప్రావిణ్యంతో కూడిన రచనలు చేయడం అభినందనీయమని అన్నారు. సామాజిక స్పృహ కలిగించే మరిన్ని రచనలు తన ద్వారా సమాజానికి అందించాలని కోరారు.

రచయిత డా॥ స్నేహ వసుంధర మాట్లాడుతూ తనతోని ఆత్మీయ అనుబంధాలు, చుట్టూ అనుభవాలు, ఆధునిక భారత విశిష్ట సంస్కృతిని నేపధ్యంగా “అన్‌వెయిలింగ్ బాండ్స్ ( అనుబంధాల ఆవిష్కరణ ) నవలా రచన చేయడం జరిగిందని చెప్పారు. ఈ నవల ద్వారా కేవలం కల్పనా సాహిత్య కోణంలో మాత్రమే కాకుండా మన చుట్టూ పెనవేసుకున్న మానవ సంబంధాలను లోతైన విశ్లేషణతో ఆవిష్కరించే ప్రయత్నం చేసినట్టు చెప్పారు. అన్ని వయసుల వారూ చదవదగ్గ ఈ నవల పట్ల సన్నిహితుల నుంచి మంచి స్పందన లభించిందని, పెద్దలు,ఆచార్యుల ఆవిష్కరణతో మరింత మందికి చేరువ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేసారు. తన రచనా ప్రయాణంలో సహకరిస్తూ వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్న అందరికి కృతజ్ఞతలు తెలియజేసారు.

కార్యక్రమంలో డా॥ స్నేహ వసుంధరను ఆచార్యులు బాల మోహన్ దాస్, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ సత్కరించి మరిన్ని రచనలు చేయాలని అభిలషించారు. కార్యక్రమంలో ఆచార్య నల్లా బాబయ్య, అధ్యాపకులు, సాహితీ అభిమానులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z