DailyDose

ఎన్నికల సందర్భంగా హైకోర్టుకు సెలవు-తాజా వార్తలు

ఎన్నికల సందర్భంగా హైకోర్టుకు సెలవు-తాజా వార్తలు

ఎన్నికల సందర్భంగా  హైకోర్టుకు సెలవు

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఈనెల 30న హైకోర్టుకు సెలవు ప్రకటిస్తూ శనివారం రిజిస్టర్‌ జనరల్‌ ఉత్తర్వులు జారీ చేశారు. హైకోర్టుతోపాటు జ్యుడీషియల్‌ అకాడమీ, లీగల్‌ సర్విసెస్‌ అథారిటీ, లీగల్‌ సర్విసెస్‌ కమిటీ, మీడియేషన్‌ అండ్‌ ఆర్బిట్రేషన్‌ సెంటర్‌కు ఈ సెలవు వర్తిస్తుందని చెప్పారు. ఈ సెలవు నేపథ్యంలో డిసెంబర్‌ 16 (శనివారం)ను పనిదినంగా ప్రకటించారు. న్యాయవాదులు, కక్షిదారులు, కోర్టుల సిబ్బందికి సమాచారం కోసం ప్రకటన విడుదల చేసినట్లు వెల్లడించారు.

* భక్తులతో కిటకిటలాడిన  శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రం

 ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రం(Mallanna temple )ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. మల్లన్న స్వామి మమ్మేలు స్వామి అంటూ భక్తులు చేసిన నామస్మరణలతో శైవక్షేత్రం పులకరించింది. స్వామి వారి ఉత్సవాలు ముగిసినప్పటికి పలు ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో మల్లన్న క్షేత్రానికి తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు. కొమురవెల్లి క్షేత్రానికి 10వేల మంది భక్తులు వచ్చి మొక్కులు తీర్చుకున్నట్లు ఆలయ ఈవో అలూరి బాలాజీ తెలిపారు.శనివారం సాయంత్రం నుంచే కొమురవెల్లికి చేరుకున్న భక్తులు ఆదివారం స్వామి వారిని దర్శించుకోవడంతో పాటు అభిషేకాలు, పట్నాలు, అర్చన, ప్రత్యేక పూజలు, ఒడి బియ్యం, కేశఖండన, గంగరేగు చెట్టు వద్ద ముడుపులు కట్టడం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. కొండపైన ఉన్న ఎల్లమ్మను దర్శించుకోవడంతో పాటు మట్టి పాత్రలతో అత్యంత భక్తిశ్రద్ధలతో బోనం తయారు చేసి మొక్కులు తీర్చుకున్నారు. మరికొందరు రాతిగీరలు వద్ద ప్రదక్షణలు, కోడెల స్థంబం వద్ద కోడెలు కట్టి పూజలు నిర్వహించారు.

తెలంగాణలో మరోసారి అమిత్ షా పర్యటన

కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరోసారి తెలంగాణలో పర్యటించనున్నారు. శనివారం రాష్ట్రంలో పర్యటించిన ఆయన పలు సభలో పాల్గొని సాయంత్రం బీజేపీ మేనిఫెస్టోని ప్రకటించారు. కాగా ఆదివారం వరల్డ్ కప్ ఫైనల్ లో పాల్గొనేందుకు అహ్మదాబాద్ వెళ్లారు. ఆయన రేపు మరోసారి తెలంగాణలో పర్యటించనున్నాడు. సోమవారం మధ్యాహ్నం 12.35 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి బయలుదేరి 1 గంటలకు జనగామ పబ్లిక్ మీటింగ్ కు హాజరవుతారు.ఆ తర్వాత అక్కడ సభ అనంతరం 2.45 గంటలకు నిజామాబాద్ జిల్లాలోని కోరుట్లకు చేరుకుంటారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి 3.40 వరకు సభలో పాల్గొంటారు. అనంతరం కోరుట్ల నుంచి బయలుదేరి 4.45 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని.. అక్కడి నుంచి అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఉప్పల్ చేరుకుంటారు. సాయంత్రం 5.30 గంటల నుంచి 7 గంటల వరకు రోడ్ షో లో పాల్గొంటారు. రోడ్ షో ముగిశాక 8.10 గంటలకు ఢిల్లీకి పయనం కానున్నారు .

టీమిండియాకు శుభాకాంక్షలు తెలిపిన  ప్రముఖులు

టీమిండియా ఇవాళ వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా జట్టుతో తలపడుతోంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం ఈ మ్యాచ్ కు వేదిక. ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో టీమిండియాపై శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, విపక్ష నేత రాహుల్ గాంధీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, తెలంగాణ అధికారపక్షం బీఆర్ఎస్ పార్టీ తదితరులు టీమిండియాకు విషెస్ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ: ఆల్ ది బెస్ట్ టీమిండియా! మీరు కప్ గెలవాలని  140 కోట్ల మంది భారతీయులు మిమ్మల్ని ఉత్సాహపరుస్తున్నారు. మీరు ఈ మ్యాచ్ లో కాంతులీనాలని, బాగా ఆడి క్రీడాస్ఫూర్తిని మరింత ఉన్నతస్థాయికి తీసుకెళ్లాలని ఆకాంక్షిస్తున్నాను.అమిత్ షా: ఈ వరల్డ్ కప్ టోర్నీలో మన జట్టు విజయాలు, రికార్డులతో మోత మోగించింది. 140 కోట్ల మంది ప్రజలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఇవాళ టీమిండియాకు మద్దతుగా నిలుస్తున్నారు. టీమిండియాకు నా బెస్ట్ విషెస్. బరిలో దిగి కప్ తీసుకురండి.రాహుల్ గాంధీ:  ఆస్ట్రేలియా జట్టుతో క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్స్ ఆడుతున్న టీమిండియా కుర్రాళ్లకు బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను. భయం లేకుండా మ్యాచ్ బరిలో దిగండి. మీకోసం వంద కోట్లకు పైగా హృదయాలు స్పందిస్తున్నాయి. మనం వరల్డ్ కప్ ను తీసుకువద్దాం. ఇండియా గెలవాలి.అరవింద్ కేజ్రీవాల్: వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఆడుతున్న టీమిండియాకు శుభాకాంక్షలు. మీ సత్తా ఏంటో చూపించండి. మీ అత్యుత్తమ ఆటతీరును బయటికి తీసుకురండి. మీ జైత్రయాత్రను కొనసాగిస్తూ చరిత్ర సృష్టించండి. యావత్ దేశం మీ వెంటే ఉంది.కేసీ వేణుగోపాల్: ఇవాళ్టి మ్యాచ్ సందర్భంగా భారత క్రికెట్ జట్టుకు శుభాకాంక్షలు. టీమిండియా… నువ్వు చాంపియన్ జట్టువి. నీ వెంటే మేమందరం కూడా.బీఆర్ఎస్ పార్టీ: క్రికెట్ ప్రపంచ కప్ తుది పోరులో మన భారత జట్టు విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ… ఆల్ ది బెస్ట్.

* చరిత్ర సృష్టించిన రోహిత్‌ శర్మ

వన్డే ప్రపంచకప్‌-2023లో భాగంగా ఆస్ట్రేలియాతో జరగుతున్న ఫైనల్లో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. మరోసారి జట్టుకు అద్బుతమైన ఆరంభాన్ని ఇచ్చాడు. కేవలం 31 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 47 పరుగులు చేశాడు. భారత ఇన్నింగ్స్‌ 10 ఓవర్‌లో మాక్స్‌వెల్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించిన హిట్‌మ్యాన్‌.. హెడ్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు.కాగా ఈ మెగా టోర్నీలో రోహిత్‌ శర్మ ఓవరాల్‌గా 597 పరుగులు సాధించాడు. తద్వారా ఓ అరుదైన ఘనతను రోహిత్‌ తన పేరిట లిఖించుకున్నాడు.వరల్డ్‌కప్‌ సింగిల్‌ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ నిలిచాడు.ఇప్పటివరకు ఈ రికార్డు న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ పేరిట ఉండేది. 2019 వరల్డ్‌కప్‌లో విలియమ్సన్‌ 578 పరుగులు చేశాడు. తాజా మ్యాచ్‌తో కేన్‌ మామ ఆల్‌టైమ్‌ రికార్డును హిట్‌మ్యాన్‌ బ్రేక్‌ చేశాడు.

నటి రాధ  కుమార్తె కార్తిక వివాహం

అలనాటి నటి రాధ కుమార్తె, ‘రంగం’ ఫేమ్‌ కార్తిక (Karthika) మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. రోహిత్‌ మేనన్‌తో ఆమె ఏడడుగులు వేశారు. ఆదివారం ఉదయం కేరళలో వీరి వివాహం వేడుకగా జరిగింది. కుటుంబసభ్యులు, సన్నిహితులతోపాటు చిరంజీవి – సురేఖ దంపతులు, రాధిక, సుహాసిని, రేవతి..తదితరులు ఈ పెళ్లి వేడుకలో పాల్గొన్నారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. దీనికి సంబంధించిన పలు ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.2009లో తెరకెక్కిన ‘జోష్‌’తో కార్తిక హీరోయిన్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. 2011లో విడుదలైన ‘రంగం’తో ఆమె విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత పలు తెలుగు, మలయాళం, తమిళ చిత్రాల్లో నటించారు. ‘దమ్ము’, ‘బ్రదర్‌ ఆఫ్‌ బొమ్మాళి’ వంటి చిత్రాల్లో ఆమె కీలక పాత్రలు పోషించారు. 2015 తర్వాత నుంచి కార్తిక వెండితెరకు దూరంగా ఉంటున్నారు.

* కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ పథకాలు పేద ప్రజల కోసమే

తెలంగాణ వచ్చిన తర్వాత.. మన తలరాతలు మారుతాయని అనుకున్నాం.. కానీ ఏ ఒక్కరి తలరాత మారలేదని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ బడులు, దవాఖానాలో మౌలిక సదుపాయాలు లేవని చెప్పారు.తన రాజీనామా దెబ్బకు 110 కొత్త ఆసరా పింఛన్లు మంజూరయ్యాయని తెలిపారు. కాంగ్రెస్ అమల్లోకి వస్తే తెలంగాణను బాగా అభివృద్ధి చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ పథకాలు పేద ప్రజల కోసమే ప్రవేశపపెట్టబోతుందని చెప్పారు.పేదలు, మైనార్టీ, బడుగు బలహీన వర్గాలకు సాయం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు. ప్రజల కోసం నిజాయితీగా పనిచేసే వ్యక్తిని గెలిపించాలని కోరారు. నల్గొండ జిల్లా గట్టుప్పల మండలం వెల్మకన్నె గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

*  బాలీవుడ్ లో విషాదం

బాలీవుడ్ ద‌ర్శ‌కుడు, ధూమ్‌, ధూమ్ 2 ద‌ర్శ‌కుడు సంజ‌య్ గ‌ధ్వి (Sanjay Gadhvi) గుండెపోటుతో మ‌ర‌ణించారు. హృతిక్ రోష‌న్‌, అభిషేక్ బ‌చ్చ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెర‌కెక్కిన ధూమ్ ఫ్రాంచైజీతో సంజ‌య్‌కు విశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ ల‌భించింది. మ‌రో మూడురోజుల్లో 57వ ఏట అడుగుపెట్ట‌నుండ‌గా ఈ విషాదం జ‌ర‌గ‌డంతో ఆయ‌న కుటుంబస‌భ్యులు, బంధుమిత్రులు శోక‌సంద్రంలో మునిగిపోయారు. సంజ‌య్‌కు భార్య‌, ఇద్ద‌రు కూతుళ్లు ఉన్నారు. ఆయ‌న ఇటీవ‌ల ఫ్రెండ్స్‌తో క‌లిసి మ‌ల్టీప్లెక్స్‌లో సినిమాలు చూశార‌ని చెబుతున్నారు. సంజయ్ మేరే యార్ కి షాదీ హై, కిడ్నాప్ మూవీల‌కూ కూడా ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. 2020లో ఆజాద్ గ‌జ‌బ్ ల‌వ్‌, ఆప‌రేష‌న్ ప‌రిందే మూవీల‌ను కూడా ఆయ‌న తెర‌కెక్కించారు.సంజ‌య్ గ‌ధ్వి 2000లో తేరే లియే మూవీతో డైరెక్ట‌ర్‌గా కెరీర్ ఆరంభించారు. 2004లో యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ధూమ్‌తో సంజ‌య్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నారు. సంజ‌య్ మ‌ర‌ణం ప‌ట్ల ప‌లువురు బాలీవుడ్ ప్ర‌ముఖులు ట్విట్ట‌ర్ వేదిక‌గా త‌మ ప్ర‌గాఢ సంతాపం తెలిపారు. కుటుంబ స‌భ్యుల‌కు త‌మ సానుభూతి తెలిపారు.

అరాచకంగా ప్రాణాలు తీస్తున్నారని లోకేశ్ ఆందోళన 

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ నుంచి అరాచక శక్తులు పెట్రేగిపోతున్నాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. అధికార అండదండలతో వైసీపీ చేస్తున్న నెత్తుడి దాహానికి అడ్డూ అదుపు లేకుండా పోతోందని లోకేశ్ విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం తమపై అక్రమ కేసులు పెట్టి, అరెస్టులు చేయిస్తుంటే… కింది స్థాయిలో అయితే మరీ అరాచకంగా ప్రాణాలు తీస్తున్నారని లోకేశ్ ఆందోళన వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేత రామారావు హత్యపై నారా లోకేశ్ స్పందించారు. టీడీపీ నేత పత్తి రామారావును వైసీపీ నేతలే హతమార్చారని నారా లోకేశ్ ఆరోపించారు. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం కొత్తఅంబాపురంలో టీడీపీ నేత పత్తి రామారావును వైసీపీ రౌడీ మూకలు దారుణంగా హత్య చేసారన్నారు. వివాదరహితుడు, టీడీపీ కోసం పనిచేసే రామారావును హత్యచేయడాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు నారా లోకేశ్ తెలిపారు. పల్నాడు జిల్లాను సస్యశ్యామలం చేయడమంటే రక్తం పారించడమా జగన్ రెడ్డి? అని లోకేశ్ నిలదీశారు. వైసీపీకి రోజులు దగ్గరపడే టీడీపీ కార్యకార్తలపై రోజుకో దాడి, హత్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. పత్తి రామారావు హత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని లోకేశ్ డిమాండ్ చేసారు. వైసీపీ రౌడీ మూకల చేతిలో దారుణంగా హత్యకు గురైన పత్తి రామారావు కుటుంబానికి టీడీపీ అన్నివిధాలా అండగా ఉంటుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ భరోసానిచ్చారు. ఇకపోతే కొత్త అంబాపురం గ్రామానికి చెందిన పత్తి రామారావు(73) టీడీపీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు.  రామారావుకు భార్య ఇద్దరు కుమారులు సంతానం. ఒక కుమారుడు విదేశాల్లో ఉండగా మరో కుమారుడు హైదరాబాద్‌లో ఉంటున్నాడు. రామారావు భార్య సైతం చిన్న కుమారుడి వద్ద ఉంటుంది. దీంతో కొత్త అంబాపురంలో పత్తి రామారావు ఒక్కడే ఉంటున్నారు. తెలుగుదేశం పార్టీలో చాలా చురుగ్గా ఉంటున్నాడు రామారావు. అయితే ఇంట్లో ఒంటరిగా ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు అతడిపై దాడి చేసి అత్యంత దారుణంగా హత్య చేశారు. గొంతు కోసం హతమార్చారు. స్థానికుల ద్వారా రామారావు హత్యపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే పత్తి రామారావును హత్య చేశారని టీడీపీ ఆరోపిస్తోంది. మరోవైపు ఆస్తి తగాదాలు కూడా హత్యకు దారితీయోచ్చు అని ప్రచారం కూడా ఉంది. అయితే రామారావు హత్యకు గల కారణాలపై పోలీసులు ఏం తేల్చనున్నారో తెలియాల్సి ఉంది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z