DailyDose

భూపాలపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం- నేర వార్తలు

భూపాలపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం- నేర వార్తలు

ఉత్తరాఖండ్‌లోని నైనీతాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం 

ఉత్తరాఖండ్‌లోని నైనీతాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని తప్పించే క్రమంలో ఓ పికప్‌ వ్యాన్‌ లోయలో పడింది. ఈ ఘటనలో 8 మంది మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. పతలోట్‌ నుంచి అంజద్‌ వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు నైనీతాల్‌ జిల్లా ఎస్పీ ప్రహ్లాద్‌ నారాయణ్‌ మీనా తెలిపారు. ఘటనాస్థలిలోనే ఆరుగురు మృతి చెందగా.. ఆస్పత్రికి తరలిస్తున్న సమయంలో మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు. మృతులంతా స్థానికులేనని సమాచారం. మృతుల్లో భార్యభర్తతోపాటు వాళ్ల కుమారుడు కూడా ఉన్నట్లు ఎస్పీ వివరించారు. క్షతగాత్రులను ఓఖల్‌కాండా కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. ఈ ఘటనపై ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామి తీవ్ర దిగ్భ్రాంత్రి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు సరైన వైద్యం అందేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

* హైదరాబాద్ తీవ్ర విషాదం

హైదరాబాద్ తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వేధింపుల కారణంగా ఓ కుటుంబం బలవన్మరణానికి పాల్పడింది. కుమార్తెకు ఉరి వేసి మరీ తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన ముషీరాబాద్‌లోని గంగపుత్రకాలనీలో జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.కృష్ణాజిల్లాకు చెందిన సాయికృష్ణ, భార్య చిత్రకళ కూతురు తేజస్వితో కలిసి ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. వారు గురువారం ఆత్మహత్య పాల్పడినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. దీనికి గల కారణాలపై ఆరా తీస్తున్న పోలీసులు వారి ఇంట్లో ఓ గోడకు రాసిన సూసైడ్ నోట్ కనిపించింది. ఈ లేఖలో ఉన్న వివరాల ప్రకారం.. హైదరాబాద్‌ బిర్లా ప్లానిటోరియంలో చిత్రకళ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. అక్కడ జరుగుతున్న అవినీతితోపాటు  కొందరు వేధింపులకు గురిచేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులతో పాటు మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి ఫలితం లేదని గోడపై రాసి ఉండటం ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది. మరోవైపు వేధింపులకు గురి చేస్తున్న వారి పేర్లు కూడా లేఖలో ఉండటంతో పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు.

అక్రమంగా కరెంట్ వినియోగించిన మాజీ సీఎం

కర్ణాటక మాజీ సీఎం, జేడీ(ఎస్) చీఫ్ కుమారస్వామి తాజాగా వివాదంలో చిక్కుకున్నారు. విద్యుత్ స్తంభం నుంచి అక్రమంగా కరెంట్ వినియోగించిన కారణంగా కుమారస్వామిపై మంగళవారం కేసు సైతం నమోదైంది. దీపావళి సందర్భంగా కరెంట్‌ను అక్రమంగా వినియోగించగా జయనగర్‌లోని బెస్కామ్ విజిలెన్స్ స్క్వాడ్ అధికారులు కుమారస్వామి ఇంటికి వెళ్లి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అనంతరం ఫైన్ విధించారు. బెంగళూరులోని తన ఇంటికి అలంకరించే క్రమంలో ఓ స్తంభం నుంచి తీగలను వేసినట్లు బేస్కాం(బెంగళూరు విద్యుత్తు సరఫరా సంస్థ) అధికారులు గుర్తించారు. అయితే ఈ వివాదంపై కుమారస్వామి స్పందిస్తూ.. తన ఇంటిని అలంకరించే బాధ్యతను ఓ ప్రైవేటు డెకొరేటర్‌కు అప్పగించామన్నారు. కేవలం టెస్టింగ్ కోసమే బయట నుంచి కరెంట్ తీసుకున్నట్లు తెలిపారు. ఆ సమయంలో తాను ఇంట్లో లేనని తెలిపారు. దేశం, రాష్ట్రం మునిగిపోయే పని తానేమి చేయలేదన్నారు. ఈ ఘటనలో మాజీ సీఎం రూ.68,526ను జరిమానాగా చెల్లించారు.

12 ఏళ్ల బాలికను నలుగురు వ్యక్తులు కిడ్నాప్

నలుగురు వ్యక్తులు ఒక బాలికను కిడ్నాప్ చేశారు. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలో ఈ సంఘటన జరిగింది. 12 ఏళ్ల బాలికను నలుగురు వ్యక్తులు ఇంటి నుంచి కిడ్నాప్ చేశారు. కిలోమీటరు దూరంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ ఆ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అపస్మారక స్థితిలో పడి ఉన్న బాలికను గుర్తించిన కొందరు పోలీసులకు సమాచారం ఇచ్చారు.కాగా, బాధిత బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ముగ్గురు వ్యక్తులపై అనుమానం వ్యక్తం చేసింది. పెళ్లి చేసుకోవాలని ఒక వ్యక్తి తన కుమార్తెను బలవంతం చేస్తున్నాడని ఆరోపించింది. బాధిత బాలిక స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేసినట్లు పోలీస్‌ అధికారి తెలిపారు. నలుగురు నిందితుల్లో ఇద్దరిని అరెస్ట్‌ చేసినట్లు చెప్పారు. మరో ఇద్దరు నిందితుల కోసం వెతుకుతున్నట్లు వివరించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

* భూపాలపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రేగొండ మండల శివారులో వేగంగా దూసుకొచ్చిన ఓ కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో  ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.  ఇద్దరు పరిస్థితి సీరియస్ గా వున్నట్లు సమాచారం. మోగులపెల్లి మండలంలో ఓ వివాహానికి హాజరై అర్థరాత్రి తిరిగి వస్తుండగా కారు చెట్టును ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో మృతి చెందిన వారిని మండలంలోని సుల్తాన్పూర్ గ్రామానికి చెందిన పూజారి పవన్ (23), సుబ్బక్కపల్లి గ్రామానికి చెందిన చింతల సాయి కిరణ్(23)లుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

* జమ్ముకశ్మీర్‌ కుల్గాం జిల్లాలో ఎన్‌కౌంటర్‌

జమ్మూ కాశ్మీర్‌లో భద్రతా బలగాల యాంటీ టెర్రర్ ఆపరేషన్ కొనసాగుతోంది. దక్షిణ కాశ్మీర్‌లోని కుల్గాం జిల్లా సామ్నులో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ప్రాంతాన్ని అన్ని వైపుల నుంచి భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. ఉగ్రవాదులు దాగి ఉన్నారన్న సమాచారంతో… జమ్మూ కాశ్మీర్ పోలీసులు మరియు ఆర్మీ సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహిస్తోంది.సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుండగానే ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. దీంతో అలర్ట్ అయిన భద్రతా దళాలు ఎదురుకాల్పులు ప్రారంభించారు. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.అంతకుముందు ఉరీ సెక్టార్‌లో ఉగ్రవాదులపై భద్రతా బలగాలు ఆపరేషన్ కలి ప్రారంభించాయి. ఈ ఆపరేషన్ సమయంలో, ఉగ్రవాది బషీర్ అహ్మద్ మాలిక్ మరియు అతని సహచరుడు అహ్మద్ ఘనీ షేక్ మృతి చెందారు. దాదాపు 30 ఏళ్లుగా లోయలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడిన బషీర్‌ ఎన్‌కౌంటర్‌ను పెద్ద విజయంగా పరిగణిస్తున్నారు.

ప్రభుత్వ ఉపాధ్యాయుడు బలవన్మరణం

కుటుంబ సమస్యలతో ప్రభుత్వ ఉపాధ్యాయుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన గద్వాల మండలంలో చోటు చేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని న్యూ హౌసింగ్‌బోర్డులో నివాసం ఉంటున్న విజయ్‌మోహన్‌రెడ్డి(53) మోమిన్‌మొహల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాడు.కొంతకాలంగా ఇంట్లో సమస్యలు తీవ్రం కావడంతో బుధవారం ఇంట్లోంచి ఎవరికి చెప్పకుండా బయటకు వెళ్లి మండలంలోని పూడురూ గ్రామ శివారులోని ఓ వ్యవసాయ పొలంలో చెట్టుకు చీరతో ఉరేసుకున్నాడు. గురువారం ఉదయం స్థానిక రైతులు గమనించి రూరల్‌ పోలీసులకు సమాచారం అందించారు. ఎస్‌ఐ ఆనంద్‌ చేరుకుని పరిశీలించగా మృతుడి గుర్తింపుకార్డు గుర్తించి వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుడికి ఇద్దరు భార్యలు కాగా మొదటి భార్యకు ఇద్దరు కుమారులు ఉన్నారు. మొదటి భార్య కొన్నేళ్ల క్రితమే రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు ఎస్‌ఐ వివరించారు. రెండో భార్య స్వాతికి 6ఏళ్ల కూతురు ఉంది. కుమారుడు హేమంత్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z