NRI-NRT

యెమెన్‌లో భార‌తీయ మ‌హిళ‌కు మరణశిక్ష

యెమెన్‌లో భార‌తీయ మ‌హిళ‌కు మరణశిక్ష

భారతీయ నర్సుకు యెమెన్ (Yemen) ఉరిశిక్ష విధించింది. యెమెన్ జాతీయుడిని హత్య చేసిన కేసులో కేరళ (Kerala) కు చెందిన నిమిషా ప్రియా (Nimisha Priya) అనే నర్సుకు ఆ దేశంలో మరణశిక్ష పడింది. 2017 నుంచి యెమెన్ జైలు శిక్ష అనుభవిస్తుంది. హత్య నేరానికి గాను 2018లో అక్కడి సుప్రీంకోర్టు ఆమెకు ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. తాజాగా ఆమె మరణశిక్ష అప్పీల్‌ను యెమెన్ కోర్టు మరోసారి తిరస్కరించింది. తలాల్ అబ్దో మహదీ అనే యెమెన్ జాతీయుడి నుంచి తన పాస్‌పోర్ట్‌ (Passport) ను తిరిగి తీసుకునే క్రమంలో జరిగిన గొడవలో అతనికి మత్తుమందు ఇంజెక్ట్ చేసి ప్రియా చంపినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ కేసులోనే ఆమెను యెమెన్ న్యాయస్థానం దోషిగా తేల్చింది. ఇదిలాఉంటే.. యెమెన్‌ వెళ్లాలని ప్రియా తల్లి చేసిన అభ్యర్థనపై వారంలోగా నిర్ణయం తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టు గురువారం కేంద్రాన్ని కోరింది.

కాగా, అరబ్ దేశంలో జరుగుతున్న అంతర్యుద్ధం కారణంగా 2017 నుంచి భారతీయ పౌరులకు ప్రయాణ నిషేధం ఉన్న సంగతి తెలిసిందే. అయిన్నప్పటికీ యెమెన్ వెళ్లేందుకు అనుమతి కోరుతూ ప్రియా తల్లి ఈ ఏడాది ప్రారంభంలో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అలాగే ప్రియా తల్లి ఆమెను విడుదల చేయడానికి ‘బ్లడ్ మనీ’ (Bloodmoney) ఇవ్వడం కోసం తలాల్ అబ్దో మహదీ కుటుంబంతో చర్చలు జరపడానికి ఆ దేశానికి వెళ్లాలని కోరుతోంది. ఇదే విషయాన్ని న్యాయవాది సుబాష్ చందరన్.. పిటిషనర్ తరపున గతంలో కోర్టును అభ్యర్థించారు. తన కుమార్తెను రక్షించడానికి ఏకైక మార్గం బాధితురాలి కుటుంబంతో నేరుగా చర్చలు జరపడమేనని ప్రియా తల్లి చెబుతోంది.ఈ ప్రక్రియ యెమెన్‌లో ఆమెను శిక్ష నుంచి తప్పించేలా చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే, ప్రస్తుతం భారతీయ పౌరులపై ఉన్న ప్రయాణ ఆంక్షలు దీనికి అడ్డంకిగా మారాయి. ఇటీవల జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. యెమెన్‌కు ప్రయాణ నిషేధాన్ని సడలించవచ్చని, నిర్దిష్ట కారణాలు, పరిమిత వ్యవధి కోసం భారతీయ పౌరులు ఆ దేశాన్ని సందర్శించడానికి అనుమతిస్తున్నారని కేంద్రం తరపు న్యాయవాది గురువారం హైకోర్టుకు తెలియజేశారు.

ఎవరీ నిమిషా ప్రియా..కేరళ రాష్ట్రం పలాక్కడ్ జిల్లాకు చెందిన నిమిషా ప్రియా 2014లో భర్త థామస్, కూతురితో కలిసి యెమెన్ వెళ్లారు. అయితే, ఆర్ధిక కారణాల వల్ల ఆమె భర్త థామస్, కూతురు అదే ఏడాది స్వదేశానికి తిరిగి వచ్చేశారు. ప్రియా మాత్రం అక్కడి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సుగా కొనసాగింది. ఈ క్రమంలో ఆ తర్వాతి ఏడాది తాను సొంతంగా ఓ క్లినిక్ ఏర్పాటు చేసుకోవాలని భావించిన ప్రియా.. తన భర్త స్నేహితుడైన యెమెన్ జాతీయుడు తలాల్ అబ్దో మహదీ సహాయం కోరింది. దీనికి కారణం.. ఆ దేశంలో విదేశీయులు ఏదైనా సొంత బిజినెస్, సంస్థ ఏర్పాటు చేసేందుకు అవసరమయ్యే లైసెన్స్ పొందేందుకు యెమెనీల హామీ ఉండాల్సి ఉంటుంది. అందుకే ఆమె తలాల్ సాయం కోరింది. కానీ, అతడు ప్రియాకు ఎలాంటి సహాయం చేయలేదు. దాంతో మరో వ్యక్తి సహాయంతో ఆమె 2015లో ఓ క్లినిక్ ఏర్పాటు చేసుకుంది. అలా ప్రియా 2015లో మహదీ సహాయం లేకుండానే స్వయంగా క్లినిక్‌ని ప్రారంభించింది. ఆమెకు ఆదాయం రావడం ప్రారంభమైన వెంటనే ప్రియా సంపాదనలో కొంత భాగం తనకు కావాలని మహదీ పట్టుబట్టాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య గొడవ పెద్దదయింది. కొన్ని రోజుల తర్వాత ప్రియా తన భార్య అంటూ తలాల్ నకిలీ పెళ్లి సర్టిఫికేట్ క్రియేట్ చేసి, ఆమెను వేధించడం మొదలెట్టాడు. అతడి వేధింపులు ఎక్కువ కావడంతో 2016లో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రియా ఫిర్యాదుతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. కొంతకాలం జైలులో ఉన్న తలాల్.. ఆ తర్వాత బెయిల్‌పై విడుదలయ్యాడు. జైలు నుంచి బయటకు వచ్చిన అతడు.. ప్రియా పాస్‌పోర్టును లాక్కున్నాడు.

తలాల్ హత్య..పలుమార్లు తన పాస్‌పోర్టు తనకు ఇచ్చేయాలని తలాల్‌ను ఆమె కోరింది. కానీ, ఎంతకీ అతడు వినలేదు. ఈ క్రమంలో 2017లో ఒకరోజు ప్రియా అతనికి మత్తు ఇంజక్షన్ (sedative injection) ఇచ్చింది. దాని ఓవర్‌డోస్ కారణంగా తలాల్ చనిపోయాడు. దాంతో తనకు క్లినిక్ ప్రారంభించడంలో సాయపడ్డ యెమనీ అబ్దుల్ హనంతో కలిసి తలాల్ మృతదేహాన్ని ముక్కలు చేసి వాటర్ ట్యాంక్ పడేసింది. ఆ తర్వాత తలాల్ బాడీని గుర్తించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ సమయంలోనే అతనితో ప్రియాకు ఉన్న గొడవల గురించి తెలుసుకున్నారు పోలీసులు. వెంటనే ఆమెతో పాటు అబ్దుల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో వారిద్దరూ తమ నేరాన్ని అంగీకరించారు. 2017లో యెమెన్ కోర్టు ఆమెకు జీవితకారాగార శిక్ష విధించింది. ఆ తర్వాత 2018లో ఆ శిక్షను మరణ శిక్షగా మార్చింది. దాంతో తన కూతురిని కాపాడుకునేందుకు ప్రియా తల్లి మృతుడు తలాల్ ఫ్యామిలీతో మాట్లాడానికి ప్రయత్నించడం జరిగింది. అతని కుటుంబ సభ్యులు ‘బ్లడ్‌మనీ’ (పరిహారం) రూపంలో రూ.70లక్షలు డిమాండ్ చేశారు. తాను అంత ఇవ్వలేనని, కొంత తగ్గించాలని ప్రియా వారిని మోరపెట్టుకుంది. కానీ, తలాల్ కుటుంబం అందుకు ఒప్పుకోలేదు. ఆ తర్వాత యెమెన్‌లోని ఓ భారతీయ స్వచ్ఛంద సంస్థ ‘సేవ్ నిమిషా ప్రియా’ (“Save Nimisha Priya International Action Council” ) పేరిట ప్రత్యేక విరాళాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. అలా కొంత మొత్తం ప్రియాకు విరాళాల రూపం దక్కాయి. ఇప్పుడు ఆమె తల్లి తలాల్ ఫ్యామిలీతో మాట్లాడి వారికి పరిహారం ఇవ్వడంతో పాటు చర్చలు జరపాలని అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z